Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నేతన్నకు కోత

నేతన్న నేస్తం పథకానికి ఈ ఏడాది ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. చేనేత రంగాన్ని ఆదుకుంటామని పదేపదే చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మాటలు నీటి మీద రాతలయ్యాయి. నేతన్న నేస్తానికి జగన్‌ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది.

రైతు భరోసా పొందినా…
విద్యుత్‌ బిల్లు రూ.300 దాటినా..
పథకానికి తూట్ల కోసం సవాలక్ష ఆంక్షలు
చేనేత సంఘాల ఆగ్రహం.. ఉద్యమాలకు సిద్ధం

విశాలాంధ్ర బ్యూరో`ఏలూరు :
చేనేత రంగాన్ని ఆదుకుంటామని పదేపదే చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మాటలు నీటి మీద రాతలయ్యాయి. నేతన్న నేస్తానికి జగన్‌ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ముడిసరుకు, పెట్టుబడి, ముద్ర రుణాలు వంటి అనేక పథకాలకు మంగళం పాడిన ప్రభుత్వం 2019లో నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. మగ్గం కలిగిన ప్రతి చేనేతకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కొంతమేరకు ఊరట లభించిందని నేతన్నలు భావించారు. మొదటి రెండేళ్లు అర్హులందరికీ చేనేత నేస్తం వర్తింపజేశారు. మూడో విడత అమలు నాటికి కథ అడ్డం తిరిగింది. నిధుల లేమితో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మూడో విడత అమలు సమయానికి కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింపజేస్తూ షరతులు విధించింది. తెల్లరేషన్‌ కార్డు తప్పనిసరి చేసింది. నిరుత్సాహానికి గురైన చేనేత కార్మికులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఎక్కడికక్కడ చేనేత కార్యాలయాలను ముట్టడిరచారు. నేతన్నల ఆక్రోశం, ఆగ్రహాన్ని పట్టించుకోని ప్రభుత్వం..తాను అనుకున్న నిబంధనలు అమలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కార్మికులు చేనేతరంగంపై జీవిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 22 సంఘాలలో 6,948 మంది కార్మికులు చేనేత వృత్తిపై జీవిస్తున్నారు. పరోక్షంగా 30 వేల మందికి పైగా చేనేతరం గంపై ఆధారపడ్డారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వైయస్సార్‌ నేతన్న హస్తం పథకం కింద 1920 మంది అర్హులు ఉండగా సవాలక్ష కారణా లతో ఈ సంఖ్యను 1,1 90కి కుదించి రూ.24 వేల చొప్పున జమ చేశారు. మగ్గం లేని కార్మి కులు, ఉపవృత్తులవారు నేతన్న నేస్తం పథకానికి అర్హులు కారని తేల్చేశారు. దీంతో చేనేత కార్మికుల జీవితాలు దయనీయమయ్యాయి.
పథకానికి సరికొత్త నిబంధనలు….
నేతన్న నేస్తం పథకానికి ఈ ఏడాది ప్రభు త్వం కొత్త నిబంధనలు విధించింది. ఈ పథకానికి అర్హత పొందాలంటే రైతు భరోసా లబ్ధి పొందకూడదు. సొంత కారు ఉండకూడదు. రూ.300 దాటి విద్యుత్‌ బిల్లు వచ్చి ఉంటే పథకానికి అనర్హులు. ప్రైవేటుగా ఎక్కడా పని చేయకూడదు. కుటుంబంలో ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందకూడదు. వృద్ధాప్య పెన్షన్‌ పొందుతున్నా నేతన్న నేస్తం వర్తించదు. కొత్త ఆంక్షలతో జిల్లావ్యాప్తంగా 50 శాతం మందికి పైగా నేత కార్మికులు నేతన్న నేస్తానికి దూరమయ్యారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు గోరుచుట్టుపై రోకలిపోటు అన్న చందంగా ప్రభుత్వం కొత్త షరతు విధించడంతో చేనేత కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా కారణంగా అమ్మకాలు లేక కోట్లాది రూపాయల వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. ఫలితంగా మగ్గాల చప్పుళ్లు మూగబోయాయి. ఉత్పత్తి, విక్రయాలు నిలిచిపోవడంతో చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది కార్మికుల జీవితాలు దుర్భరమయ్యాయి. కొంతమంది మగ్గం మానేసి కూలీలుగా మారారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, కొత్త ఆంక్షలను సడలించాలని ఏపీ హ్యాండ్‌లూమ్‌ డిప్యూటీ డైరెక్టర్‌కు నేత కార్మికసంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. రైతు భరోసా పొందినా పెన్షన్‌ వచ్చేలా చూడగలనని, మిగిలిన ఆంక్షలపై ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని డీడీ చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా హేమసుందరరావు, ఉపాధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో సోమవారం నుంచి నిరసన ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు.
దారుణం : డేగా ప్రభాకర్‌
చేనేత రంగంపై ముఖ్యమంత్రి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ విమర్శించారు. నేత కార్మికులందరికీ నేతన్న నేస్తం అందిస్తానని ముఖ్యమంత్రి వాగ్దానం చేసి…నిబంధనల పేరుతో పథకానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండు చేశారు. ఈ పథకం కారణంగా ఇప్పటికే సిల్క్‌ రాయితీతో పాటు చేనేత కార్మికులకు వర్తించే ఇతర సంక్షేమ పథకాలు అందడంలేదన్నారు. కరోనా వేళ నేత కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థికసాయం చేయలేదన్నారు. ఉపవృత్తుల వారికీ పథకాన్ని వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500 ఆర్థిక సహాయం అందించాలన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే..: అప్పారావు
ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకులు అప్పారావు తెలిపారు. ఈ పథకం రెండేళ్లుగా అమలు జరుగుతోందన్నారు.ఇప్పటికీ అర్హులను గుర్తించి ఆన్‌లైన్‌ చేశామన్నారు. అర్హుల జాబితాను సంబంధిత సచివాలయాలలో నోటీసు బోర్డులో ప్రదర్శిస్తున్నామని, అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img