Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పదేళ్ల తర్వాత దిల్లీకి మహిళా మంత్రి

అతీషి మర్లేనా, సౌరభ్‌ భరద్వాజ్‌కు కేబినెట్‌ పదవులు

న్యూదిల్లీ : దిల్లీ కొత్త మంత్రులుగా విద్యావేత్త అతీషి మర్లేనా, ఆప్‌ ప్రధాన అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ నియామకాన్ని కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది. వారి పేర్లు ప్రకటించిన వారం తర్వాత నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో దశాబ్దం తర్వాత దిల్లీకి ఓ మహిళ మంత్రి లభించినట్లు అయింది. 2013`14లో కేజ్రీవాల్‌ 49 రోజుల ప్రభుత్వ హయాంలో రాఖీ బిర్లా కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. ఇప్పటివరకు మరో మహిళకు కేబినెట్‌ స్థానం దక్కలేదు. 2020లో కేజ్రీవాల్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినా మహిళలకు కేబినెట్‌ బర్తులు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. అప్పటి ఎన్నికల్లోనే మర్లేనా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కేబినెట్‌లో మహిళా మంత్రులు ఉండేవారు. ప్రస్తుతం సత్యేంద్ర జైన్‌, మనీశ్‌ సిసోడియా అవినీతి ఆరోపణల కారణంగా గత వారం తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో మర్లేనా, భరద్వాజ్‌కు ఆ పదవులు వరించాయి. ఇదిలావుంటే సిసోడియాకి ఎనిమిది రోజుల సీబీసీ కస్టడీ తర్వాత పక్షం రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తన హోలీ సందేశంలో సిసోడియా అంశాన్నే ప్రస్తావించారు. మనీశ్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ వంటి దేశభక్తులు, విద్య`ఆరోగ్య సంస్కర్తలను శిక్షించి… లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకునేవారిని అక్కునచేర్చుకునే ప్రధాని ఉన్న దేశం మనదని వ్యాఖ్యానించారు. ప్రధాని చేస్తున్నది తప్పని… దేశం తప్పుదోవ పడుతోందని మీకూ అనిపిస్తే దయచేసి హోలీ వేడుకల తర్వాత కొంత సమయం తీసి దేశ శ్రేయస్సు కోసం నాతో పాటు ధాన్యం, ప్రార్థనలు చేయండని దిల్లీ ప్రజలను ముఖ్యమంత్రి కోరారు. దిల్లీ ఉప ముఖ్యమంత్రిగా సిసోడియా దిల్లీ ప్రభుత్వ బాధ్యతలు చూసుకోవడంతో కేజ్రీవాల్‌ తన దృష్టిని పార్టీ విస్తరణపైనే పెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సిసోడియా కటకటాల పాలయ్యారు. దీంతో ఆప్‌కు పెద్ద షాక్‌ తగిలింది. ఆ వెంటనే బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్‌ భాస్కర్‌ రావు పార్లీ ఫిరాయించి బీజేపీ గూటికి చేరారు. ఇక కొత్త మంత్రుల ఎంపికలోనూ గందరగోళం నెలకొంది. విద్యామంత్రిగా ఉన్న సిసోడియాకు మద్దతు తెలుపుతూ స్కూలు పిల్లలతో లేఖలు రాయించినట్లు ఆప్‌పై కేసు కూడా ఉంది. ఏదిఏమైనా ఆప్‌కు కాంగ్రెస్‌ మినహా విపక్ష పార్టీల మద్దతు లభించింది. ఆప్‌ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మద్యం విధానంపై కాంగ్రెస్‌ పార్టీయే మొదట ప్రచారం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img