Monday, May 6, 2024
Monday, May 6, 2024

‘పరిషత్‌’పై మళ్లీ సస్పెన్స్‌

ఫలితాల వెల్లడిపై ముగిసిన వాదనలు
తీర్పును రిజర్వ్‌లో ఉంచిన హైకోర్టు

అమరావతి : రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై మళ్లీ సస్పెన్స్‌ నెలకొంది. ఏపీలో జరిగిన ఎడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది. దీనిపై గురువారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. రెండువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ప్రభుత్వంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. జనసేన పార్టీ తరపున న్యాయవాది వేణుగోపాలరావు, ఎస్‌ఈసీ తరపున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు చేస్తూ ఈ ఏడాది మేలో సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. పరిషత్‌ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు నాలుగు వారాల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని సింగిల్‌ జడ్జి అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు రూ.150కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదించారు. బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచామని, వాటి భద్రతకు భారీగా ఖర్చవుతుందని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. జనసేన వేసిన పిటిషన్‌లో ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వాలనే అంశం ప్రస్తావించలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. గతంలో డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలతోనే ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతించాలని ధర్మాసనాన్ని కోరారు. ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వాలనే అంశంపై గతంలో తాము సింగిల్‌ జడ్జి ముందు వాదనలు వినిపించామని జనసేన పార్టీ తరపు న్యాయవాది డివిజన్‌ బెంచ్‌కు తెలిపారు. ఇద్దరి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img