Monday, May 6, 2024
Monday, May 6, 2024

పోరాటానికి వెనకాడొద్దు

సీపీఐ అండగా ఉంటుంది ..
విశాఖ ఉక్కు కార్మికులతో రాజా

సీపీఐ అండగా ఉంటుంది : డి.రాజా

కార్మికులదే అంతిమ విజయమని, పోరాటానికి వెనకాడొద్దని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఉక్కు కార్మికులకు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విక్రయానికి వ్యతిరేకంగా పరిరక్షణ పోరాట కమిటీ అధ్వర్యాన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సీఆర్‌ఎంపీ, యుటిలిటీస్‌, ఈఎండీ, డబ్ల్యూఆర్‌ఎం, ఈఎం, ఎన్‌ఎండీ విభాగాల కార్మికులు కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్ష శుక్రవారానికి 239వ రోజుకు చేరింది.

విశాలాంధ్ర`కూర్మన్నపాలెం (విశాఖ) : కార్మికులదే అంతిమ విజయమని, పోరాటానికి వెనకాడొద్దని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఉక్కు కార్మికులకు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విక్రయానికి వ్యతిరేకంగా పరిరక్షణ పోరాట కమిటీ అధ్వర్యాన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సీఆర్‌ఎంపీ, యుటిలిటీస్‌, ఈఎండీ, డబ్ల్యూఆర్‌ఎం, ఈఎం, ఎన్‌ఎండీ విభాగాల కార్మికులు కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్ష శుక్రవారానికి 239వ రోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని రాజా సందర్శించారు. ఉక్కు కార్మికులకు మద్దతుగా జరిగినసభలో రాజా మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాడుతున్న కార్మికులకు, కార్మిక సంఘాల నాయకులకు విప్లవ అభినందనలు తెలిపారు. ప్రభుత్వరంగ పరిశ్రమలు ఆధునిక దేవాలయాలని, దేశఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలని నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఉద్ఘాటించారని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను విచ్చలవిడిగా విక్రయిస్తోందని రాజా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘాన్ని తొలగించి దానిస్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటుచేశారని, అందులో భాగంగా పీపీపీ విధానాన్ని ముందుకు తీసుకొచ్చిందని వివరించారు.
ప్రభుత్వరంగ పరిశ్రమలను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు ఈ విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు. గంగవరం పోర్టు, విశాఖపట్నం విమానాశ్రమం, తిరువనంతపురం పోర్ట్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థలను అదానికి అమ్మేశారని చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీలతో పాటు బీజేపీ మిత్రపక్షాలు సైతం వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో మార్పురావడం లేదని వివరించారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం ప్రతిపాదన సమయంలోనే దీనిని వ్యతిరేకిస్తూ పార్టీ తరపున తాను ప్రధాని మోదీకి లేఖ రాశానని గుర్తుచేశారు. అయినా కేంద్రం స్పందించలేదని చెప్పారు. లాభదాయక ఎల్‌ఐసీ, బ్యాంకింగ్‌ పరిశ్రమలను ప్రైవేట్‌పరం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.
2008లో మన్మోహన్‌సింగ్‌ ప్రధానమంత్రిగా, ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వరంగ పరిశ్రమలపై చర్చ జరిగిందని, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో సీపీఐ జాతీయ కార్మిక సంఘం నాయకులు ఇప్పటికే భాగస్వామ్యమై ఉన్నారని తెలిపారు. ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో తానూ భాగస్వామినవుతానని హామీ ఇచ్చారు. దీక్షలో విశాఖనగర 72వ వార్డు కార్పొరేటర్‌ ఏజే స్థాలిన్‌, ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ, పోరాటకమిటీ ప్రతినిధులు జె.అయోధ్యరామ్‌, కె.సత్యనారాయణ, కనకరాజు, మంత్రి రాజశేఖర్‌, గంథం వెంకటరావు, బోసుబాబు, వరసాల శ్రీనువాసురావు చిత్రాడ సన్యాసిరావు, వై.మస్తానప్ప, విళ్లా రామ్‌మోహన్‌, బి.అప్పారావు, చీకటి శ్రీనువాస్‌రావు, వై.శ్రీనువాస్‌రావు, పెద్దిరాజు, ఆనంద్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img