Friday, April 26, 2024
Friday, April 26, 2024

బీజేపీ పాలిత కర్ణాటక సర్కార్‌ అత్యంత అవినీతిమయం

రాష్ట్రంలో 150 సీట్లు సాధించడమే లక్ష్యం

పార్టీ నేతలు కలిసి పని చేయాలి
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

బెంగళూరు : వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధిస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. 150 స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం పార్టీ నాయకులు కలిసి పని చేయాలని ఉద్బోధించారు. శుక్రవారం ఇక్కడ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి రాహుల్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల ర్యాలీల్లో అవినీతి గురించి మాట్లాడేవారని, అయితే దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కర్ణాటకలో ఉందని, అది బీజేపీ అధ్వర్యంలోనే ఉందని ఆయన అన్నారు. కర్ణాటక ఎల్లప్పుడూ కాంగ్రెస్‌ పార్టీ స్ఫూర్తిని కలిగి ఉందని, ఇది సహజంగా కాంగ్రెస్‌ రాష్ట్రమని, మనం కనీసం 150 సీట్లలో విజయం సాధించాలని తెలిపారు. ‘సరైన సమస్యలపై మనం ఐక్యంగా పోరాడాలి. యోగ్యతా ప్రమాణంగా ఉండాలి. పార్టీ నాయకులు సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్‌, మల్లికార్జున ఖర్గే, ఇతరులకు ‘పెద్ద బాధ్యత’ ఏమిటంటే, కలిసి పోరాడాలి. 150 స్థానాలను గెలుచుకోవాలి’ అని తెలిపారు. ‘టికెట్‌ ఇవ్వడంలో లేదా పార్టీలో స్థానం కల్పించడంలో ఈ ఎన్నికల్లో యువత, మహిళలపై మనం దృష్టి సారించాలి’ అని రాహుల్‌ సూచించారు. 225 మంది సభ్యుల అసెంబ్లీలో కర్ణాటకలో కాంగ్రెస్‌ భారీ మెజారిటీతో గెలుస్తుందని, పేద, బలహీన వర్గాలు, చిన్న వ్యాపారులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం పని చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఇష్టాయిష్టాల ఆధారంగా ప్రచారం చేయకుండా, పార్టీకి చేసిన సేవ ఆధారంగా ప్రజలను ప్రోత్సహించడం చాలా ముఖ్యమన్నారు. ‘ఈ ఆలోచనతో మనం పూర్తిగా నిర్దయగా ఉండాలి. 20 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి చేసిన గత చరిత్ర ఆధారంగా మనం టికెట్లను నిర్ణయించాలని నేను అనుకోను. ఈ రోజు పార్టీ కోసం వ్యక్తి చేస్తున్న పనిని బట్టి మనం టికెట్లు ఇవ్వాలని నేను భావిస్తున్నాను’ అని రాహుల్‌ అన్నారు. పార్టీకి నమ్మకమైన, మంచి ప్రతినిధులను తప్పనిసరిగా రక్షించాలని, ప్రతిఫలం ఇవ్వాలని తెలిపారు. ముందస్తు ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాల మధ్య అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శులు కె.సి.వేణుగోపాల్‌, రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌, కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నేత సిద్ధరామయ్య, అనేక మంది సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. నిరుద్యోగం, ఆర్థిక పతనం, ద్రవ్యోల్బణం దేశం ముందున్న అతిపెద్ద సమస్యలని, నోట్ల రద్దు, తప్పుడు జీఎస్‌టీ, వ్యవసాయ చట్టాల వల్ల దేశానికి నష్టం వాటిల్లిందని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను నాశనం చేసినందున ఉద్యోగాలను సృష్టించే స్థితిలో లేదని అన్నారు. ‘ఈ రోజు భారతదేశం తన యువతకు ఉద్యోగాలు కల్పించే స్థితిలో లేదు, ఇది దేశానికి అతిపెద్ద నష్టాన్ని కలిగించింది. రాబోయే రోజుల్లో చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది’ అని చెప్పారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన రాహుల్‌ గాంధీ, ఇది చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కాదని, ఆర్థిక వనరులు, కుంభకోణాలను ఉపయోగించి ఏర్పడిరదని ఆరోపించారు. ‘ప్రధాన మంత్రి మోదీ అవినీతి గురించి మాట్లాడతారు. కానీ కర్ణాటకలో దీని గురించి మాట్లాడితే, 40 శాతం (కమీషన్‌) ప్రభుత్వం ఉన్న అత్యంత అవినీతి రాష్ట్రం ఇది (కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం) అని ప్రజలు నవ్వుకుంటారు’ అని ఎద్దేవా చేశారు. ‘డబ్బు లేదా వనరులను లాక్కొని ఇద్దరు లేదా ముగ్గురు బడా వ్యాపారులకు బదిలీ చేయడమే బీజేపీ లక్ష్యం. ఇది ప్రాథమికంగా ఆర్థిక బదిలీ యంత్రాంగ వ్యవస్థ. దేశాన్ని విభజించడం, భయాందోళనలు సృష్టించడం వారి పద్ధతి’ అని అన్నారు. ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం, సమాజంలోని వివిధ వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడం వంటి వాస్తవ సమస్యలను లేవనెత్తడం కాంగ్రెస్‌ బాధ్యత అని రాహుల్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img