Friday, April 26, 2024
Friday, April 26, 2024

భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా..కొనసాగుతోన్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె

తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ నేటి నుండి మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేపట్టారు. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా అన్ని మున్సిపాలిటీల్లోనూ నిరసనలు, మానవహారాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్‌ ఉద్యోగ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు మేరకు.. అన్ని సంఘాల ఆధ్వర్యాన మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు మాత్రం 13వ తేదీ వరకూ విధులకు హాజరవుతారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 14వ తేదీ నుండి వారుకూడా సమ్మెలోకి వెళ్లనున్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. సోమవారం ఉదయం 6 గంటలకు తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం వద్దకు వందలాది మంది చేరుకున్నారు. కార్యాలయం లోపలికి అధికారులను వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కదలిలేదని కార్మికులు పేర్కొన్నారు. కార్మికుల సమ్మెకు మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌, ఏఐటీయూసీ, సిఐటియు, సిపిఐ, సిపిఎం, వాళ్ల ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి.
గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ వర్షంలో కూడా మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెలో అధికసంఖ్యలో యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గన్నారు.నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం సంపూర్ణంగా కొనసాగుతోంది. నేటి ఉదయం నుంచి కార్మికులెవరూ పనులకు హాజరుకాకపోవడంతో కందుకూరు పట్టణంలో ఎక్కడ చెత్త అక్కడే నిలిచిపోయింది. మున్సిపల్‌ వాహనాలు బయటికి రాలేదు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. స్థానిక అంబేద్కర్‌ బమ్మ వద్ద పరిశుద్ధ కార్మికులతో జరిగిన సమావేశంలో ఎఐటియుసి నాయకులు బి.సురేష్‌, సిఐటియు నాయకులు గౌస్‌ తదితరులు మాట్లాడారు.
తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వూరులో కొవ్వూరు పురపాలక సంఘం మునిసిపల్‌ కార్యాలయం వద్ద నుండి మెయిన్‌ రోడ్‌ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మునిసిపల్‌ కార్యాలయం వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. మున్సిపల్‌ కార్మికుల కనీస వేతనం రూ.20 వేలు చేయాలని డిమాండ్‌ చేస్తూ,,పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మున్సిపల్‌ పారిశుధ్య తాత్కాలిక కార్మికులు మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలని, కార్మికులను పర్మినెంట్‌ చేయాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.నరసరావుపేట మున్సిపల్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికులు నిరసన చేపట్టారు.గుంటూరులో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. గుంటూరులో మున్సిపల్‌ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.తణుకులో మునిసిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో… మునిసిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె తణుకు మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు సమ్మె చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img