Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భూకబ్జాలతోనే తిరుపతి మునక

గ్రౌండ్‌లు, ఇళ్లుగా మారిన చెరువులు
వాటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలి
వరద బాధితులను తక్షణం ఆదుకోవాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో ` తిరుపతి : తిరుపతిలో భూకబ్జాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన చిత్తూరు జిల్లాలోని రాయల చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో నిర్మాణం చేసిన రాయల చెరువు ఇంకా దృఢంగా ఉందని, చెరువుకు గండి పడకుండా అధికారులు చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. రాయల చెరువుపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారేగానీ, మునిగిన తిరుపతి నగరం గురించి ఆలోచించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగరం ఎందుకు మునిగిందో తెలియడానికి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తిరుపతిలోని చెరువులు ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయో గుర్తించి, కబ్జా స్థలాల్లో నిర్మాణాలపై, కబ్జాదారులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రాజకీయ నాయకులు భూ కబ్జాలకు పాల్పడటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిరదని విమర్శించారు. చెరువుల్లో కొందరు క్రికెట్‌ గ్రౌండ్‌లు ఏర్పాటు చేశారని, మరికొందరు ఇళ్లు కట్టేశారని అన్నారు. ఈ విషయాలన్నీ సమగ్ర విచారణతోనే బయటపడతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం వరద బాధితులను తక్షణం ఆదుకోవాలని అన్నారు. వికేంద్రీకరణతోనే ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని తెలిపారు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని పేర్కొన్నారు. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెబుతూనే అక్కడ ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీని అదానీకి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇటు రాయలసీమ, అటు కోస్తా అభివృద్ధి కూడా కుంటుపడిరదని ఆవేదన చెందారు. గంగవరం పోర్టు ప్రైవేటుదే అయినప్పటికీ ప్రభుత్వ వాటా కూడా ఉందన్నారు. 30 సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి అప్పగించాలని అగ్రిమెంట్‌ కూడా ఉందని, కానీ ఆ పోర్టును కూడా ప్రైవేట్‌ పరం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నిం చారు. ఆంధ్రప్రదేశ్‌ను స్మశానంగా మార్చేవరకు వైసీపీ ప్రభుత్వం నిద్రపోదే మోనని ఎద్దేవా చేశారు. నారాయణ పర్యటనలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, నగర కార్యదర్శి విశ్వనాథ్‌, కార్యవర్గ సభ్యులు ఎం.డి.ప్రసాద్‌, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంజుల, నదియ, విజయ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఉదయ్‌, నగర కార్యదర్శి వెంకటేష్‌, ఓటేరు శాఖా కార్యదర్శి పద్మనాభ రెడ్డి, అభ్యుదయ వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్‌ భాస్కర్‌, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
నారాయణ కాలికి గాయం.. ఫిజియోథెరపీ చేసిన ఎంపీ
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ కుడి కాలికి గాయమైంది. రాయల చెరువు లీకేజీ, ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు రామచంద్ర పురం మండలం కుప్పం బాదూరుకు చేరుకున్నారు. అక్కడి నుండి కొండపై కిలోమీటరు మేర నడుచుకుంటూ రాయల చెరువు కట్ట వద్దకు చేరుకు న్నారు. కొండ నుండి దిగే సమయంలో కుడి కాలు బెణికింది. కాలుకు వా పు రావడంతో పైకి లేవలేక అక్కడే కూర్చున్నారు. అదే సమయంలో చెరువు కట్టను పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అక్కడే కూర్చుని ఉన్న నారాయణను పలకరించారు. కాలు బెణికిన విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి గాయాన్ని పరిశీలించి ఫిజియోథెరపీ చేసిన అనంతరం తాత్కాలికంగా కట్టు కట్టారు. తదుపరి చికిత్సకోసం కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి తన వాహనంలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img