Friday, April 26, 2024
Friday, April 26, 2024

మావోయిస్టుల ఘాతుకం

చత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర
10 మంది పోలీసులు, డ్రైవర్‌ మృతి

విశాలాంధ్ర-చింతూరు: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతెవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరను పేల్చివేశారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది పోలీసులు కాగా ఒకరు డ్రైవర్‌. దంతెవాడ అడవుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో బుధవారం ఉదయం డిస్ట్రిక్ట్‌ రిజర్డ్‌ గార్డ్‌ (డీఆర్జీ) పోలీసులు… ప్రత్యేక యాంటీ నక్సలైట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఆ ఆపరేషన్‌ ముగించుకుని మినీ వ్యాన్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. అరుణ్‌ పూర్‌ గ్రామ సమీపంలో అటవీ ప్రాంతం వద్దకు రాగానే అప్పటికే అక్కడ పొంచి ఉన్న మావోయిస్టులు… నిర్మాణంలో ఉన్న రోడ్డును తవ్వి ముందుగానే పోలీసులను లక్ష్యంగా చేసుకొని అమర్చిన మందు పాతరను పేల్చివేశారు. పేలుడు ధాటికి పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం గాలిలోకి ఎగిరిపోయి నేలపై తునా తునకలై పడిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న పదిమంది పోలీసులతో పాటు ఒక డ్రైవరు మృతి చెందారు. మందు పాతర పేలుడుకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడిరది. ఈ ఘటనలో మరి కొంతమంది గాయపడినట్లు సమాచారం. వారిని రాయపూర్‌కు హెలికాప్టర్లో తరలించారు. మృతి చెందిన జవాన్ల మృతదేహాలను దంతెవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిందని సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బం దిని మోహరించారు. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
మృతులు వీరే…
మావోయిస్టుల మందుపాతరకు బలైన పోలీసుల్లో హెడ్‌ కానిస్టేబుళ్లు జోగా సోధి, మున్నా రామ్‌ కడ్తి, కానిస్టేబుళ్లు సంతోష్‌ తమో, దుల్గో మాండవి, లక్ష్ము మార్కం, జోగా కవాసి, హరిరామ్‌ మాండవి, రాజు రామ్‌ కర్తమ్‌, జైరాం పొడియం, జగదీష్‌ కవాసితో పాటు డ్రైవర్‌ ధనిరామ్‌ యాదవ్‌ ఉన్నారు.
సీఎం బగేల్‌కు షా ఫోన్‌
మావోయిస్టుల దాడిని చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బగేల్‌ ధ్రువీకరించారు. ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నక్సలైట్లతో పోరు తుది దశకు చేరుకుందని, వారిని విడిచి పెట్టబోట్టమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దాడి సమాచారం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా… ముఖ్యమంత్రి భూపేశ్‌ బగేల్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. నక్సలైట్ల దాడిని ప్రధాని నరేంద్రమోదీ ఖండిరచారు. జవానుల త్యాగాలు వృథా కాబోవని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.
అనేక మంది జవాన్ల వీరమరణం
చత్తీస్‌గఢ్‌లో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య తరచూ కాల్పులు జరుగుతుంటాయి. 2021 ఏప్రిల్లో భద్రతా దళాలు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో సుమారు 22 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటన బీజాపుర్‌, సుక్మా జిల్లాల సరిహద్దులో జరిగింది. అంతకుముందు 2018 మార్చిలో 9 మంది సీఆర్పీఎఫ్‌ బలగాలు, ఫిబ్రవరిలో ఇద్దరు, 2017 ఏప్రిల్లో 24 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img