Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మీ అనుభవాలు దేశానికి పంచండి

ప్రధాని మోదీ విజ్ఞప్తి
పదవీకాలం ముగిసిన రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు

న్యూదిల్లీ: ‘ఈ సభ మీకు ఎంతో ఇచ్చింది. మీరు కూడా దేశంలోని నలుమూలలకు దానిని తిరిగి ఇచ్చేయండి’అని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. రిటైర్‌ అయిన రాజ్యసభ సభ్యులు మళ్లీ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నట్టు మోదీ పేర్కొన్నారు. ‘మన రాజ్యసభ సభ్యులకు అపార అనుభవం ఉంది. కొన్నిసార్లు మనం విద్య నుంచి నేర్చుకున్న దానికంటే అనుభవానికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ పార్లమెంట్‌లో చాలాకాలం గడిపాం. మనం ఇచ్చిన దాని కంటే ఎంతో ఎక్కువ ఈ సభ మనకు ఇచ్చింది. ఇక్కడ గడిరచిన అనుభవాన్ని దేశంలోని నాలుగు దిశలకు తీసుకెళ్లాలి’ అని మోదీ అన్నారు. రాజ్యసభకు సంబంధించిన 72 మంది సభ్యుల పదవీకాలం పూర్తికానుండటంతో వారికి వీడ్కోలు పలుకుతూ మోదీ సభలో గురువారం మాట్లాడారు. పదవీ విరమణ చేసిన సభ్యులు మాట్లాడేందుకు వీలుగా రాజ్యసభలో జీరో అవర్‌, ప్రశ్నోత్తరాలను చైర్మన్‌ వెంకయ్యనాయుడు రద్దు చేశారు. దేశానికి సేవ చేయడానికి ముందుకు రావాలని సభ్యులకు మోదీ పిలుపునిచ్చారు. ‘ఈ నాలుగు గోడల నుంచి మనం బయటికి వెళ్లవచ్చు. ఇక్కడి అనుభవాలను ఉపయోగించుకొని దేశంలోని నాలుగు దిక్కులకు మీ అనుభవాన్ని పంచండి’ అని మోదీ కోరారు. మీ అనుభవాలను, సేవలకు అక్షర రూపం ఇవ్వాల్సిందిగా సూచించారు. రానున్న తరాలకు మీ అనుభవం ఉపయోగపడాలన్నారు. పదవీ కాలం ముగిసిన 72 మంది సభ్యులకు రాజ్యసభ ఆత్మీయ వీడ్కోలు పలికింది. రిటైర్‌ అవుతున్న సభ్యులతో కలిసి మోదీ, వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఫొటోలు దిగారు. విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఏకే ఆంటోనీ, ఆనంద్‌ శర్మ.. బీజేపీ నేతలు సుబ్రమణ్యస్వామి, స్వపన్‌ దాస్‌గుప్తా సహా మొత్తం 72 మంది సభ్యుల పదవీ కాలం ముగిసింది. నిర్మలా సీతారామన్‌ జూన్‌లో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేయనుండగా, పీయూష్‌ గోయల్‌, మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ జులైలో పదవీ విరమణ చేయనున్నారు. కాంగ్రెస్‌ నాయకులు పి.చిదంబరం, కపిల్‌ సిబల్‌, శివసేన నేత సంజయ్‌ రౌత్‌, ఎన్‌సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ జులైలో పదవీ విరమణ చేయనున్నారు. వెంకయ్య నాయుడు తన నివాసంలో రాజ్యసభ సభ్యులందరికీ ఈ రాత్రి విందు ఇచ్చారు. పదవీ విరమణ చేస్తున్న 72 మంది సభ్యులకు, ఇంతకు ముందు పదవీ విరమణ చేసిన మరో 19 మందికి జ్ఞాపికలను వెంకయ్య నాయుడు అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img