Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాజకీయ అవకాశ వాదంతో సమాజంలో చీలిక

దేశంలో భయానక పరిస్థితులు
నేరం చేయకుండా జైళ్లలో పెట్టే వలసవాద విధానం
నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్‌

కోల్‌కతా : ‘రాజకీయ అవకాశవాదం’ కారణంగా వర్గాల మధ్య చీలికలు ఏర్పడుతున్నాయని నోబెల్‌ గ్రహీత అమర్త్య సేన్‌ శనివారం అన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా రాజకీయ కారణాలతో ప్రజలను జైళ్లలో పెట్టే వలసవాద పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోందని సేన్‌ విచారం వ్యక్తం చేశారు. ‘ఆనందబజార్‌ పత్రిక’ శతాబ్ది ఉత్సవంలో వర్చువల్‌ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాజకీయ అవకాశవాదంతో హిందువులు, ముస్లింల సహజీవనంలో చీలిక తెచ్చి… భారతీయులను విభజించే ప్రయత్నం జరుగుతోంది’ అని అన్నారు. కాగా దేశంలోని అతిపెద్ద వార్తాపత్రికలలో ఒకటైన బెంగాలీ భాషా దినపత్రిక అయిన ఆనంద బజార్‌ మొదటి ఎడిషన్‌ మార్చి 13, 1922న ప్రఫుల్లకుమార్‌ సర్కార్‌ వ్యవస్థాపక ఎడిటర్‌గా ప్రచురితమైంది. నిర్ణయాత్మక జాతీయవాద వైఖరిని కలిగి ఉన్న ఈ వార్తా పత్రిక మొదటిరోజు ఎరుపు రంగులో ముద్రితమైంది. అప్పుడు అది చర్చనీయాంశమైంది. వార్తా పత్రిక ‘ఒక కొత్త బెంగాలీ దినపత్రిక రంగు (ఎరుపు) ప్రమాద సంకేతం’ అని పేర్కొందని అమర్త్య సేన్‌ అన్నారు. ప్రారంభ రోజుల గురించి మాట్లాడుతూ, సేన్‌ ఇలా అన్నారు. ‘ఆ సమయంలో (స్వాతంత్య్రానికి పూర్వం), దేశంలోని అనేక మంది వ్యక్తులు ఆనందబజార్‌ పత్రికలో పని చేస్తున్న బంధువులతో సహా రాజకీయ కారణాల వల్ల జైలు పాలయ్యారు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, జైలులో వారిని సందర్శించినప్పుడు, ఏ నేరం చేయకుండానే ప్రజలను నిర్బంధించే ఈ పద్ధతి ఎప్పటికైనా ఆగిపోతుందా అని నేను తరచుగా ప్రశ్నించేవాడిని’ అని అన్నారు. ‘తదనంతరం, భారతదేశం స్వతంత్రమైంది. అయితే అప్పటి వలసవాద విధానం ఇప్పటికీ చాలా వరకు ఉనికిలో ఉంది’ అని 88 ఏళ్ల ప్రముఖ ఆర్థికవేత్త చెప్పారు. స్వతంత్ర భారతదేశం అనేక అంశాలలో పురోగమిస్తున్నప్పటికీ, పేదరికం, ఆరోగ్య సమస్యలు వంటి సమస్యలు మిగిలి ఉన్నాయని అన్నారు. ఈ వార్తా పత్రిక ఇప్పటికీ వాటిని ప్రధానాంశాలుగా వివరిస్తుందని తెలిపారు. న్యాయ మార్గాన్ని అనుసరించేందుకు కృషి చేయక తప్పదు అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. ఈ నెల ప్రారంభంలో, భారతదేశంలోని ప్రస్తుత పరిస్థితులపై సేన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఐక్యతను కొనసాగించడానికి కృషి చేయాలని అన్నారు. ‘నేను దేనికైనా భయపడుతున్నానా అని ఎవరైనా నన్ను అడిగితే, నేను ‘అవును’ అని చెబుతాను. ఇప్పుడు భయపడడానికి కారణం ఉంది. దేశంలో ప్రస్తుత పరిస్థితులు భయాందోళనకు గురిచేస్తున్నాయి’ అని కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌లో అమర్త్య పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా నోబెల్‌ గ్రహీత అన్నారు. దేశ సంప్రదాయాలకు అనుగుణంగా ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. ‘దేశం ఐక్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చారిత్రాత్మకంగా ఉదారవాదంగా ఉన్న దేశంలో విభజనను నేను కోరుకోవడం లేదు. కలిసికట్టుగా పని చేయాలి’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img