Friday, April 26, 2024
Friday, April 26, 2024

రూ.కోటి పరిహారమివ్వాలి

సీపీఐ డిమాండు : లఖింపూర్‌ బాధితులకు పరామర్శ

న్యూదిల్లీ : భారత కమ్యూనిస్టు పార్టీ నేతలు ఈనెల 8,9 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరికి వెళ్లి జనపద్‌ లఖింపూర్‌, బెహ్రయిచ్‌ ప్రాంతాలను సందర్శించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర సమితి కార్యదర్శి డాక్టర్‌ గిరీశ్‌చంద్ర శర్మ నేతృత్వంలో సీపీఐ ప్రతినిధుల బృందం లఖింపూర్‌కు వెళ్లింది. అమానవీయ రీతిలో వాహనం కింద పడి నలిగిపోయి నలుగురు రైతులు, జర్నలిస్టు ప్రాణాలు వదిలిన ప్రాంతాన్ని సందర్శించింది. బాధిత కుటుంబాలను పరామర్శించింది. అండగా నిలుస్తామని, న్యాయం జరిగే వరకు వెన్నుదన్నుగా ఉంటామని లవ్‌ప్రీత్‌సింగ్‌, నచ్చత్తర్‌ సింగ్‌, దల్జీత్‌ సింగ్‌, గుర్విందర్‌ సింగ్‌, జర్నలిస్టు రమణ్‌ కశ్యప్‌ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చింది. సీపీఐ ప్రతినిధి బృందంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాకేశ్‌ తివారి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్‌ పాథక్‌, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రఘురాజ్‌, నాయకులు ఎండీ సలీం, రామ్‌శంకర్‌ నేతాజి, మనీశ్‌ కోరి, హరప్రసాద్‌ భోజ్వాల్‌, మునవ్వర్‌ అలీ, సుబేంద్ర సింగ్‌ గంగా ఉన్నారు. ఈ కేసు విచారణ సమయంలోనే కేంద్రమంత్రిని బర్తరఫ్‌ చేయాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్టింగ్‌ జడ్జి ద్వారా విచారణ నిర్వహించాలని సీపీఐ ఇప్పటికే డిమాండు చేసింది. ఈ ఘటనకు కారణమైన పోలీసులను శిక్షించాలని, హత్యలకు యూపీ సీఎం నైతిక బాధ్యత వహించాలని, బాధిత కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని రూ.కోటికి పెంచాలని కూడా డిమాండు చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు లేకపోయినా, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి లేకపోయినా రైతుల హత్యలపై బీజేపీ ఎలాంటి చర్యలకు పూనుకునేది కాదని సీపీఐ పేర్కొంది. కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒత్తిడి ఉండటంతో ఈ భయానక చర్యకు సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు యూపీ పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించింది. మృతులు, గాయపడిన వారి గురించి సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యులకు సమయానికి అందించలేదని, కర్ఫ్యూ తరహా పరిస్థితులను సృష్టించే ప్రయత్నాన్ని పోలీసు యంత్రాంగం చేసిందని దుయ్యబట్టింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల ముందు రైతుల ఉద్యమాన్ని అణచివేస్తామని కేంద్రమంత్రి బెదరించారని సీపీఐ గుర్తుచేసింది. ఆయన కొడుకు ఆ బెదిరింపులను ఆచరణలో పెట్టాడని పేర్కొంది. రైతుల ప్రదర్శనను దారి మళ్లించినప్పటికీ మంత్రి తనయుడు తన గ్యాంగుతో కాన్వాయ్‌గా వచ్చి రైతులను తొక్కి చంపారని, శాంతియుత ప్రదర్శనలో రక్తం చిందించారని సీపీఐ విమర్శించింది. మంత్రి తనయుడిపై కఠిన చర్యలకు డిమాండు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img