Friday, April 26, 2024
Friday, April 26, 2024

లేపాక్షి భూములపై పోరాటం

. ఇచ్చేది మీరే… తీసుకునేది… విక్రయించేది మీరేనా?
. పోలవరం నిర్వాసితుల కష్టాలు పట్టించుకోరా?
. కేసుల కోసం మోదీ, షాకు భయపడుతున్న జగన్‌
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అనంతపురం/అర్బన్‌: రైతుల నుంచి భూములు ఇచ్చేది మీరే… విక్రయాలు చేయడం మీరే… వాటిని లాక్కోవడం మీరేనా? అని రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వ పాలన పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లేపాక్షి భూములపై పోరాటం చేస్తామన్నారు. బుధవారం సీపీఐ అనంతపురం జిల్లా సమితి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబరు 14 నుంచి 18వ తేదీ వరకు సీపీఐ 24వ జాతీయ మహాసభల సందర్భం గా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టుల పాత్ర కీలకంగా మారుతోందని, ఇటువంటి తరుణంలో సిద్ధాంతపరంగా మోదీ పాలనకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏకం కావలసిన అవసరం ఉందని రామకృష్ణ అన్నారు. గతంలో గ్యాస్‌ ధర రూ.450 ఉంటే నేడు మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.1,150కి పెరిగిందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు తారస్థాయికి పెరిగిపోయాయని, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీ నల్లధనాన్ని వెలికితీసి ప్రజలకు రూ.15 లక్షలు బ్యాంకు ఖాతాలకు వేస్తామని చెప్పారని, అయితే అదానీ, అంబానీ మాత్రం ప్రపంచ కుబేరుల జాబితాలో నిలిచారని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ప్రపంచంలో భారత్‌ 101వ స్థానంలో ఉందని, ఇది మోదీ వినాశకర పాలనను తెలియజేస్తోందని ధ్వజమెత్తారు. ఇటువంటి తరుణంలో ప్రజాతంత్ర పార్టీలు ఏకమై కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిన ఉందని తెలిపారు. రాష్ట్రంలో పాలక, ప్రతిపక్షాలు రెండూ మోదీతో సంబంధాలు నెరుపుతున్నాయని, మోదీ ఆశీర్వాదం కోసం వారు ఎదురుచూస్తున్నారని విమర్శించారు. జగన్‌, విజయసాయిరెడ్డి ఇద్దరూ మోదీ, అమిత్‌ షాకు భయపడుతున్నారంటే అది కేసుల విషయంలో అని, అయితే చంద్రబాబు నాయుడుకు ఏమొచ్చిందని… మోదీతో చేతులు కలిపాడని రామకృష్ణ ప్రశ్నించారు. ఈ విషయాన్ని నాలుగు రోజులుగా మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని, దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి తాడేపల్లి ప్యాలెస్‌లో అమరావతిలో అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడానికి కాపలా కాస్తున్నారని విమర్శించారు. ప్రజలను మోసం చేసి అమరావతిని అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న పార్టీలను విజయసాయిరెడ్డి విమర్శించడం అవసరమా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు సర్వం కోల్పోయి వరదల్లో ఉంటూ కష్టాలు పడుతుంటే పట్టించుకోకుండా ప్రభుత్వం గాడిదలు కాస్తుందా అని నిలదీశారు. లేపాక్షి భూములను రైతుల నుంచి రూ.లక్ష నుంచి లక్షా 30 వేల రూపాయలకు కొనుగోలు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని కొంతమందికి అప్పగించారని అన్నారు. అయితే పరిశ్రమలు సంపూర్ణంగా ఏర్పాటు చేయకుండానే కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని, బ్యాంకుల్లో తీసుకున్న రూ.4 వేల కోట్ల అప్పులు చెల్లించకపోవడం, రూ.10 వేల కోట్ల విలువ చేసే ఆ భూములను జగన్‌ మేనమామ కుమారుడు రామాంజనేయరెడ్డికి కేవలం రూ.500 కోట్లకు ఇవ్వడం వెనుక ఉద్దేశమేమిటో ముఖ్యమంత్రి ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.జగదీష్‌, అనంతపురం జిల్లా కార్యదర్శి జాఫర్‌, సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, అనంతపురం నగర కార్యదర్శి శ్రీరాములు, సింగనమల కార్యదర్శి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సన్మానం… అభినందనలు
దేశంలో బీజేపీ నిరంకుశ పాలనకు భారత కమ్యూనిస్టు పార్టీ ఎదురొడ్డి సైద్ధాంతిక పోరాటం చేస్తోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన సీపీఐ రాష్ట్ర మహాసభల్లో రామకృష్ణ మూడవసారి రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన అనంతరం తొలిసారిగా బుధవారం అనంతపురం జిల్లా కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్‌, జిల్లా కార్యదర్శి జాఫర్‌ నేతృత్వంలో సీపీఐ శ్రేణులు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను గజమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు. కాగా రాప్తాడు నియోజకవర్గం సీపీఐ శాఖ అధ్వర్యంలో అక్టోబర్‌ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరుగనున్న సీపీఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ శ్రీకంఠం సర్కిల్‌ మీదుగా రాజు రోడ్డు, సప్తగిరి సర్కిల్‌ వరకు కొనసాగింది. అనంతరం రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల నాయకులు భారీ గజమాలతో రామకృష్ణను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, కార్యదర్శి వర్గ సభ్యుడు రాజారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌ బాబు, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనే యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, ఏఐటీయూసీ, ఏపీ మహిళా సమాఖ్య, గిరిజన సమాఖ్య, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img