Friday, April 26, 2024
Friday, April 26, 2024

లేబర్‌ కోడ్‌ల అమలు ఇప్పట్లో లేనట్టే..

యూపీ ఎన్నికలే ప్రధాన కారణం
ఆసక్తి చూపని రాష్ట్ర ప్రభుత్వాలు

న్యూదిల్లీ : ఎన్నో ఏళ్లుగా దేశంలోని కార్మిక వర్గం పోరాడిసాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్న కేంద్రంలోని బీజేపీ పాలకులు ఒకటి అనుకుంటే ఫలితాలు మరోరకంగా మారుతున్నాయి. కార్మిక వర్గం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా 44 కార్మిక చట్టాలను కాలరాస్తూ పార్లమెంటులో తమ మంద బలంతో నెగ్గించుకున్న నాలుగు లేబర్‌ కోడ్లను ఇప్పట్లో అమలు చేసే సాహసం చేయలేని నిస్సహాయ స్థితిలోకి కేంద్రం ఉందని స్పష్టమవుతోంది. ఈ కోడ్‌ల అమలు విషయంలో తీసుకోవాల్సిన చర్యలు, నియమాల రూపకల్పన పేరుతో రాష్ట్రాలు నెమ్మదిగా ఆచితూచి అడుగేస్తున్నాయి. నాలుగు కోడ్‌లను పార్లమెంటు ఆమోదించినా వీటి అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని నియమాలను నిర్ధేశించుకోవాల్సి ఉంది. ఇది కూడా చాలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక అవకాశాన్ని ఇచ్చాయి. ఇక మరోవైపు తమ రాజకీయ భవిష్యత్తును నిర్ధేశించే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు కేంద్రానికి ప్రధాన అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వినాశకర వ్యవసాయ చట్టాల రూపంలో దేశ రైతాంగంతో పెట్టుకుని చేతులు కాల్చుకున్న కేంద్రానికి చైతన్యవంతమైన కారిక్మ వర్గం దెబ్బ తమ రాజకీయ పీఠానికే ఎసరుపెడుతుందనే భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. నాలుగు లేబర్‌ కోడ్ల అమలు అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని తేలిపోయింది. ఈ క్రమంలో మంకుపట్టు పట్టి పార్లమెంటులో చట్టంగా రూపొందించిన వ్యవసాయ చట్టాలు, లేబర్‌ కోడ్‌లు తమ మెడకే ఉరితాళ్లుగా మారుతున్న వైనాన్ని గుర్తించిన కేంద్రం చట్టాల అమలు విషయంలో డోలాయమానంలో పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూపీ ఎన్నికలు పూర్తి అయ్యేవరకూ అంటే మరో ఏడాది వరకూ ఆ కోడ్ల అమలు విషయంలో ఎటువంటి ముందడుగు ఉండే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే కరోనా కాటుకు బలైన పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు తలకిందులయ్యాయి. అ క్రమంలో లేబర్‌ కోడ్ల అమలు అంటూ ముందుకు వస్తే కార్మికులు, ఉద్యోగులు ఇంటికి తీసుకెళుతున్న వేతనాలు తగ్గిపోతాయి. కొత్త వేతన కోడ్‌ ప్రకారం అలవెన్సులు 50 శాతానికి పరిమితం చేయడంతో ఉద్యోగి స్థూల వేతనంలో సగం ప్రాథమిక వేతనాలు తగ్గుతాయి. దాని నుంచే ప్రావిడెంట్‌ ఫండ్‌ శాతాన్ని లెక్కించాల్సి ఉంటుంది. ఉద్యోగాలు ఇచ్చిన సంస్థలు, కంపెనీలు, కర్మాగారాలు వారి ప్రావిడెంట్‌ ఫండ్‌ బాధ్యతను భరించాల్సి ఉంటుంది. కొత్త కోడ్‌ ప్రకారం యాజమాన్యాలు తమ ఉద్యోగుల జీతాలను పునర్నిర్మించాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక అంశాలు ఎన్నికల్లో తమకు ప్రతికూలంగా మారతాయని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు. 2021 ఏప్రిల్‌ 1 నుంచే పారిశ్రామిక సంబంధాలు, వేతనాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన ఆరోగ్య భద్రత, పని పరిస్థితులపై నాలుగు కోడ్‌లను అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ భావించినా అనేక రాష్ట్రాలు తమ అధికార పరిధిలో ఈ కోడ్‌ల కింద నియమాలను తెలపకపోవడంతో వీటి అమలు సాధ్యం కాలేదు.. ఇక యూపీ ఎన్నికల్లో గెలుపు కోసం నానా అగచాట్లు పడాల్సిన తరుణంలో కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు అమ్మేయాలని పట్టుబట్టి చేసిన లేబర్‌కోడ్‌ల అమలు ఇప్పట్లో సాధ్యం కదనే విషయం స్పష్టమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img