Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విద్యార్థులపై ఉక్కుపాదం

‘అసెంబ్లీ ముట్టడి’ భగ్నానికి యత్నం

ఎయిడెడ్‌ విద్యాసంస్థల కోసం ఆందోళనబాట
విజయవాడ, గుంటూరులలో నాయకుల అరెస్టు
పోలీస్‌స్టేషన్‌లో పరామర్శించిన రామకృష్ణ

విశాలాంధ్ర`విజయవాడ/ గుంటూరు : విద్యార్థి నాయకులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను యధాతథంగా కొనసాగించాలని, 42, 50, 51 జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లడానికి ముందు విద్యార్థి నాయకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో విజయవాడ లెనిన్‌ సెంటర్‌కు చేరుకుని కొద్దిసేపు ధర్నా చేశారు. అనంతరం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో లెనిన్‌ సెంటర్‌లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రంగన్న, ఉపాధ్యక్షుడు జాన్సన్‌బాబు, సహాయ కార్యదర్శి శివారెడ్డి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, పీడీఎస్‌యూ నేత రవిచంద్ర, ఏఐడీఎస్‌వో రాష్ట్ర కార్యదర్శి వి.హరీష్‌కుమార్‌ మాట్లాడుతూ ఎయిడెడ్‌ విద్యాసంస్థలను అక్రమించుకోవడం కోసమే వైసీపీ ప్రభుత్వం ఆప్షన్స్‌ నాటకమాడుతోందని విమర్శించారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల ఆక్రమణల కోసం జారీ చేసిన జీవోలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ జీవోలు రద్దు చేయకుండా ఆప్షన్స్‌ ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే యాజమాన్యాలు ప్రభుత్వానికి అన్‌ ఎయిడెడ్‌ కోసం అంగీకారపత్రాలు ఇచ్చాయన్నారు. దీనివల్ల ఫీజులు పెరిగిపోతాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, మైనార్టీ విద్యార్థులపై భారం పడుతుందన్నారు. 3.40లక్షల మంది విద్యార్థుల జీవితాలతో సీఎం జగన్‌ చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను యధాతథంగా కొనసాగిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేసినవారిలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.రామ్మోహన్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.భాస్కర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కోటబాబు, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు ఇ.భూషణం, రాజశేఖర్‌, ఏఐడీఎస్‌వో నాయకులు రాజశేఖర్‌, విద్యార్థి నాయకులు ఐ.రాజేష్‌, ఏసుబాబు, ఆది, చరణ్‌ పాల్గొన్నారు.
అరెస్టులను ఖండిస్తున్నాం : రామకృష్ణ
విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండిరచారు. అరెస్టుల విషయం తెలిసిన వెంటనే ఆయన గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విద్యార్థి నేతలను పరామర్శించి సంఫీుభావం తెలిపారు. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ బాధ్యత నుంచి తప్పుకునేందుకు ఎయిడెడ్‌ విలీన జీవోలు తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ జీవోల వల్ల ఫీజుల భారం పెరిగి పేద, సామాన్య, మధ్య తరగతి విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా ప్రభుత్వం వెనక్కితగ్గి నాలుగు ఆప్షన్లతో మెమోను జారీచేసిందని, జీవోలు మాత్రం రద్దు చేయలేదన్నారు. మెమో ఇచ్చి యాజమాన్యాలకు, విద్యార్థులకు మధ్య వైరం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆరోపించారు.సీఎంకు చిత్తశుద్ధి ఉంటే 42, 50, 51 జీవోలు సహా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ భర్తీపై మరో జీవో 35 కూడా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రామకృష్ణ వెంట సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి జీ కోటేశ్వరరావు కూడా ఉన్నారు.
మధు ఖండన
విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఒక ప్రకటనలో ఖండిరచారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యాసంస్థలు అర్ధాంతరంగా మూసివేయడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారని, పేద, మధ్యతరగతి ప్రజలు తమ అరకొర ఆదాయాలతో ప్రైవేటు విద్యాసంస్థల్లో చేర్పించాలంటే అవస్థలు పడుతున్నారని తెలిపారు. వీటన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని మధు డిమాండ్‌ చేశారు.
ఇంటర్మీడియెట్‌ కార్యాలయ ముట్టడి
గుంటూరు : ఎయిడెడ్‌ విద్యాసంస్థల ప్రైవేటీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఛలో అసెంబ్లీకి ఇచ్చిన పిలుపులో భాగంగా గుంటూరు నాజ్‌సెంటర్‌ నుంచి విద్యార్థులు ప్రదర్శనగా బయలుదేరి ఇంటర్మీడియట్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిరచారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థులను తీసుకువెళ్లి పోలీసు వ్యానులో పడేశారు. 15 మంది విద్యార్థి సంఘాల నాయకులను, విద్యార్థులను అరెస్టు చేసి లాలాపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి యు.గనిరాజు తదితరులు మాట్లాడుతూ జగన్‌మోహన్‌ రెడ్డి ఎయిడెడ్‌ విద్యాసంస్థలను యధావిధిగా కొనసాగిస్తామని చెబుతూనే మరోపక్క జూనియర్‌ కళాశాల అధ్యాపకులకు కౌన్సెలింగ్‌ నిర్వహించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని, లేనిపక్షంలో విద్యార్థుల ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాసర్‌ జి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.కిరణ్‌, ఏఐడీఎస్‌ఓ జిల్లా నాయకులు శివ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు కిరణ్‌, కబీర్‌, సందీప్‌, సుధీర్‌, పవన్‌, శివ, కార్తీక్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img