Friday, April 26, 2024
Friday, April 26, 2024

వివేక హత్య కేసు మళ్లీ మొదటికి

. దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై వేటు
. ప్రత్యేక విచారణా బృందం ఏర్పాటు
. ఏప్రిల్‌ 30లోగా దర్యాప్తు పూర్తి
. కాలపరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. కేసు ముగింపు దశకు చేరుకుందని భావిస్తున్న తరుణంలో దర్యాప్తు అధికారిపై వేటు పడిరది. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ను తొలగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రాంసింగ్‌ వల్లే వివేక హత్య కేసు విచారణ ఆలస్యం అయిందని, దర్యాప్తు వేగంగా సాగటం లేదని ఏఆర్‌ షా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం వెల్లడిరచింది. ఆ స్థానంలో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ సీబీఐ ఇచ్చిన ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సిట్‌కు సీబీఐ డీఐజీ కేఆర్‌ చౌరాసియా నేతృత్వం వహించనున్నారు. సిట్‌ బృందంలో ఎస్పీ వికాస్‌ సింగ్‌, అడిషనల్‌ ఎస్పీ ముకేష్‌ కుమారి, ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.నవీన్‌ పునియా, ఎస్‌ఐ అంకిత్‌ యాదవ్‌ ఉన్నారు. వివేక హత్య కేసులో దర్యాప్తు వేగంగా సాగటం లేదని, దర్యాప్తు అధికారులను మార్చాలని కోరుతూ ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న శివశంకర్‌ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెల్సిందే. దీనిపై గత విచారణలో ఈ కేసును ఇంకా ఎంతకాలం సాగదీస్తారని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారిని మార్చాలని, లేనిపక్షంలో ఇంకో అధికారిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై సీల్డ్‌ కవర్‌ నివేదిక అందజేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీం కోర్టుకు సీబీఐ నివేదిక అందజేసింది. రాంసింగ్‌తో పాటు మరొకరి పేరును సీబీఐ సూచించింది. అయితే రాంసింగ్‌ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎంఆర్‌ షా అభ్యంతరం తెలిపారు. కేసు దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్‌ను కొనసాగించడంలో అర్థం లేదని న్యాయమూర్తి అన్నారు. రాంసింగ్‌ను తొలగిస్తే విచారణకు ఇబ్బంది అవుతుందని సీబీఐ తెలిపింది. వివేక హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను కడపలో రకరకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. వారిలో దర్యాప్తు అధికారి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ కూడా ఒకరు. రాంసింగ్‌ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, కొంతమందికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని బెదిరిస్తున్నారని వివేక కేసులో అనుమానితుడిగా ఉన్న ఉదయ్‌కుమార్‌ రెడ్డి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంసింగ్‌పై కడప పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఉదయ్‌కుమార్‌ ఎంపీ అవినాశ్‌రెడ్డికి సన్నిహితుడని పేరుంది. రాంసింగ్‌పై అనంతపురం, కడప ఎస్పీలకు కూడా ఫిర్యాదులు చేశారు. దర్యాప్తు అధికారి రాంసింగ్‌ వివక్ష చూపుతున్నారనడానికి సాక్ష్యాలు లేవని సీబీఐ తెలిపింది. అయినప్పటికీ ఆయనను కొనసాగించడానికి అంగీకరించని అత్యున్నత న్యాయస్థానం… కేసు దర్యాప్తు వేగవంతంగా చేపట్టేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించింది. వివేక హత్య కేసులో విస్తృత కుట్ర కోణం ఉందని, దానిని బయటపెట్టాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్‌ 30వ తేదీ లోపు వివేక హత్య కేసు దర్యాప్తు ముగించాలని డెడ్‌లైన్‌ విధించింది. ఇప్పటికే ఈ కేసు విచారణ చాలా ఆలస్యమైందని, అందువల్లే కాలపరిమితిని విధిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ కేసు విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన భార్య తులశమ్మ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆరు నెలల్లోపు విచారణ మొదలు కాకపోతే సాధారణ బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవచ్చని అవకాశం ఇచ్చింది. అయితే మెరిట్స్‌ ఆధారంగానే బెయిల్‌పై నిర్ణయం ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img