Friday, April 26, 2024
Friday, April 26, 2024

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపకుంటే ఇంటికే

ఉభయ ప్రభుత్వాలకు సీపీఐ, ఏఐటీయూసీ నేతల హెచ్చరిక

. రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజూ కొనసాగిన నిరసన దీక్షలు
. 30న విశాఖ మహాగర్జనకు తరలిరండి: జేవీఎస్‌ఎన్‌

విశాలాంధ్ర బ్యూరో - అమరావతి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని, లేనిపక్షంలో రెండు ప్రభుత్వాలను గద్దె దింపుతామని సీపీఐ, ఏఐటీయూసీ నేతలు హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన దీక్ష 700 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 30న విశాఖలో నిర్వహించ తలపెట్టిన మహాగర్జన దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ పిలుపు మేరకు మంగళవారం రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. దీనిలో భాగంగా చింతపల్లి మండల కేంద్రంలో సీపీఐ, సీపీఎం, తెలుగుదేశం పార్టీ సమష్టిగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గడచిన రెండేళ్లకు పైగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ప్రైవేటీకరణను నిరసిస్తూ కుటుంబాల సమేతంగా ఉద్యమం చేస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర పాలకులు ఎవరూ పట్టించుకోకపోవడమే కాకుండా, నియంతృత్వ ధోరణితో నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఇటువంటి నియంతృత్వ ప్రభుత్వాలను సాగనంపే తరుణం ఆసన్నమైందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ప్రైవేటుపరం చేస్తే ఉద్యమం మరింత ఉధృతం చేసేందుకు అఖిలపక్ష పార్టీలన్నీ సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకుడు బోనంగి చిన్నయ్య పడాల్‌, అల్లూరు జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, సీపీఐ నేతలు అంజలి, సర్పంచ్‌ పేట్ల రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్తులు దారాదత్తం చేస్తున్న మోదీ: వనజ
మోదీ ప్రభుత్వం దేశంలో అన్ని ప్రభుత్వరంగ ఆస్తులను, పరిశ్రమలను కార్పొరేట్‌ శక్తులకు కారు చౌకగా దారా దత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వనజ ముఖ్య అతిథిగా విచ్చేయగా సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్‌ బండి వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునీర్‌ తదితరులు పాల్గొన్నారు. నరసాపురం పట్టణంలో సీపీఐ సీనియర్‌ నాయకులు నెక్కంటి సుబ్బారావు, మండల కార్యదర్శి నెక్కంటి క్రాంతి కుమార్‌, పట్టణ కార్యదర్శి ఆరేటి మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు.
ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం: డేగా ప్రభాకర్‌
విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ హెచ్చరించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం వద్ద దీక్షలు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డేగా మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణకు జరుగుతున్న నిరసనలో ప్రజాసంఘాలు కలసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు, కొత్తపేట నియోజకవర్గ కన్వీనర్‌ కె.రామకృష్ణ, కొత్తపేట మండల కార్యదర్శి మోకా హేమలత, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ జి.రవికుమార్‌, ప్రజానాట్యమండలి జిల్లా సెక్రెటరీ వి.శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలులో జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యులు రేఖ భాస్కరరావు, సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.
త్యాగాల పునాదులపై..: పి.రామచంద్రయ్య
తెలుగు ప్రజల త్యాగాల పునాదులపై నిర్మితమైన విశాఖ ఉక్కు రక్షణ మనందరి బాధ్యతని, ఈనెల 30న విశాఖలో జరిగే గర్జన సభకు భారీగా ప్రజలు తరలిరావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.రామచంద్రయ్య పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ సీపీఐ, ఏఐటీయూసీల అధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్‌, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి కృష్ణయ్య, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కారుమంచి, ఏఐటీయూసీ తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు నెట్టికంటయ్య, రంగన్న తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటీకరణను ఉపసంహరించాలి: రావులపల్లి
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ఉపసంహరించాలని, లేనిపక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌ హెచ్చరించారు. సీపీఐ, ఏఐటీయూసీ రాష్ట్ర సమితుల పిలుపులో భాగంగా మచిలీపట్నం ధర్నాచౌక్‌లో నిరాహార దీక్ష చేపట్టారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌, ఏఐటీయూసీ నగర్‌ కార్యదర్శి లింగం ఫిలిప్‌ అధ్యక్షత వహించగా, వెలగపూడి ఆజాద్‌, జిల్లా ఇంచార్జ్‌ కార్యదర్శి తాడిపర్తి తాతయ్య, ఏఐటీయూసీ పట్టణ ఉపాధ్యక్షులు ఒంటి పులి లక్ష్మణరావు, రైతు సంఘం నాయకులు దగ్గాని సంగీతరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌ జిల్లాలో
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎన్టీఆర్‌ జిల్లాలో రెండోరోజూ నిరసన దీక్షలు కొనసాగాయి. నందిగామ గాంధీ సెంటర్‌లో ప్రముఖ న్యాయవాది మన్నెం నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ దోనేపూడి శంకర్‌ పాల్గొని విశాఖ ఉక్కు పరిశ్రమకు తెలుగు ప్రజలు చేసిన త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నందిగామ, మైలవరం నియోజకవర్గ కార్యదర్శులు చుండూరి సుబ్బారావు, బుడ్డి రమేష్‌, జగ్గయ్యపేట, నందిగామ నేతలు జె.శ్రీనివాసరావు, శివాజీ, చామంతి, వేముల వీరయ్య, మన్నే హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీం పట్నంలో కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు, బుడ్డి రమేష్‌, టి.నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
డోన్‌లో
స్థానిక డోన్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయం ముందు రెండో రోజు సీపీఐ డోన్‌ మండల కార్యదర్శి ఎస్‌ పులి శేఖర్‌ అధ్యక్షతన నిరసన దీక్ష కొనసాగించారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.రాధాకృష్ణ, ఏఐటీయూసీ డోన్‌ నియోజకవర్గ కార్యదర్శి అబ్బాస్‌, హమాలి వర్కర్స్‌ యూని యన్‌ డోన్‌ నియోజకవర్గం కార్యదర్శి కృష్ణ,ఏఐటీయూసీ డిప్యూటీ సెక్రటరీ గపూర్‌ తదితరులు పాల్గొన్నారు. దీక్షకు వలసల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు వలసల వెంకట రాముడు, వలసల సుధాకర్‌ మద్దతు తెలిపారు.
శ్రీకాళహస్తిలో
శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ అధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాధాకృష్ణ, గురవయ్య, ఖాదర్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img