Friday, April 26, 2024
Friday, April 26, 2024

వీడని ముసురు

పొంగిపొర్లుతున్న కృష్ణా, గోదావరి
వరద మంపులో వందలాది గ్రామాలు
కరెంటు లేక చీకట్లో కొట్టుమిట్టాడుతున్న పల్లెలు

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు సోమవారం కూడా అదే జోరును కొనసాగించాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిరదని పేర్కొంది. వచ్చే 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో మూడు రోజుల పాటు, తెలంగాణలో భారీ వర్షంతో పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. వరద నీటితో వాగులు, వంకలు, చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల్లో పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. కొన్నిచోట్ల వంతెనపై వరద నీరు పొంగిపొర్లుతుండడంతో గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పాత ఇళ్లు కూలిపోయాయి. భారీ వృక్షాలు రోడ్లకు అడ్డంగా పడ్డాయి. వరద ఉధృతికి పలుచోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షం ఉధృతి కొనసాగుతోంది. పట్టణాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విశాఖ నగరంలో కొండవాలు ప్రాంతాల్లో లక్షలాదిమంది జీవిస్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు కొండవాలు ప్రాంతాల్లో ఇల్లు కూలిపోతా యన్న భయాందోళనలో అనేకమంది బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. ఓల్డ్‌ టౌన్‌లో అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. చాలాచోట్ల పాఠశాలల ఆవరణలోకి నీరు చేరుతోండటంతో చెరువులు తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నీటిమట్టం ఎనిమిది అడుగులకు చేరింది. దీంతో అధికారులు బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేత ఆరు లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు కోనసీమ లంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో అనేక లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాటుపడవలపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. అలాగే పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అల్లూరి జిల్లా విలీన మండలాల్లో శబరి, గోదావరి నదులు భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలం సోకిలేరు వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండటంతో చింతూరు-వీఆర్‌ పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 38 అడుగులకు చేరుకుంది. వీఆర్‌పురం మండలం ములకపాడు గ్రామ సమీపంలోకి గోదావరి పోటెత్తింది. దీంతో గ్రామస్తులు కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని తల దాచుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారులు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షా లకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు, వైరా కటల్లేరుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. మున్నేరు నుంచి కీసర వద్ద కృష్ణా నదిలోకి 38 వేల 800 వందల క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 12 అడుగుల నీటి మట్టం నిల్వ చేస్తూ అదనపు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ 45 గేట్లు అడుగు మేర ఎత్తి 34,000 క్యూసెక్యుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. తాగు, సాగు నీటి అవసరాల కోసం కృష్ణా, తూర్పు, పశ్చిమ కాలువలకు 4,800 క్యూసెక్యుల నీటి విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. రిజర్వాయర్లు, నదులు సామర్థ్యానికి మించి వరద నీరు చేరుకోవడంతో పొంగిపొర్లుతున్నాయి.
భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్కుల
వరద నీరు విడుదల
పోలవరం: భద్రాచలం వద్ద సుమారు 14 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయడంతో ఆ నీరు జిల్లాకు రావడానికి మరో ఎనిమిది నుంచి 12 గంటల సమయం పట్టవచ్చని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరిని కలెక్టర్‌ పరిశీలించారు. వేలూరుపాడు, కునూరు ప్రాంతాలలో ముంపు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఇటువంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్‌ తెలిపారు.
ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. భద్రాచలం, కూనవరం నుంచి పోలవరానికి నీరు విడుదలపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. అధిక వర్షాల మూలంగా రెండు రోజులుగా పోలవరం ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటిని 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశామన్నారు. జిల్లాలో వరద కారణంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. జిల్లాలోని ఎర్రకాల్వ, జల్లేరు, తమ్మిలేరు కొవ్వాడ తదితర జలాశయాలు వద్ద నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. వరద ఉధృతి వల్ల ప్రాజెక్టు పనులు తాత్కాలికంగా నిలిపివేశామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img