Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సమస్యలపై చర్చించాల్సిందే

ఎంఎస్‌పీకి చట్టబద్ధ హామీ ఇస్తారా ? లేదా?
దేశ ప్రజలకు ప్రధాని సమాధానం ఇవ్వాలి
సాగు చట్టాల రద్దు గెజెట్‌ వస్తేనే ఇంటికి
లక్నో కిసాన్‌ మహాపంచాయత్‌లో రైతు నేతలు
పాల్గొన్న ఆరు రాష్ట్రాల రైతులు
కేంద్రానికి ఆరు డిమాండ్లు

లక్నో : కొత్త సాగు చట్టాలను పార్లమెంటులో అధికారికంగా రద్దు చేసి, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీకి చట్టం తెచ్చేంత వరకు తామెవ్వరం ఇంటి బాట పట్టబోమని కేంద్రానికి రైతులు సోమ వారం లక్నో కిసాన్‌ మహాపంచాయత్‌ ద్వారా తేల్చి చెప్పారు. లక్నోలోని ఎకో గార్డెన్‌లో కిసాన్‌ మహా పంచాయత్‌ విజయవంతం అయింది. ఉత్తరప్రదేశ్‌, హరియాణా, దిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ సహా ఆరు రాష్ట్రాల రైతులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తమ డిమాండ్లన్నీ పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమం ఆగబోదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో కేంద్రానికి ఆరు డిమాండ్లు చేశారు. కొత్త సాగు చట్టాలతో పాటు పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు ఉన్నాయని రైతు నేతలు అన్నారు. ఎంఎస్‌పీపై తమతో చర్చించాలని కేంద్రాన్ని డిమాండు చేశారు. తమ ఉద్యమంలో కలిసిరావాలని లేనిపక్షంలో హిందూముస్లింÑ హిందూసిక్కు, జిన్హా వివాదాల్లో చిక్కుకుపోయేలా చేసి, దేశాన్ని ప్రభుత్వం అమ్మేస్తుందని దేశ ప్రజలకు రైతు నేతులు పిలుపునిచ్చారు. క్షమాపణ చెప్పినంత మాత్రాన తమ పంటలకు న్యాయమైన ధర రైతులకు లభించదని, అందుకోసం విధానాన్ని రూపొందించాలని, ఎంఎస్‌పీ కోసం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కేంద్రానికి సూచించారు. గుజరాత్‌ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఈ కమిటీలో మోదీ సభ్యునిగా వ్యవహరించారని, ఎంఎస్‌పీకి చట్టబద్ధ హామీ ఇవ్వాలని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సూచించారని, ఆ నివేదిక పీఎంఓ వద్ద ఉందని, ఆ తర్వాత కొత్త కమిటీ అవసరంగానీ అంత సమయంగానీ దేశానికి లేదని రైతు నేతలు అన్నారు. ఎంఎస్‌పీకి చట్టబద్ధ హామీ ఇవ్వాలన్న కమిటీ సూచనను అంగీకరిస్తారో లేదో దేశానికి స్పష్టంచేయాలని ప్రధానిని డిమాండు చేశారు. ఈనెల 29న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సంసద్‌ చలో’కు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. ముందుగా ప్రకటించిన విధంగానే ట్రాక్టర్‌ ర్యాలీని నిర్వహిస్తామని స్పష్టంచేసింది. సాగు చట్టాలకు సంస్కరణలు అంటూ కేంద్రం చెబుతున్నది అంతా కల్పితమని, ఇదే పంధాను కొనసాగిస్తే యూపీలో అధికారాన్ని కోల్పోవడం ఖాయమని బీజేపీని ఎస్‌కేఎం, బీకేయూ నేతలు హెచ్చరించారు. ‘సంఘర్ష్‌ విశ్రామ్‌’ (ఆందోళన విరమణ)ను ప్రకటించినది కేంద్రమేగానీ రైతులు కాదని, కర్షకుల ముందు అనేక సమస్యలు ఉన్నాయని, ఆందోళన కొనసాగుతుందని బీకేయూ నేత రాకేశ్‌ తికైత్‌ తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం చేసే పనిగురించి ప్రజలలో అవగాహన కల్పిస్తామన్నారు. గెజెట్‌ జారీ అయితేనే సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసిందని నమ్ముతామని అన్నారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాత రైతులతో మాట్లాడే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్లు ఉందన్నారు. ఈ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తేనే తిరిగి గ్రామాలకు వెళ్లగలమన్నారు. ఎంఎస్‌పీ, విత్తనాలు, డెయిరీ, కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఆందోళనలో 750 మందికిపైగా రైతులు అమరులు అయ్యారని గుర్తుచేశారు. అనంతరం ఎస్‌కేఎం ఉత్తరాఖండ్‌ నేత గుర్మీత్‌ సుఖియా, రాష్ట్రీయ కిసాన్‌ మార్చ్‌ అధ్యక్షుడు శేఖర్‌ దీక్షిత్‌ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారని అన్నారు. ప్రధాని ఆకస్మికంగా సాగు చట్టాల రద్దు ప్రకటన చేసినప్పటికీ రైతులు ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. పార్లమెంటులో లాంఛనంగా మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని, అప్పటివరకు నిరసనలను విరమించబోమని కేంద్రానికి తేల్చిచెప్పారు. 2020 నవంబరు నుంచి దిల్లీలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ సరిహద్దుల్లో వందలాది మంది రైతులు నిత్యం ఆందోళనల్లో పాల్గొనడం విదితమే. ‘కొత్త సాగు చట్టాల రద్దుతో పాటు ఎంఎస్‌పీకి చట్టబద్ధ హామీ తదితర డిమాండ్లతో కిసాన్‌ మహాపంచాయత్‌కు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది.
రైతుల ఆరు డిమాండ్లు : కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ, విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరణ, దేశ రాజధాని, చట్టుపక్కల ప్రాంతాల వాయు నాణ్యత నియంత్రణ కమిషన్‌ ద్వారా రైతులపై శిక్షాస్మృతులను కొట్టివేయాలిÑ ఆందోళన నేపథ్యంలో అన్నదాతలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలిÑ లఖింపూర్‌ ఖేరి హింసతో సంబంధం ఉన్న కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలిÑ ఆందోళనలో అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, అమరుల కోసం స్మారకాన్ని సింఘు సరిహద్దు వద్ద నిర్మించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img