Friday, April 26, 2024
Friday, April 26, 2024

బెంబేలెత్తిస్తున్న వరదలు

కర్ణాటక, తమిళనాడులోనూ అదే పరిస్థితి
రహదారులు జలమయం.. జనజీవనం అస్తవ్యస్తం
నీట మునిగి దెబ్బతిన్న పంట పొలాలు

విజయవాడ/బెంగళూరు : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడులోని ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. భారీ వరదల కారణంగా తీవ్ర విధ్వంసం సంభవించింది. ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా నెలకొన్న వరదలు కొనసాగుతున్నాయి. రాయలసీమలోని అనేక ప్రాంతాలలో చిత్రావతి, పాపాగ్ని, పెన్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రభా విత జిల్లాలయిన చిత్తూరు, కడప, నెల్లూరుల్లో వేలాది ఇళ్లు నీట మునిగే ఉన్నాయి. ఇక పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. అనేక రహదారులు దెబ్బతిన్నాయి. వరద నీటిలో రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోయాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు, సిబ్బంది రేయింబళ్లు ట్రాక్‌ల పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. అనేక జిల్లాలు వరద నీటిలోనే ఉండటంతో అంటువ్యాధులు ప్రబలుతాయోమోనన్న ఆందోళన నెలకొంది. ఇక తమ ఇళ్లు, పంట పొలాలు తీవ్ర విధ్వంసానికి గురికావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తక్షణం సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను, ప్రజాప్రతినిధులను అర్థిస్తున్నారు. ఇదిలాఉండగా, వరద ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయక, పునరావాస చర్యలను పర్యవేక్షించేందుకు అక్కడే మకాం వేశారు. నెల్లూరు జిల్లాలో 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత దారుణమైన వరదలు సంభవించాయి. గత కొద్ది రోజులుగా అన్నమయ్య ఎత్తిపోతల పథకం ద్వారా పెన్నా నదికి రెండు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. నెల్లూరు బ్యారేజీ ద్వారా రికార్డు స్థాయిలో 5.49 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించిందని నెల్లూరు వరదలను పర్యవేక్షించే ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్‌ తెలిపారు. 140 ఏళ్ల తర్వాత ఇటువంటి వరద సంభవించిందని కేంద్ర జల సంఘం ఆంధ్రప్రదేశ్‌లోని అధికారులకు సమాచారం అందించింది. 1882లో ఇంత భారీ వరద సంభవించింది. తాజా వరద ఉధృతికి కోవూరు సమీపంలో చెన్నై-కోల్‌కతా రహదారి దెబ్బతిన్నది. అయితే జాతీయ రహదారి ఇప్పుడు తాత్కాలికంగా పునరుద్ధరించబడిరది. నెల్లూరులో ఏర్పాటు చేసిన 90 సహాయక శిబిరాల్లో 35 వేల మందికి ప్రజలు ఉన్నారు. కాగా ఆదివారం నుంచి వర్షం కురవకపోవడంతో వరద ముప్పు తప్పిందని, ప్రస్తుతం సహాయక చర్యలపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. గత వారం ప్రారంభమైన నాలుగు రోజుల వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వరదలు సంభవించాయి. జిల్లాలోని రాయలచెరువు గట్లు తెగితే వరద ముంపునకు గురయ్యే 18 గ్రామాలకు చెందిన 20 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
బెంగళూరు జలమయం..
కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు ఉత్తర బెంగళూరులోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక సరస్సులు పొంగి పొర్లడంతో యలహంక, మహదేవపుర మండలంలో అపార్ట్‌మెంట్‌లోని లోతట్టు ప్రాంతాలు, బేస్‌మెంట్లలోని ఇళ్లలోకి నీరు చేరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర బెంగళూరులోని అతిపెద్ద టెక్‌ పార్క్‌లలో ఒకటైన మాన్యతా టెక్‌ పార్క్‌ కూడా వరద ముంపులో చిక్కుకుంది. అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఒకటయిన యెలహంకలోని కేంద్రీయ విహార్‌ నీట మునిగింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌(జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం), అగ్నిమాపక, అత్యవసర సేవా సిబ్బంది అక్కడ నివసిస్తున్న ప్రజలకు సహాయం చేయడానికి కృషి చేస్తున్నారు. తెప్పల సాయంతో బయటకు వెళ్లాలనుకునే వారిని తరలిస్తున్నారు. ‘బెంగళూరులో అత్యధికంగా దాదాపు రెండు గంటల్లో దాదాపు 138 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా వాహనదారులు ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. కాగా నవంబర్‌లో అకాల వర్షాల కారణంగా దక్షిణ కర్ణాటక ప్రాంతంలో 24 మంది మరణించారు. 5 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నా యని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆదివారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై.. నష్టం ఎంత ఉందో అంచనా వేయడానికి సంయుక్త సర్వేకు ఆదేశించారు.
తమిళనాడులోనూ అదే పరిస్థితి
తమిళనాడులో భారీ వర్షాల కారణంగా విల్లుపురం, కడలూరు జిల్లాల్లో తెన్‌పెన్నై నది పొంగిపొర్లుతోంది. కృష్ణగిరి, తిరువణ్ణామలై జిల్లాల్లో వర్ష సంబంధిత ఘటనల్లో ముగ్గురు మరణించారు. విల్లుపురంలో పంట భూములు వరద నీటిలో చిక్కుకున్నాయి. అయితే రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. వచ్చే ఐదు రోజుల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img