Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

సిగ్నల్‌ వ్యవస్థ లోపమే!

. ఒడిశా రైలు దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక
. మానవ తప్పిదమూ ఉండొచ్చంటున్న అధికారులు
. ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించిన రైల్వే శాఖ

న్యూదిల్లీ: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక వెల్లడిరచింది. ఇందులో కీలక విషయాలు వెలుగుచూశాయి. పొరపాటుగా సిగ్నల్‌ ఇవ్వడమే ఇంతటి ఘోరానికి కారణమని ప్రాథమిక నివేదిక తేల్చింది. మానవతప్పిదం కారణంగానే గూడ్స్‌ రైలు నిలిచి ఉన్న ట్రాక్‌లోకి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశించిందని, మూడు రైళ్లు ఢీకొట్టుకోవడానికి ఇదే కారణమని ఉన్నతాధికారులతో కూడిన నిపుణుల బృందం తేల్చినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. మరోవైపు ప్రమాదం జరిగిన రైలు మార్గం పాక్షికంగా తుప్పుపట్టి ఉన్నట్లు నిర్ధారించింది. హౌరా నుంచి చెన్నై వెళుతున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు పొరపాటున సిగ్నల్‌ రావడంతో శుక్రవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో బాలాసోర్‌లోని బహనగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో లూప్‌ లైన్‌లోకి ప్రవేశించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో లూప్‌ లైన్‌లోకి వచ్చింది. పొరపాటును గమనించి ఆ వెనువెంటనే సిగ్నల్‌ను ఉపసంహరించుకున్నప్పటికీ అప్పటికే రైలు లూప్‌ లైన్‌లోకి ప్రవేశించింది. ఫలితంగా అదే లైన్‌లో ఆగివున్న గూడ్స్‌ రైలుని కోరమాండల్‌ వేగంగా ఢీకొట్టింది. ఈ తీవ్రత ధాటికి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 21 బోగీలు విడిపోయి పక్క లైన్‌లో పడ్డాయి. సరిగ్గా ఇదేసమయంలో ఈ లైన్‌లో వెళుతున్న బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్‌పై ఉన్న బోగీలను బలంగా ఢీకొట్టింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పొరబాటున లూప్‌ లైన్‌లోకి మారడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ‘సిగ్నలింగ్‌ వైఫల్యం’ కారణంగా ఒడిశా రైలు ప్రమాదం జరిగిందని నిపుణుల బృందం ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. అయితే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ సిగ్నల్‌ ఇచ్చి ఎందుకు టేకాఫ్‌ చేశారన్నది మాత్రం నిపుణుల బృందం స్పష్టం చేయలేదు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్‌ ఇచ్చినట్టే ఇచ్చి ఉపసంహరించుకోవడమే ఇందుకు కారణమైనట్టు నిశితంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు నిర్ధారించారు. ఈ మేరకు జేఎన్‌.సుబుదీ, ఆర్‌కే బెనర్జీ, ఆర్‌కే పంజిరా, ఏకే మహంతితో కూడిన నలుగురు సభ్యుల బృందం చేతి రాతతో 2 పేజీల నివేదికను రైల్వేకి శనివారం సమర్పించింది. తమ పరిశీలనలు, బహనగర్‌ బజార్‌ రైల్వే స్టేషన్‌లోని సిగ్నల్‌ రూమ్‌ రికార్డులు పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని వివరించింది. అయితే సిగ్నలింగ్‌లో మానవ తప్పిదం కారణంగా ఇది జరిగి ఉండవచ్చు’ అని రైల్వే అధికారి ఒకరు వెల్లడిరచారు. ప్రమాద సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. దీంతో లూప్‌ లైన్‌లో ఉన్న గూడ్స్‌ రైలును గుర్తించినా వేగాన్ని నియంత్రించలేకపోయినట్లు తెలుస్తోంది. గూడ్స్‌ను ఢీకొట్టగానే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌… దాని మీదకు దూసుకెళ్లినట్లు రైల్వే అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కాగా, రైల్వే భద్రతా కమిషనర్‌ ఏర్పాటు చేసిన సాంకేతిక దర్యాప్తు (టెక్నికల్‌ ఎంక్వైరీ) సమగ్ర నివేదిక వచ్చాకే అసలు కారణాలు తెలియనున్నాయని నిపుణుల బృందం అభిప్రాయపడిరది. ఇక రెండు రైళ్లలోనూ స్లీపర్‌ కోచ్‌ల కంటే ఏసీ కోచ్‌లపై ప్రమాదం తీవ్రత ఎక్కువగా నివేదిక తేల్చింది. మరోవైపు ఇంతటి ఘోరం నేపథ్యంలో రైలు మార్గంలో రక్షణ కవచ్‌ ఉందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా లూప్‌ లైన్‌ అనేది ఒక రైల్వే ట్రాక్‌. మెయిన్‌ లైన్‌ నుంచి రైలు దారి మళ్లించడం లేదా మెయిన్‌ ట్రాక్‌లోకి ప్రవేశపెట్టేందుకు దీనిని వినియోగిస్తుంటారు. సర్వీసు లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా, ఇతర రైళ్లపై ఎలాంటి ప్రభావం పడకుండా దీనిని ఉపయోగిస్తుంటారు.
ఏఎం చౌదరి నేతృత్వంలో దర్యాప్తు
ఒడిశాలో ట్రిపుల్‌ రైలు దుర్ఘటనకు దారితీసిన కారణాలపై భారతీయ రైల్వే ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించింది. సౌత్‌ ఈస్టర్న్‌ సర్కిల్‌ పరిధిలోని రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్‌) కమిషనర్‌ ఏఎం చౌదరి విచారణకు నాయకత్వం వహిస్తారని రైల్వే ప్రతినిధి తెలిపారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న రైల్వే భద్రత కమిషనర్‌, అటువంటి సంఘటనలను పరిశీలించడానికి బాధ్యత వహిస్తారు. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత, ‘ఏఎం చౌదరి, సీఆర్‌ఎస్‌, ఎస్‌ఈ సర్కిల్‌, ప్రమాదంపై విచారణ జరుపుతుంది’ అని ప్రతినిధి శనివారం పేర్కొన్నారు. సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే, సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలోకి వచ్చే మార్గాలకు సౌత్‌ ఈస్టర్న్‌ సర్కిల్‌ బాధ్యత వహిస్తుంది. మూడు జోన్ల మొత్తం ట్రాక్‌ పొడవు సుమారు 7,651 కిలోమీటర్లు. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలోని బహనాగ బజార్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైలు మధ్య విషాదకరమైన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 280 మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఉన్నారు. రైలు ప్రమాదానికి గల కారణాలు విచారణ తర్వాత తెలుస్తాయని వైష్ణవ్‌ తెలిపారు. ‘మా దృష్టి ఇప్పుడు సహాయక, రక్షణ కార్యకలాపాలపై ఉంది’ అని అన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి శనివారం రాష్ట్ర సంతాప దినాన్ని కూడా ప్రకటించారు. ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లో రెండు గూడ్స్‌ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న నేపథ్యంలో, రైలు పట్టాలు తప్పడం, లోకో పైలట్ల సిగ్నల్‌లను ఓవర్‌షూట్‌ చేయడం వంటి ప్రమాదాలను నివారించడానికి రైల్వే నెల రోజుల పాటు భద్రతా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం క్రింద, రైల్వే బోర్డు, జోనల్‌ రైల్వేలు, డివిజన్‌లకు చెందిన సీనియర్‌ అధికారులు వివిధ విభాగాలు, సిబ్బంది లాబీలు, నిర్వహణ కేంద్రాలు, పని ప్రదేశాలు మొదలైనవాటిని సందర్శించి ప్రమాదాలు లేదా అసాధారణ సంఘటనలను నివారించడానికి సూచించిన సురక్షితమైన కార్యాచరణ, నిర్వహణ పద్ధతులను తనిఖీ చేయడానికి, అమలు చేయడానికి ‘పని విధానాలను క్షుణ్ణంగా సమీక్షించి’ సురక్షితంగా తనిఖీ చేసి అమలు చేయాలని ఆదేశించారు. భారతీయ రైల్వేలు తన వ్యవస్థలో ‘కవచ్‌’ అనే యాంటీ ట్రైన్‌ కొలిషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నాయి. లోకో పైలట్‌ సిగ్నల్‌ను జంప్‌ చేసినప్పుడు ‘కవచ్‌’ హెచ్చరిస్తుంది. (సిగ్నల్‌ పాస్డ్‌ ఎట్‌ డేంజర్‌ ` ఎస్‌పీఏడీ), ఇది రైలు ఢీకొనడానికి ప్రధాన కారణం. ఈ వ్యవస్థ లోకో పైలట్‌ను అప్రమత్తం చేయగలదు. బ్రేక్‌లను నియంత్రించవచ్చు. నిర్ణీత దూరంలో అదే లైన్‌లో మరొక రైలును గమనించినప్పుడు స్వయంచాలకంగా రైలును నిలిపివేస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img