Friday, April 26, 2024
Friday, April 26, 2024

14,200 పోస్టులు..

వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌
పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ..
అక్టోబరు నుంచి ప్రక్రియ.. నవంబరు 15కల్లా పూర్తి

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయనున్నారు. పీహెచ్‌సీల నుంచి వైద్య కళాశాలల వరకు ఖాళీగా ఉన్న దాదాపు 14,200 పోస్టుల నియామకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కోవిడ్‌-19 నివారణ, నియంత్రణ, వాక్సినేషన్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై తొలుత సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుతం ఉన్న అవసరాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం, ఇకపై రాష్ట్రంలో వైద్యులు, సిబ్బంది కొరత ఉండరాదని స్పష్టం చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నాం, తీరా అక్కడ చూస్తే, సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి ఉంటే ఉపయోగం ఏముందని ప్రశ్నించారు. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నామని, ఇకపై దీనికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలంటే కావాల్సిన సిబ్బంది వెంటనే నియమించాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాలన్నారు. ఒక డాక్టరు సెలవులో వెళితే, ఆ స్థానంలో మరో డాక్టరు విధులు నిర్వహించేలా తగిన సంఖ్యలో వైద్యులను నియమించాలని సూచించారు. పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ 14,200కు పైగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రతిపాదనలు అందజేయగా సీఎం వాటికి ఆమోదం తెలిపారు. తక్షణమే నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. అక్టోబరు 1 నుంచి ప్రక్రియ మొదలుపెట్టి నవంబరు 15 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. అనంతరం కోవిడ్‌ కేసులు, వాక్సినేషన్‌పై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైరస్‌ ఉధృతిగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలో వాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. అలాగే రాత్రిపూట కర్ఫ్యూను యథావిధిగా అమలు చేయాలని, వాక్సినేషన్‌ ప్రక్రియే కోవిడ్‌ సమస్యకు పరిష్కారం అయినందున దానిని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సలహాదారు గోవిందహరి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ వి.వినయ్‌ చంద్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img