Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

22న విజయవాడలో మహాధర్నా

. జగన్‌ నివాసాలు ఎకరాల్లో… పేదల నివాసానికి సెంటు భూమేనా?
. టిడ్కో గృహాలను సందర్శించిన రామకృష్ణ, ముప్పాళ్ల

విశాలాంధ్ర`చిలకలూరిపేట: పేదల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పి, టిడ్కో గృహ లబ్ధిదారులకు ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్లు చేయిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌ రెడ్డి మాట తప్పారని, మహిళలను దారుణంగా మోసగించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. శనివారం చిలకలూరిపేట పట్టణం లోని చెరువులకు వెళ్లే దారిలో 52 ఎకరాల్లో ఉన్న టిడ్కో గృహాలను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు, పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్‌, చిలకలూరిపేట ఏరియా కార్యదర్శి నాగబైరు రామసుబ్బాయమ్మ తదితర నాయకులతో కలసి సందర్శించారు. గృహ సముదా యంలో ఉన్న లబ్ధిదారుల నుంచి సమస్యలు అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభు త్వం హయాంలో సొంతింటి కల నెరవేరే విధంగా పేద ప్రజల నుంచి రూ.20 వేలు, రూ.50 వేలు, లక్ష రూపాయలు డిపాజిట్లు తీసుకొని టిడ్కో గృహాలను నిర్మిస్తే ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక్క రూపాయీ తీసుకోకుండా లబ్ధిదారులందరికీ టిడ్కో గృహాలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా అరకొరగా మాత్రమే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారని విమర్శించారు. చిలకలూరిపేటలో 2,200 మందికి ఇళ్లు అందించామని చెబుతున్నా, కొంతమందికి ఇళ్లకు తాళాలు ఇచ్చి స్వాధీనం చేశారని, అవి కూడా వసతులు కల్పించకుండా అందజేశారని వివరించారు. గతం నుంచి సీపీఐ పేద ప్రజలకు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమి అందజేయాలని డిమాండ్‌ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఊళ్లకు దూరంగా సెంటు భూమి ఇచ్చి, రూ.1.80 లక్షలతో ఇళ్ల నిర్మాణం చేసుకోమనడం దుర్మార్గమని అన్నారు. సీఎం జగన్‌కు తాడేపల్లి, హైదరాబాద్‌, బెంగళూరులో ఎకరాల ప్రాంగణంలో ఇళ్లు ఉంటే పేద వారికి మాత్రమే కేవలం సెంటు భూమి కేటాయించడం, అందులోనే ఇచ్చిన డబ్బుతోనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని వలంటీర్లు, అధికారులతో ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రూ.1.80 లక్షలతో కనీసం పునాదులు కూడా పూర్తి కావని అధికారులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నా కనీసం పట్టించుకోకుండా వ్యవహరించటం వల్ల పేదవారి పట్ల జగన్‌కు ఉన్న ప్రేమ ఏపాటిదో అర్ధమవుతోంద న్నారు. గృహ నిర్మాణాలకు రూ.5 లక్షలతో పాటు ఇసుక, సిమెంటును ప్రభుత్వమే అందించాలని, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చేలా చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. టిడ్కో గృహాల్లో వసతులు కల్పించి వెంటనే లబ్ధిదారులకు అందించాలని, సేకరించిన డిపాజిట్లను వెనక్కు ఇవ్వాలని, ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించి స్వాధీనం చేయాలని కోరారు. పేదల ప్రజల సొంతింటి కల నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమం సాగించ డానికి సీపీఐ అధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ, ఎమ్మార్వోలకు, ఆర్డీవోలకు వినతి పత్రాలు ఇవ్వడం, జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల వద్ద లబ్ధిదారులతో ధర్నా నిర్వహించటం జరిగిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. లబ్ధిదారులకు బాసటగా ఈనెల 22న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నామని, టిడ్కో గృహాలు, జగనన్న కాలనీల లబ్ధిదారులు, పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లా డుతూ జగనన్న కాలనీలను ఓట్ల కాలనీగా మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రంలో ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నాయని విమర్శించారు. కనీస సౌకర్యాలు లేకుండా కాలనీలు ఏర్పాటు చేశారని, పేదవారి కష్టాలు పట్టడం లేదన్నారు. ప్రభుత్వం రూ.10 బటన్‌ నొక్కి వేస్తున్నట్లు చెబుతూ రూ.100 వసూలు చేస్తోందన్నారు. నేడు టిడ్కో గృహాలు అందజేసినా, పేదలకు స్థలాలు పంపిణీ చేసినా సీపీఐ చేసిన పోరాటాల ఫలితమేనన్న విషయాన్ని లబ్ధిదారులు గమనించాలన్నారు. సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్‌ మాట్లాడుతూ నాలుగేళ్లుగా సొంతింటి కోసం ఎదురు చూసిన టిడ్కో గృహ లబ్ధిదారులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల జాబితాను మార్చి తమ పార్టీ వారికి కేటాయించటానికి ప్రయత్నిస్తున్నారని, 60 ఏళ్ల వయసు ఉందని లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు నిలిపివేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. ఏ ఒక్క లబ్ధిదారుడిని తొలగించినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
తాగునీటి వసతి కల్పించాలి: లబ్ధిదారుల గోడు
టిడ్కో గృహాల సందర్శనకు వచ్చిన సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ, పార్టీ బృందాన్ని లబ్ధిదారులైన అనేక మంది మహిళలు కలసి తమ సమస్యలు విన్నవించు కున్నారు. నివాసం ఉండే వారికి ఒకే ట్యాంకు నిర్మించారని, రోజుల తరబడి అదే నీరు తాగాల్సి వస్తోందని తెలిపారు. ఇళ్ల సమీపంలో వీధి కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇళ్ల సమీపంలో పెరిగిన పొదల నుంచి పాములు, విష కీట కాలు వస్తున్నాయని, కొన్ని ఇళ్లలో శానిటరీ పైపులు ఊడి మురుగు నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి రామకృష్ణ భరోసా కల్పిస్తూ బాధితులకు అండగా పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు. లబ్ధిదారుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని స్థానిక సీపీఐ నేతలకు సూచించారు. కార్యక్ర మంలో వినుకొండ సీపీఐ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్‌ సుభాని, ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తాళ్లూరి బాబురావు, ఉలవులపాడు రాము, ఏఐటీయూసీ ఏరియా అధ్యక్షుడు పేలూరి రామారావు, ఏపీ మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకు పల్లి నిర్మల, నాయకులు నాయుడు శివకుమార్‌, చౌటుపల్లి నాగేశ్వరరావు, పి.శివలీల, బి.లలిత కుమారి, సృజన్‌, కందిమళ్ల వెంకటేశ్వర్లు, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి పోటు శ్రీనివాసరావు, సీపీఐ నాయకులు బొంతా భగత్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img