Friday, April 26, 2024
Friday, April 26, 2024

8 గంటలు

. అవినాశ్‌రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన సీబీఐ
. నేడు మళ్లీ రావాలని ఆదేశం
. 5 గంటలకు పైగా భాస్కరరెడ్డి విచారణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో పార్లమెంటు సభ్యులు అవినాశ్‌రెడ్డిని బుధవారం సీబీఐ అధికారులు దాదాపు 8 గంటల పాటు విచారించారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు మాఫీ, హత్యకు ముందు జరిగిన ఘటనల్లో వారి పాత్ర, ఆ తర్వాత దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం తదితర అంశాలపై సీబీఐ అధికారులు ఆయనపై ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 25వ తేదీ వరకు అవినాశ్‌రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే అప్పటివరకు సీబీఐ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని సూచించింది. దీనిలో భాగంగా న్యాయవాది సమక్షంలో అవినాశ్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. హైకోర్టు సూచన మేరకు రాతపూర్వకంగా ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే, విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేశారు. అనంతరం గురువారం ఉదయం 10.30 గంటలకు మరలా రావాలని సూచించారు. కాగా, అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని, ఆయన ముఖ్య అనుచరుడు ఉదయకుమార్‌రెడ్డిని కూడా సీబీఐ అధికారులు 5 గంటలపాటు విచారించారు. వివేక కేసులో చంచల్‌గూడ జైలులో నిందితులుగా ఉన్న వీరిద్దరిని సీబీఐ కోర్టు కస్టడీకి అనుమతించింది. దీంతో సీబీఐ అధికారులు వీరిని ఉదయం 10.40 గంటలకు చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి తరలించారు. 11 గంటలకు విచారణ ప్రారంభించిన అధికారులు సాయంత్రం 4.15 గంటల వరకు వేర్వేరుగా విచారించి…మరలా జైలుకి తరలించారు. కోర్టులో జరిగిన వాదనల్లో వివేక హత్యకు డీల్‌ రూ 40 కోట్లుగా సీబీఐ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img