Monday, September 26, 2022
Monday, September 26, 2022

కృష్ణా పరవళ్లు

పెరుగుతున్న వరద ఉధృతి

. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఎనిమిది గేట్లు ఎత్తివేత
. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటి విడుదల

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టులు నిండుకోవడంతో సుమారు లక్షా 80వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నిండుకుండలా ఉంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరద మొత్తం దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 214.36 టీఎంసీల నీరు ఉంది. స్విల్‌ వే ద్వారా సాగర్‌కు 1,73,695 క్యూసెక్కుల నీటిని 6 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేపడుతూ 63,046 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఈ వరద మొత్తం నాగార్జున సాగర్‌ జలశయానికి చేరుతోంది. ప్రస్తుతం సాగర్‌ ప్రాజెక్టుకు 2లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుం డగా, దిగువకు విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 27వేల క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్‌ జలాశయం నీటి సామర్థ్యం మొత్తం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 247.04 టీఎంసీల నిల్వ ఉంది. ఇక సాగర్‌ దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 40.49 టీఎంసీల నిల్వ ఉంది. పులిచింతలకు 40 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువకు 51వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీనికితోడు పులిచింతల దిగువ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లి దాదాపు లక్షా 20వేల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. దీంతో బ్యారేజీకున్న మొత్తం 70 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి ఎగువ నుంచి వరద మొత్తాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశాను అనుకొని తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండగా, ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి, భూమి మీదకు ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో అనేకచోట్ల వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మిగతా కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడతాయని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌పై ఇది కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని, తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి వర్షాలు పెరిగే అవకాశం ఉందని వెల్లడిరచింది. దీనివల్ల గోదావరి వరద ప్రభావం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఒకపక్క వర్షాలు, మరోపక్క కృష్ణా, గోదావరి నదులకు వరద ఉధృతి పెరుగుతుండడంతో తీర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img