Friday, April 26, 2024
Friday, April 26, 2024

జీతాలు పెంపుపై కార్మికుల హర్షం

ముగిసిన మునిసిపల్‌ కార్మికుల దీక్షలు

విశాలాంధ్ర`విజయవాడ : మున్సిపల్‌ కార్మికుల పోరాట ఐక్య వేదిక అధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా చేపట్టిన సమ్మెలో భాగంగా నాలుగు రోజులుగా తాడిగడప పురపాలక సంస్థ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న నిరసన దీక్షలు శుక్రవారం ముగిశాయి. వేతనాలు, హెల్త్‌ అలవెన్సు పెంచుతూ మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చేసిన ప్రకటనపై పారిశుద్ధ్య సిబ్బంది హర్షం వ్యక్తంచేశారు. తమ పోరాటం విజయం సాధించినందుకు కార్మికులు మిఠాయిలు పంచుకుని అభినందనలు తెలియజేసుకున్నారు. తాడిగడప మున్సిపల్‌ కార్యాలయ అవరణలో ఉన్న మహాత్మా గాంధీ, నేతాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మున్సిపల్‌ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందించేందుకు ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు వెళ్లగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో శానిటరీ అధికారి సూర్యారావుకు అందజేసి కార్మికుల సమస్యలు సకాలంలో పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు అనుమోలు ప్రభాకర్‌, ఏఐటీయూసీ నాయకుడు మోతుకూరి అరుణకుమార్‌, సీఐటీయూ నాయకుడు చౌటుపల్లి రవి, యూనియన్‌ నాయకులు ఉప్పాడ త్రిమూర్తులు, మస్తాన్‌ వలి, ఎస్‌కే కాశీం మాట్లాడుతూ సమ్మెలో పాల్గొన్న వారిని వేధించవద్దని, తక్షణమే పనిలోకి తీసుకోవాలని కోరారు. ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా కాకుండా మున్సిపాలిటీ పరిధిలోని సిబ్బంది మొత్తానికి ఒకే విధంగా జీతాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అమరయ్య శాస్త్రి, శ్రీనివాస్‌, మున్సిపల్‌ యూనియన్‌ అధ్యక్షుడు వై.సరళ, చొప్పవరపు కరుణ కుమారి, పాతాళ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ప్రతినిధులు పాల్గొని కార్మిక సంఘ నాయకులను శాలువాతో సత్కరించి సంఫీుభావం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img