Friday, April 26, 2024
Friday, April 26, 2024

వరద ప్రాంతాల్లో పర్యటించాలి

ప్రధాని మోదీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: తుపాను, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ స్వయంగా పర్యటించి, కేంద్రం సాయమందించి ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి శుక్రవారం ఆయన ఒక లేఖ రాశారు. వర్షాలు, వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని, కృష్ణా, గోదావరి నదులు మహోగ్రరూపం దాల్చాయన్నారు. అనేక గ్రామాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయని పేర్కొన్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయని, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయని వివరించారు. కోనసీమ, అల్లూరి సీతారామరాజు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీవ్రంగా వరద నష్టం సంభవించిందన్నారు. ఎగువనున్న మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్‌, ఒడిశాలలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా గోదావరితోపాటు ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగాయన్నారు. వరద ఉధృతికి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకు ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తివేశారని, గోదావరి నదికి వందేళ్లల్లో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయన్నారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 28.50 లక్షల క్యూసెక్కులు తట్టుకునే స్థాయికి నిర్మించారని, పోలవరం ప్రాజెక్టు వద్దకు 17 లక్షల క్యూసెక్కుల నీరు చేరిందని పేర్కొన్నారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు 43 మీటర్లుకాగా, ఇప్పటికే వరద మట్టం 36.495 మీటర్లకు చేరిందన్నారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 26.20 మీటర్లకు చేరుకుందని, పోలవరం ప్రాజెక్టుకు 30 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశముందన్నారు. ఇదే జరిగితే పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాం పరిస్థితి ఆందోళనకరమేనని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 17లక్షల క్యూసెక్కులు ఉండగా, రానున్న 24 గంటల్లో వరద ఉధృతి మరింత పెరిగి 23 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశముందన్నారు. ఆ ప్రాంతంలో నీటి ప్రవాహం 20 లక్షల క్యూసెక్కులకు చేరితే ఆరు జిల్లాల్లోని 42 మండలాలలోని 554 గ్రామాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగి నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక, చింతూరులలో దాదాపు 13 వేల కుటుంబాలు వరద ముంపులో చిక్కుకున్నాయని పేర్కొన్నారు. వేలాది మంది నివాసాలు కోల్పోయి, పునరావాస కేంద్రాలకు చేరి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. మరోపక్క శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోందని, 1.69 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరిందని పేర్కొన్నారు. శ్రీశైలం డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 832 అడుగులకు చేరిందన్నారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో చాలా గ్రామాలు నీట మునిగాయని, పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో విపరీతమైన వర్షాలు, కృష్ణా, గోదావరి నదులకు వరదలు సంభవించిన కారణంగా పెను నష్టం వాటిల్లిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలను పర్యటింపజేసి, జరిగిన పెను నష్టాన్ని అంచనా వేయించాలని కోరారు. ప్రధాని మోదీ స్వయంగా పెను విపత్తు జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, కేంద్రం నుంచి తక్షణమే తగిన సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img