Friday, April 26, 2024
Friday, April 26, 2024

జల ప్రళయం – హడలెత్తిస్తున్న గోదావరి

గంట గంటకూ పెరుగుతున్న ఉధృతి
వందేళ్ల చరిత్రలో ఇది రెండో అతిపెద్ద వరద
నీటమునిగిన వందలాది గ్రామాలు
సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే
సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం
మరో 24 గంటలు అప్రమత్తం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి/రాజమహేంద్రవరం/కాకినాడ: గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఏకమై గోదావరి పోటెత్తుతోంది. గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతూ నదీ తీర ప్రాంతాల ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే నది రెండు వైపులా వందల ఊళ్లు నీట మునిగాయి. ఇంకా వరద పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గురువారం రాత్రి 15 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేయగా, అది శుక్రవారం ఉదయం 18 లక్షలకు, సాయంత్రానికి 21 లక్షలకు చేరింది. శనివారం నాటికి 25 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వందేళ్ల చరిత్రలో ఈస్థాయి భారీ వరద రావడం ఇది రెండోసారి అని అధికారులు చెపుతున్నారు. ఒకేసారి ఎగువ రాష్ట్రాలయిన మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వడెం వాగులతో పాటు చిన్నపాటి వాగులు, వంకలన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఈ వరద ఉధృతి ధాటికి ఎగువనున్న శ్రీరాంసాగర్‌ నుంచి ధవళేశ్వరం వరకు మొత్తం 9 ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు గోదావరి నీటిమట్టం 70 అడుగులకు చేరుకోగా, రాత్రి 9 గంటలకు 72 అడుగులకు చేరుకుంది. 1986 సంవత్సరంలో 75 అడుగులకు వరద చేరుకోగా, ప్రస్తుతం మళ్లీ ఆ పరిస్థితి వచ్చే అవకాశమున్నట్లు అధికారులు చెపుతున్నారు. వరద తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలు ముమ్మరం చేసింది. పల్లపు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు బలవంతంగా తరలిస్తున్నారు. నీట మునిగిన గ్రామాల్లో చిక్కుకున్న బాధితులను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. వీటిని కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారింది. కుక్కునూరు మండలంలో అన్ని గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి రహదారి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక మండల కేంద్రం కుక్కునూరు అయితే పూర్తిగా అష్టదిగ్బంధంలో ఉంది. దీనికి నలువైపులా నీరు చేరడంతో ఈ గ్రామ ప్రజలు ఎటూ వెళ్లటానికి అవకాశం లేని పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో ఒకే ఒక వీధి మెరక ప్రాంతంలో ఉంది. అక్కడే జూనియర్‌ కాలేజీ కస్తూర్బా పాఠశాల ఉండటంతో అక్కడే పునరావాసాలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రజలందరినీ అక్కడకు తరలించారు.
సీఎం ఏరియల్‌ సర్వే… సమీక్ష
శుక్రవారం మధ్యాహ్నాం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వరద ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వరద ప్రభావిత జిల్లాలకు సహాయక చర్యలు వేగవంతం చేయడం కోసం ఒక్కో సీనియర్‌ అధికారిని నియమించారు. రాబోయే 24 గంటలు చాలా కీలకమని, హైఅలర్ట్‌గా ఉండాలని సీఎం వారికి సూచించారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు సహా అనేక జిల్లాల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
వరద ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి
గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. గట్లు బలహీనంగా ఉన్నచోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన పక్షంలో తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఇసుక బస్తాలు తదితర సామాగ్రిని సిద్ధం చేయాలన్నారు. అలాగే వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని, ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్‌, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలని ఆదేశించారు. వీటితోపాటు సహాయ శిబిరాల్లో ఉండే ప్రతి కుటుంబానికీ కూడా రూ.2 వేలు ఇవ్వాలన్నారు. రాజమండ్రిలో 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర సర్వీసుల కోసం, పరిస్థితిని సమీక్షించేందుకు ఆ హెలికాప్టర్లను వినియోగించుకోవాలని సూచించారు. మరోపక్క వరదల కారణంగా గ్రామాల్లో పారిశుధ్య సమస్య రాకుండా, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలి. పాముకాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత ఇంజెక్షన్లను కూడా ఆయా ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలి. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో అందించే సేవలు నాణ్యంగా ఉండాలి. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సెల్‌టవర్లకు డీజీల్‌ సరఫరా చేసి.. నిరంతరం అవి పనిచేసేలా చూడాలని ముఖ్యమంత్రి వారికి ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img