Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అదానీకి సీఎం కట్టబెట్టిన
ఆస్తుల వివరాలన్నీ వెల్లడిరచాలి

కె.రామకృష్ణ డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో అదానీ కంపెనీలకు కట్టబెట్టిన ఆస్తుల వివరాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తక్షణమే వెల్లడిరచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అదానీ డొల్ల కంపెనీలతో లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు హిండెన్‌బర్గ్‌ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక అనంతరం అదానీ అర్థిక అవకతవకల వ్యవహారం దేశాన్నే కుదిపేస్తున్నది. కేవలం నెలరోజుల్లో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల మదుపుదారుల సంపద ఆవిరైంది. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి ప్రభుత్వరంగ సంస్థలు అదానీ గ్రూప్‌లో పెట్టిన పెట్టుబడుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. హిండెన్‌బర్గ్‌ నివేదికపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆఘమేఘాల మీద మంత్రివర్గ సమావేశం నిర్వహించి, అదానీ కంపెనీలకు భూములు కట్టబెట్టడం వెనుక మర్మమేంటి? పొరుగున ఉన్న తెలంగాణాలో అదానీ కంపెనీల ఏర్పాటుకు ఆస్కారం లేదంటూ ఆ ప్రభుత్వం తిరస్కరించింది. కానీ ఏపీలో మాత్రం అదానీకి జగన్‌ సర్కార్‌ రెడ్‌కార్పెట్‌ పరుస్తూ ఇబ్బడిముబ్బడిగా ఆస్తులను కట్టబెట్టింది. ఏపీకి సంబంధించిన పోర్టులు, సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు వంటివి అనేక అదానీ కంపెనీలకు అప్పగించారు. ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం పోర్టులను అదానీ కంపెనీలకు దారాదత్తం చేశారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి, మరో 14 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన గంగవరం పోర్టును కేవలం రూ.628 కోట్లకు అదానీకి కంపెనీకి అప్పజెప్పారు. 9 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలను రూ.36 వేల కోట్లకు అదానీ కంపెనీతోనే హడావుడిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.23 వేల కోట్ల ప్రజా పెట్టుబడితో అత్యాధునిక సాంకేతికత కలిగిన శ్రీ దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను నిర్వహణ పేరుతో అదానీకే కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. అదానీ కంపెనీలకు ఆస్తులు కట్టబెట్టడంలో జగన్‌మోహన్‌ రెడ్డి స్వప్రయోజనాలు దాగున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే రాష్ట్రంలో దశాబ్దాల తరబడి అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నడుస్తున్న డెయిరీలను త్రోసిరాజని, గుజరాత్‌కు చెందిన అమూల్‌ కంపెనీకి జగన్‌మోహన్‌ రెడ్డి ఘన స్వాగతం పలుకుతూ, ప్రోత్సహించడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇది ఏపీలోని డెయిరీ సంస్థలను ఇబ్బందిపెట్టే కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ప్రజలకు దక్కాల్సిన ఆస్తులు, ఆదాయ వనరులన్నీ అదానీకి అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అమిత్‌షా, అదానీ, జగన్‌ మధ్య ఉన్న రహస్య ఒప్పందాలను బయటపెట్టాలని, రాష్ట్రంలో ఇప్పటివరకు అదానీ కంపెనీలకు ఎన్ని ఆస్తులు కట్టబెట్టారో ప్రజలకు తెలియజేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img