Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

‘ఉమ్మడి’ అభ్యర్థికి వ్యూహం

రాష్ట్రపతి ఎన్నికలపై విపక్ష నేతలతో సోనియా చర్చలు
న్యూదిల్లీ : రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఎం నేత సీతారాం ఏచూరి సహా ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరిపారు. తదుపరి భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నామినేట్‌ చేయాలనే దానిపై ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరపాలని, ఏకాభిప్రాయాన్ని రూపొందించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేను గాంధీ ఆదేశించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ ‘ఎన్డీయేతర, యూపీఏయేతర పార్టీల మనస్సును తెలుసుకోవడానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే బాధ్యత వహిస్తారు. ఆయన ప్రతిపక్ష పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల పేర్లను తెలుసుకుంటారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వారసుడిని ఎన్నుకునేందుకు జులై 18న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. జులై 21న ఫలితాలు వెలువడనున్నాయి. కోవింద్‌ పదవీకాలం జులై 24న ముగుస్తుంది. ‘ఈ ఎన్నికల్లో మొత్తం 4,809 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఏ రాజకీయ పార్టీ తమ సభ్యులకు విప్‌ జారీ చేయదు’ అని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. జూన్‌ 15న నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత జూన్‌ 29 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థి స్వయంగా లేదా అతని ప్రతిపాదకులు లేదా రెండవవారు ఎవరైనా నామినేషన్‌ దాఖలు చేయవచ్చు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఎవరైనా ప్రతిపాదకులుగా 50 మంది ఓటర్లు, రెండవవారుగా మరో 50 మంది ఓటర్లు అవసరమని ఈసీ తెలిపింది. అభ్యర్థి కూడా రూ.15,000 మొత్తాన్ని సెక్యూరిటీగా డిపాజిట్‌ చేయవలసి ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలతో కలిపి 4,809 మంది ఓటర్లు ఉంటారు. వీరిలో 233 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభలతో పాటు అనేక రాష్ట్రాల అసెంబ్లీలలో తన బలాన్ని పరిశీలిస్తే, రాబోయే ఎన్నికల్లో తాను ప్రతిపాదించిన అభ్యర్థిని గెలిపించుకోవడంలో బీజేపీకి కొంత అనుకూలత ఉంది. తమవైపు సంఖ్యాబలం లేకపోయినా, ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సంప్రదింపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img