Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

జైలుకు ఎర్ర గంగిరెడ్డి

జూన్‌ 2 వరకు రిమాండ్‌
సీబీఐ కోర్టులో లొంగుబాటు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో లొంగిపోయాడు. జూన్‌ 2వ తేదీ వరకు న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించింది. దీంతో గంగిరెడ్డిని సీబీఐ అధికారులు చంచల్‌గూడ జైలుకి తరలించారు. వివేక హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసిన సీబీఐ…గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని గత నెలలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏప్రిల్‌ 27న విచారించిన హైకోర్టు… గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది. మే 5వ తేదీలోపు సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఎర్ర గంగిరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ ఎర్ర గంగిరెడ్డి కోర్టులో లొంగనిపక్షంలో ఆయన్ను సీబీఐ అధికారులు వెంటనే అదుపులోకి తీసుకోవాలని సూచించింది. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి సుప్రీంకోర్టు జూన్‌ 30వ తేదీ వరకు గడువు పొడిగించినందువల్ల అప్పటివరకు మాత్రమే గంగిరెడ్డిని రిమాండ్‌కు తరలించాలని, ఆ తర్వాత బెయిల్‌ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. తన న్యాయవాదితో సంప్రదింపులు జరిపిన అనంతరం గంగిరెడ్డి కోర్టు ఇచ్చిన గడువుకు ఆఖరిరోజు తనే స్వయంగా సీబీఐ కోర్టులో లొంగిపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img