Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

తారకరత్న కన్నుమూత

హైదరాబాద్‌ : నందమూరి తారకరత్న (39) కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఇటీవల టీడీపీ నాయకుడు నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర తొలి రోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయనను తొలుత కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్పించారు. విదేశాల నుంచి కూడా వైద్యులను రప్పించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. తారకరత్న మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తారకరత్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. తారకరత్నకు భార్య అలేఖ్య, ఓ కూతురు ఉన్నారు. అలనాటి నటుడు ఎన్టీఆర్‌ కుమారుడు మోహన్‌కృష్ణ తనయుడే తారకరత్న. 1983 ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో ఆయన జన్మించారు. కళాశాలలో చదువుతున్న ఉన్న ఆసక్తితో 2002లో విడుదలైన ‘ఒకటో నెంబర్‌ కుర్రాడు’తో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా విజయం సాధించడంతో తారకరత్నకు వరుస అవకాశాలు వరించాయి. అలా, ఆయన హీరోగానే కాకుండా విలన్‌, సహాయ నటుడిగానూ నటించి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. ‘యువరత్న’, ‘భద్రాద్రి రాముడు’, ‘అమరావతి’, ‘నందీశ్వరుడు’ వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘అమరావతి’ చిత్రానికిగాను ఉత్తమ విలన్‌గా నంది అవార్డును అందుకున్నారు. ఇటీవల ‘9 అవర్స్‌’ వెబ్‌ సిరీస్‌లో ఆయన నటించి ప్రేక్షకులను అలరించారు. రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండే తారకరత్న టీడీపీ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనేవారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img