Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రహసనంగా అవినాశ్‌ విచారణ

22న రావాలని సీబీఐ మళ్లీ నోటీసులు

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పాత్రధారునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి విచారణ ఓ ప్రహసనంగా మారింది. ఆయన విచారణ వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వివేకా హత్య కేసులో సీబీఐ ఆరు సార్లు అవినాశ్‌ను విచారించింది. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగా, తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో హాజరు కాలేనని ఎంపీ తెలియజేశారు. దీంతో ఈనెల 19న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ కోఠి సెంటర్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలంటూ సీబీఐ మరలా నోటీసు జారీ చేసింది. ఆరోజు అదే సమయానికి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. కాని మధ్యలోనే రూటు మారింది. ఆయన కాన్వాయ్‌ జాతీయ రహదారి వైపు మళ్లింది. ఆయన లాయర్లు మాత్రమే సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అవినాశ్‌ రెడ్డి విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని అధికారులకు వివరించారు. ఆయన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారని, అత్యవసరంగా వెళ్లాల్సి ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నారని లిఖితపూర్వకంగా సీబీఐ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img