Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

‘రైతు నిరసనోద్యమం’ ఉధృతం

దేశవ్యాప్తంగా అన్నదాతల ఆందోళనలు
హరియాణాలో బీజేపీ నేతల నిర్బంధం

హిస్సార్‌/న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ సర్కార్‌ తీసుకువచ్చిన మూడు వ్యవసాయ ‘నల్ల’ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఉద్యమం మరింత ఉధృతమయ్యింది. ఉద్యమంలో భాగస్వామ్యమైన రైతు సంఘాలు ఇప్పుడు నిర్ణయాత్మక అడుగులు వేయాలని భావిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వ నిరంకుశ చట్టాలను నిరసిస్తూ హరియాణా రైతు సంఘాలు త్వరలో ఈస్టర్న్‌ ఔటర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే దిగ్బంధనానికి సన్నద్ధమవుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. నవంబర్‌ 7న హరియాణాలో రైతు సంఘాలు ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. హరియాణా రైతు నాయకుడు గుర్నామ్‌ సింగ్‌ చాదుని ఈ సమావేశం గురించి తెలియ జేశారు. ఇప్పుడు పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అలాగే రైతుల నిరసనోద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) నవంబర్‌ 9న సింఘు సరిహద్దులో సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు వ్యూహం రూపొందిస్తామని తెలిపింది. నిరసనలు ప్రారంభమై ఏడాది కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం, పార్లమెంటు సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో నిరసనలు మరింత ఉధృతం కానున్నాయి. కాగా గత ఏడాది నవంబర్‌ 26న రైతుల నిరసన ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఉద్యమం ఏడాది పూర్తి చేసుకోనుంది. పార్లమెంటు సమావేశాలు కూడా నవంబర్‌ 23న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తమ నిరసనను మరింత ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమయ్యారు.
హరియాణాలో బీజేపీ ఎంపీకీ నల్ల జెండాలతో నిరసన
మూడు వ్యవసాయ ‘నల్ల’ చట్టాలను తక్షణమే ఉపసహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు శుక్రవారం హరియాణాలో ఆందోళన చేపట్టారు. హరియాణాలోని హిస్సార్‌ జిల్లాలో ధర్మశాల (సత్రం)ను ప్రారంభించేందుకు నార్నాండ్‌ నగరానికి వచ్చిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్‌ చందర్‌ జంగ్రాను రైతులు నిర్బంధించారు. కేంద్రంలోని బీజేపీ నిరంకుశ విధానాలను నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నల్ల జెండాలను చూపారు. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన ఘర్షణలో ఎంపీ కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఇది తనపై కచ్చితంగా హత్యాయత్నమేనని ఎంపీ ఆరోపించారు. హరియాణాలోని అధికార బీజేపీ, జననాయక్‌ జనతా పార్టీ నాయకుల కార్యక్రమాలను అన్నదాతలు వ్యతిరేకిస్తున్నారు. నల్లజెండాలతో నిరసనకారుల బృందం ఎంపీ కారును అడ్డుకుని నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. రైతులను నిలువరించేందుకు పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసినా రైతులను అదుపు చేయలేకపోయారు. ఇదిలాఉండగా గురువారం రోప్‌ాతక్‌లోని గో ఆశ్రమంలో దీపావళి కార్యక్రమానికి హాజరైన ఎంపీకి రైతుల నుంచి ఇదేవిధమైన నిరసన ఎదురయ్యింది. కార్యక్రమం అనంతరం నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై ఆయన చేసిన వ్యాఖ్యలు హిస్సార్‌లో నిరసనకు దారితీసినట్లు తెలుస్తోంది. వారు ‘పని లేని తాగుబోతులు’ అని, నిరసన చేస్తున్న వారిలో రైతులు ఎవరూ లేరని ఎంపీ వ్యాఖ్యానించారు. ‘వ్యవసాయ చట్టాలకు ఎలాంటి వ్యతిరేకత లేదు. నిరసనలు తెలిపే వారు గ్రామాలకు చెందిన ‘పని లేని తాగుబోతులు’. వారు ఇలాంటి పనులు చేస్తూనే ఉండే దుష్టశక్తులు. ఇటీవల సింఘు సరిహద్దులో కొందరు నిహాంగ్‌లు ఒక అమాయకుడిని చంపడంతో ఈ విషయం స్పష్టమయ్యింది. వారు రైతులు కాదు. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా వారిని వ్యతిరేకిస్తున్నారు. నేను క్రమం తప్పకుండా దిల్లీకి వెళుతూ ఉంటాను. చాలా టెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుంది’ అని ఎంపీ విలేకరులతో వ్యాఖ్యానించిన వీడియో రైతుల ద్వారా బహిర్గతమయ్యింది. రైతులతో కఠినంగా వ్యవహరించాలని, వారిని ఒప్పించాలని, నిరసనలు చేయకుండా ఆపాలని ప్రజలకు ఎంపీ విజ్ఞప్తి కూడా చేశారు. ‘నా కార్యక్రమం ముగిసిన తర్వాత నేను మరొక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా కొంతమంది నా కారుపై లాఠీలు విసిరారు. అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎవరూ గాయపడలేదు. ఈ ఘటనకు సంబంధించి హర్యానా డీజీపీ, ఎస్పీతో మాట్లాడాను. నిందితులపై చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాను. ఇది స్పష్టమైన హత్యాయత్నం’ అని ఎంపీ రామ్‌ చందర్‌ జంగ్రా విలేకరులతో అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img