Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వర్సిటీ వ్యవస్థాపకుడు జైలుకు..రైతు హంతకుడికి బెయిలు

ఇదీ యోగీ సర్కారు నిర్వాకం : అఖిలేశ్‌
రాంపూర్‌(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో పాలక బీజేపీపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు. విశ్వవిద్యాలయం స్థాపించిన ఆజంఖాన్‌ జైలులో ఉంటే…అన్నదాతలను వాహనాలతో తొక్కించిన కేంద్రమంత్రి కుమారుడు బెయిలుపై బయట తిరుగుతున్నాడని అఖిలేశ్‌ వ్యాఖ్యానించారు. ఇదీ కాషాయపార్టీ నవభారతమని హేళన చేశారు. బీజేపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే సంకేతాలు మొదటిదశ పోలింగ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయని అఖిలేశ్‌ అన్నారు. లఖింపూర్‌ ఖేరిలో నలుగురు రైతులను దారుణంగా చంపిన కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా తనయుడు ఆశీష్‌మిశ్రాకు అలహాబాద్‌ హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే. అఖిలేశ్‌ యాదవ్‌ శుక్రవారం ఆజంఖాన్‌, ఇతర ఎస్పీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ నాయకులు 700సార్లు పొర్లు దండాలు పెట్టినా ఆ పార్టీని రైతులు క్షమించబోరని అఖిలేశ్‌ వ్యాఖ్యానించారు. యోగి సర్కారు తప్పుడు కేసులు బనాయించి ఆజంఖాన్‌ తనయుడు అబ్దుల్లా ఆజంను రెండేళ్లు జైలులో నిర్బంధించిందని ఆయన గుర్తుచేశారు. ‘ఆజంఖాన్‌ను సైతం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపింది. ఆశ్చర్యమేమంటే ఆయనపై బనాయించిన కేసు బర్రెల దొంగతనం, చికెన్‌ దొంగతనం, పుస్తకాల దొంగతనం. ఆయనకు ఇంతవరకు బెయిలు రాలేదు. కానీ జీపు టైర్లతో తొక్కించి రైతులను చంపిన మంత్రి తనయుడు మాత్రం జైలు నుంచి బయటికి వస్తాడు. ఇదీ బీజేపీ నవభారతం’ అని యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ ఎద్దేవా చేశారు. ‘మీ కోసం యూనివర్సిటీ స్థాపించిన వ్యక్తి..మీ హక్కులు, గౌరవం కోసం పోరాడిన నాయకుడిని జైలుకు పంపింది ప్రపంచంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా’ అని ప్రజలను ప్రశ్నించారు. ఆజంఖాన్‌ రాంపూర్‌లో జాహర్‌ యూనివర్సిటీని స్థాపించారు. అనేక ఆరోపణలపై ఆయన సీతాపూర్‌ జైలులో ఉన్నారు. రాంపూర్‌ నియోజకవర్గం నుంచి ఆజంఖాన్‌ పోటీ చేస్తుండగా ఆయన కుమారుడు మరోచోట పోటీ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు మార్చి 10వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారని అఖిలేశ్‌ చెప్పారు. మొదటి దశ పోలింగ్‌ ఫలితాలను ప్రజలు నిన్ననే చెప్పేశారన్నారు. రెండోదశలోనూ బీజేపీకి ఇదే గతిపడుతుందని తెలిపారు. యువతకు లాప్‌ట్యాప్‌లు ఇచ్చానని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చెబుతున్నారని, కానీ రాంపూర్‌లో ఒక్కరికీ లాప్‌ట్యాప్‌ అందలేదని ఆయన చెప్పారు. బీజేపీ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. పెద్దనోట్ల సమయంలో అసత్యాలను పుంఖానుపుంఖాలుగా ప్రచారం చేశారని, అవినీతిని అంతం చేయడానికేనని నమ్మబలికారని ఆయన అన్నారు. అవినీతి అంతం కాదుగదా..డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంలో అది రెట్టింపు అయిందని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img