Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

విద్యుత్‌ భారంపై 13న నిరసనలు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం నిర్ణయం
కేంద్రానికి తలొంచిన రాష్ట్ర ప్రభుత్వం
చార్జీలు తగ్గించాల్సిందే : రామకృష్ణ

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విధించిన విద్యుత్‌ సర్దుబాటు చార్జీల భారాన్ని ఉపసంహరించాలని, విద్యుత్‌ సంస్థల ఆర్థికలోటును ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరపాలని సీపీఐ నిర్ణయించింది. ఈ నిరసనలను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పార్టీ శ్రేణులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం గురువారం విజయవాడ దాసరిభవన్‌లో జరిగింది. విద్యుత్‌ ట్రూఅప్‌ చార్జీల పేరుతో అదనపు భారాన్ని ప్రజలపై మోపడాన్ని సమావేశం తీవ్రంగా గర్హించింది. చార్జీల భారాన్ని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ 13వ తేదీన 13 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని

సమావేశం పిలుపునిచ్చింది. ఈ మేరకు తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో వైసీపీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని, ఇంకా తగ్గిస్తామంటూ జగన్‌మోహనరెడ్డి హామీ ఇచ్చారనీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించి, ఇబ్బడిముబ్బడిగా విద్యుత్‌ చార్జీల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని తీర్మానం విమర్శించింది. వైసీపీ అధికారంలోకొచ్చిన 27 నెలల్లో నాలుగు దఫాలుగా రూ.9069 కోట్ల విద్యుత్‌ చార్జీలు పెంచిందని, ట్రూఅప్‌ చార్జీల పేరుతో మరోసారి రూ.3669 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని విమర్శించింది. కేవలం రూ.2,500 కోట్ల అప్పుకు ఆశపడి కేంద్ర ప్రభుత్వం విధించే విషమ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతోందని, రాష్ట్రాలలోని విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం కుట్రపన్నుతోందని తెలిపింది. విద్యుత్‌రంగ సంస్థలను ప్రైవేటు శక్తులకు అప్పగించడమే కాకుండా వారిపై రుణభారం లేకుండా చేయాలని యోచిస్తోందని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థల ఆర్థికలోటును పూడ్చేందుకు సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై గుదిబండ వేస్తోందని, వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు పెడుతోందని వివరించింది. పొరుగు రాష్ట్రాలకన్నా ఏపీలో విద్యుత్‌ రేట్లు అధికంగా ఉండటం వల్ల పారిశ్రామికవేత్తలు వెనుకంజ వేస్తున్నారని, ఫలితంగా ఏపీలో నూతన పరిశ్రమల ఏర్పాటు దూరమయ్యే ప్రమాదం ఉందని తీర్మానం తెలిపింది.
విద్యుత్‌ శాఖకు లోటు వచ్చిందనే పేరుతో 2014`19 మధ్యకాలంలో చెల్లించిన విద్యుత్‌ వినియోగానికి సంబంధించి నేడు యూనిట్‌కు రూ.1.237 పైసలు చొప్పున వడ్డీతో సహా అదనంగా చెల్లించాలనే విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ఆదేశాలను అమలు చేయడం దుర్మార్గమని తీర్మానించింది. ఫలితంగా ఎనిమిది నెలలు అదనపు విద్యుత్‌ భారం రాష్ట్ర ప్రజలందరిపై పడుతోందని తెలిపింది. కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసరాల ధరలు పెంచి పేద, సామాన్య ప్రజల నడ్డివిరిచిందని విమర్శించింది.
కేంద్రం ఆదేశాలకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి, చెత్త పన్నులు, మంచినీరు, డ్రైనేజీ చార్జీలు పెంచడం, ఇప్పుడు విద్యుత్‌ ట్రూఅప్‌ చార్జీల పేరుతో ప్రజలపైభారం మోపడాన్ని రాష్ట్ర కార్యదర్శివర్గ తీవ్రంగా ఖండిరచింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం అప్పులు తెచ్చుకునేందుకు అనుమతుల కోసం కేంద్రం విధించే విషమ షరతులకు లొంగడం సరికాదని, తక్షణమే విద్యుత్‌ సర్దుబాటు చార్జీలు ఉపసంహరించాలని డిమాండు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img