Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

విద్యతోనే జీవన స్థితిగతులు మార్పు

బాపట్లలో విద్యా దీవెన ప్రారంభోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌
రాష్ట్ర వ్యాప్తంగా రూ.694 కోట్లు జమ

విశాలాంధ్ర బాపట్ల : విద్యతోనే జీవన స్థితిగతులు మార్పు వస్తుందనే లక్ష్యంగా రాష్ట్రంలో విధ్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేసి పలు పథకాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. బాపట్లలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో గురువారం జగనన్న విద్యాదీవెన 3వ విడుత నగదు పంపిణీ కార్యక్రమం జరిగింది. తొలుత వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతిప్రజ్వలన చేశారు. ఆన్‌ లైన్‌ ద్వారా బటన్‌ నొక్కి 11.2 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లు నగదును తల్లుల ఖాతాలకు విడుదల చేశారు. బాపట్ల జిల్లాలోని 33 వేల 356 మంది విద్యార్థులకు చెందిన 29 వేల 750 తల్లుల ఖాతాలలోకి రూ.23 కోట్లు విద్యాదీవెన నగదు జమచేశారు. రాఖీ పండుగలో భాగంగా విద్యార్థినీలు, మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ విధ్యార్ధుల తలరాతలు మారి పేదల బతుకులు ఆర్ధికంగా ఎదిగేందుకు విద్యాతోనే సాధ్యపడుతుందన్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్న చదివించేందుకు ఏమాత్రం వెనకాడవద్దని అందరిని నేను చదివిస్తా అని అన్నగా తమ్ముడుగా హామీ ఇస్తున్నానన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ, ముస్లీం మైనార్టీ పేద విధ్యార్ధులు పెద్ద చదువులు చదివేందుకు ప్రభుత్వం ఆర్ధికంగా చేయూత ఇస్తుందన్నారు. రోజురోజుకు సమాజంలో మారుతున్న స్థితిగతులకు అనుగుణంగా విధ్యార్ధుల తల్లిదండ్రుల ఆలోచనలలో మార్పు ఉండాలన్నారు. విద్యను ఎవరూ దొంగలించలేని ఆస్తిగా వర్ణిస్తూ నేటి తరానికి మెరుగైన విద్యాఫలాలు అందిస్తున్నామన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో సులభతరంగా ఉద్యోగాలు పొందడమే లక్ష్యంతో రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో విద్యారంగంలో నూతన ఒరవడి తీసుకువస్తూ జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన అమలు చేస్తున్నామని తెలిపారు. పిల్లలను చదివించడానికి ఇళ్లు, పొలాలు అమ్ముకొని అప్పులు పాలయ్యే పరిస్థితులు మారాలని బృహత్తరమైన పథకాలను ప్రవేశ పెట్టామన్నారు. పేదల ఇంటింటా వెలుగులు నింపాలని నవరత్నాలు అమలు చేస్తున్నామన్నారు. పెద్ద చదువులకు పేదరికం అడ్డురాకూడదని విద్యారంగానికి రూ.వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటి నుంచి కలెక్టర్లు, ఇంజనీర్‌లు, డాక్టర్‌లు రావాలని ఆకాంక్షించారు. ఇందుకోసమే ఉన్నత చదువులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. పిల్లల భవిష్యత్తు కోసం రూ.1778 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్‌ బకాయిలను చెల్లించామన్నారు. బాపట్లలోని అన్నీ కళాశాలలకు రూ.14 కోట్లు చెల్లించామన్నారు. గడిచిన మూడేళ్లలో జగనన్న విద్యా, వసతిదీవెన పధకాలకు రూ.11 వేల 715 కోట్లు వెచ్చించామని ఆయన తెలిపారు. అలాగే మూడేళ్లలో విద్యారంగానికి రూ.53 వేల 333 కోట్లు నిధులు వెచ్చించామన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని మంచి ఆలోచనలతో పధకాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. జి.ఇ.ఆర్‌ రేషియోలో బ్రెజిల్‌, చైనా, రష్యాలతో పోటీ పడుతుందన్నారు. ఏ.పిలో గ్రాడ్యూయేషన్‌ 70శాతం పెంచడానికి కృషిచేస్తున్నామన్నారు. 8.64శాతంగా ఉన్న జి.ఇ.ఆర్‌ రేషియో ప్రస్తుతం 11.03శాతానికి చేరిందన్నారు. ఎస్‌.టిలలోను 9.4 శాతానికి పెరిగిందన్నారు. ప్రాథమిక విద్యలో 84.4శాతం నుంచి 99 శాతానికి రేషియో పెరిగిందన్నారు. ఎటువంటి లంచాలు, వివక్షతకు తావు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాలలోకి నగదు జమచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పేదల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడుగులైనా ముందుకు వేస్తుందని ఆయన చెప్పారు. బాపట్ల జిల్లా నూతన కలెక్టరేటు 50 ఎకరాలలో నిర్మించడానికి పంపిన ప్రతిపాదనను ఆమోదిస్తూ అభివృద్ధికి నాంది పలుకుతున్నామని సీఎం ప్రకటించారు. బాపట్ల పట్టణంలో నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అదనపు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మాణానికి రూ. 18 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. పేరలి కాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణానికి అధికారికంగా మంజూరు చేస్తున్నామన్నారు. బాపట్ల మున్సిపాలిటీలో మౌళిక వసతుల అభివృద్ధి కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, విదేశి విద్యతో విద్యార్థుల జీవితాలు ప్రకాశించబోతున్నాయని చెప్పారు. నేను పేద కుటుంబంలో నుంచి వచ్చానని, నేను చదువుకునే సమయంలో నాతల్లిదండ్రులు ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తుచేశారు. నేటి తరానికి ఇలాంటి పరిస్థితులు రాకూడదని ఉన్నత ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు రూ. వేల కోట్లు వెచ్చిస్తున్నారని చెప్పారు. ఉన్నత విద్యతోనే భవిష్యత్తు ఉన్నత స్థాయికి చేరుకుంటుందనే అంబేద్కర్‌ ఆశయాలను సి.ఎం అనుసరిస్తున్నారని గుర్తుచేశారు. బాపట్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని అభినందనలు తెలిపారు.
ఉపసభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్లను నూతన జిల్లాగా చేయాలనే ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి అమల్లోకి తెచ్చి కలను సాకారం చేశారని తెలిపారు. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే అంశాలుగా ఆయన అభివర్ణించారు. విద్యా కేంద్రంగా పేరుగాంచిన బాపట్లను వైద్య కేంద్రంగాను మార్చేలా రూ.510 కోట్లతో వైద్య కళాశాల, 500 పడకలతో ఆసుపత్రిని మంజూరు చేశారని తెలిపారు. బాపట్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిధులు విడుదల చేస్తున్నారన్నారు. బాపట్లలో రహదారుల నిర్మాణం, మౌళిక వసతుల కల్పన, పర్యాటక ప్రాంతం అభివృద్ధి, సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విన్నవించారు. జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మాట్లాడుఊత నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లా సర్వతోముఖాభివృద్ధికి జిల్లా యంత్రాంగం సమిష్టిగా కృషిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులంతా పనిచేస్తున్నట్లు ఆమె వివరించారు. బాపట్ల జిల్లా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రికి శాలువలు కప్పి పుష్పమాలలతో రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, పార్లమెంట్‌ సభ్యులు నందిగాం సురేష్‌, రాష్ట్ర లెజిస్లేటివ్‌ శాసన మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పోతుల సునీత, గుంటూరు జెడ్‌.పి ఛైర్‌ పర్సన్‌ క్రిస్టియానా, ప్రకాశం జెడ్‌.పి ఛైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీదేవి, సి.ఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌, జిల్లా సంయుక్త కలెక్టరు డా. కె.శ్రీనివాసులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img