Friday, April 26, 2024
Friday, April 26, 2024

అఫ్గాన్‌కు 1.2 బిలియన్‌ డాలర్ల సాయం

జెనీవా సమావేశంలో సభ్యదేశాల ప్రకటన
జెనీవా : అఫ్గాన్‌ ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశంలో సహాయ కార్యక్రమాల కోసం ఐక్యరాజ్యసమితి 606 మిలియన్‌ డాలర్లు అడగ్గా.. అంతకు రెట్టింపు సాయాన్ని అందించాయి. వివిధ దేశాలన్నీ కలిపి 1.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,833 కోట్లు) సహాయాన్ని ప్రకటించాయని ఐరాస అధికారులు వెల్లడిరచారు. అఫ్గాన్‌ పరిస్థితులపై జెనీవాలో సోమవారం ఐరాస నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు ఆర్థిక సహాయం గురించి సభ్య దేశాలు చర్చించాయి. ఈ ఏడాది చివరి వరకు ప్రధాన సహాయక చర్యలు కొనసాగాలంటే.. 606 మిలియన్‌ డాలర్లు అవసరమని సమావేశంలో ఐరాస పేర్కొంది. అయితే, సభ్యదేశాలు ఏకంగా 1.2 బిలియన్‌ డాలర్లు ప్రకటించాయని ఐరాస అత్యవసర సహాయక విభాగం కోఆర్డినేటర్‌ మార్టిన్‌ గ్రిఫిత్స్‌ పేర్కొన్నారు. ఈ నిధులు అఫ్గాన్‌ ప్రజలకు జీవన రేఖగా మారతాయని అన్నారు. అయితే, ఇంతటితో అంతా అయిపోయినట్లు కాదని, అఫ్గాన్‌ కష్టాలు తీరిపోలేదని చెప్పారు.
తాలిబన్లతో చర్చించాల్సిందే : ఐరాస చీఫ్‌
జెనీవాలో జరిగిన సమావేశం అంచనాలకు మించి ఫలితాలను రాబట్టిందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ పేర్కొన్నారు. మరోవైపు, తాలిబన్లతో సంప్రదింపులు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘ఐరాస చేసిన అత్యవసర విజ్ఞప్తికి స్పందనగా సభ్య దేశాలు వంద కోట్ల డాలర్లకు పైగా సహాయాన్ని ప్రకటించాయి. అఫ్గాన్‌ ప్రజలపై అంతర్జాతీయ సమాజానికి ఉన్న నిబద్ధతను ఇది సూచిస్తోంది. అఫ్గాన్‌లో సహాయ కార్యక్రమాలను కొనసాగించాలంటే.. ఆ దేశంలోని వాస్తవ అధికార యంత్రాంగంతో సంప్రదింపులు చేయక తప్పదు. ఉగ్రవాదమైనా, మానవహక్కులైనా, మాదకద్రవ్యాలైనా.. అంతర్జాతీయ సమాజానికి ఉన్న అన్ని ఆందోళనల విషయంలో తాలిబన్లతో సంప్రదింపులు కొనసాగించాలి’ అని గుటెర్రస్‌ పేర్కొన్నారు. కాగా అఫ్గాన్‌లో తాలిబన్ల ఆక్రమణ తర్వాత తలెత్తిన పరిస్థితులపై గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఐరాస అక్కడ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img