Friday, April 26, 2024
Friday, April 26, 2024

చిక్కుల్లో నేపాల్‌ సర్కార్‌

. ఓలీ పార్టీ మద్దతు వెనక్కి
. అధ్యక్ష ఎన్నికతో వైరుధ్యాలు
. నేపాలీ కాంగ్రెస్‌ నేతకు ప్రచండ అండ
. వ్యతిరేకించిన సీపీఎన్‌` యూఎంఎల్‌

ఖాట్మండు: నేపాల్‌ రాజకీయాలు మరోసారి సంక్షోభంలో పడ్డాయి. పుష్ప కమాల్‌ దహల్‌(ప్రచండ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నాయకత్వంలోని సీపీఎన్‌యూఎంఎల్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవాలని సోమవారం నిర్ణయం తీసుకుంది. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో మద్దతు వెనక్కి తీసుకుంటున్నట్లు సీపీఎన్‌యూఎంఎల్‌ పార్టీ చెప్పింది. నేపాల్‌ అధ్యక్ష పదవికి నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రామ్‌చంద్ర పాడెల్‌కు మద్దతివ్వాలని మావోయిస్టు నేత నిర్ణయం తీసుకున్న కారణంగా ప్రచండ, ఓలి మధ్య చెలిమి చెలిమి చెడిరది. పాడెల్‌ ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌ నాయకుడు. పాలక సంకీర్ణానికి బయటి నుంచి మద్దతిస్తున్నారు. నేపాల్‌ అధ్యక్ష ఎన్నిక మార్చి 9వ తేదీన జరగనున్నది. సుదీర్ఘ రాజకీయ సంక్షోభం తర్వాత రెండు నెలల క్రితం ఆయా పార్టీల మద్దతుతో ప్రచండ ప్రభుత్వం ఏర్పడిరది. పార్టీ అగ్రనాయకులు సోమవారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రచండ ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకుంటున్నట్లు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌(యూనిఫైడ్‌ మార్క్సిస్టులెనినిస్టు) (సీపీఎన్‌యూఎంఎల్‌) లాంఛనంగా ప్రకటించినట్లు ది ఖాట్మండు పోస్టు వార్తాపత్రిక తెలిపింది. నేపాల్‌ ప్రధాని భిన్న ఆకాంక్షలతో పనిచేయడం, నేపాల్‌ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రాజకీయ సమీకరణలు మారిన కారణంగా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు యూఎంఎల్‌ ఉపాధ్యక్షుడు విష్ణుప్రసాద్‌ పాడెల్‌ చెప్పారు. నేపాలీ కాంగ్రెస్‌ పార్టీకి పార్లమెంటులో 89 మంది ఎంపీలు ఉన్నందున సీపీఎన్‌`యూఎంఎల్‌ వెనక్కి తగ్గినా ప్రచండ ప్రభుత్వానికి తక్షణమే వచ్చిన ప్రమాదమేమీ ఉండకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. 275 మంది సభ్యులు గల పార్లమెంటులో యూఎంఎల్‌కు 79 మంది సభ్యుల బలం ఉంది. అలాగే, సీపీఎన్‌(మావోయిస్టు సెంటర్‌) పార్టీకి 32 మంది, సీపీఐ(యూనిఫైడ్‌ సోషలిస్టు) పార్టీకి 10, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి 20 మంది సభ్యుల బలం ఉంది. జనతా పార్టీకి ఆరుగురు, లోక్‌తాంత్రిక సమాజ్‌వాదీ పార్టీకి నలుగురు, నగరిక్‌ ఉన్ముక్తి పార్టీకి ముగ్గురు సభ్యులున్నారు. ప్రధానిగా తన పదవీ కాలం పూర్తి చేసుకోవడానికి ప్రచండకు 138 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రభుత్వం నుంచి వైదొలగాలని యూఎంఎల్‌ మంత్రులపై ప్రధాని ప్రచండ ఒత్తిడి వ్యూహాలు ప్రయోగిస్తున్నారని, మద్దతు ఉపసంహరణకు బలవంతం చేస్తున్నట్లు పాడెల్‌ ఆరోపించారు. ప్రభుత్వం నుంచి తక్షణమే వైదొలగకపోతే యూఎంఎల్‌ మంత్రులను రద్దు చేస్తానని ప్రచండ హెచ్చరించినట్లు తెలిపారు. విదేశాంగ మంత్రి విమల్‌ రాయ్‌ పాడ్యాల్‌ జెనీవా పర్యటనను చివరి నిమిషంలో నిలువరించడం ద్వారా ప్రధాని ప్రచండ తన అపరిపక్వతను చాటుకున్నారని మండిపడ్డారు. జెనీవాలో జరిగే ఐరాస మానవహక్కుల మండలి సమావేశంలో పాల్గొనేందుకు యూఎంఎల్‌ మంత్రి పాడ్యాల్‌ వెళ్లాల్సి ఉందని, కానీ ఆమె పర్యటనను ప్రచండ రద్దు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటన కూడా రెండు పార్టీల మధ్య వివాదానికి తెరలేపింది. డిసెంబరు 25 ఒప్పందాన్ని ప్రచండ ఉల్లంఘించడం, ప్రభుత్వం నుంచి బయటికి వెళ్లాలని ఒత్తిడి చేసిన కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాడెల్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img