Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఇరాన్‌లో ఘాతుకం… విద్యార్థినులపై విష ప్రయోగం

టెహ్రాన్‌: ఇరాన్‌లో పరిస్థితులు రోజుకు రోజుకు భయాందోళనలు కలిగిస్తున్నాయి ఇప్పటికే ఆ దేశంలో మహిళలపై జరుగుతున్న హింసకాండ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలోనే మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఖోమ్‌ నగరంలోని ఓ స్కూల్లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం జరిగిందన్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. బాలికలను విద్య నుండి దూరం చేయాలని, వారి విద్యను ఆపేయాలన్న ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా సమాచారం. విద్యార్థినులపై విష ప్రయోగం జరిగిన వెంటనే కొంతమంది అన్ని స్కూల్స్‌ మూసేయాలని, గర్ల్స్‌ స్కూల్స్‌ ని మూసివేయాలని కోరినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా ఈ ఘటనకు సంబంధించి కారణాలను తెలుసుకోవడానికి విద్యా మంత్రిత్వ శాఖ, ఇంటిలిజెన్స్‌శాఖ ప్రయత్నిస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదోరి జహ్రోమి ప్రకటించారు. కాగా ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లుగా డిప్యూటీ హెల్త్‌ మినిస్టర్‌ యూనిస్‌ పన్హి తెలిపారు. ‘ఖోమ్‌ పాఠశాలలో చాలా మంది బాలికలపై విషప్రయోగం తర్వాత కొందరు కుట్రపూరితంగానే ఇలా చేస్తున్నట్టు గుర్తించాం… విద్యా సంస్థలను ముఖ్యంగా ఆడ పిల్లలు చదివే పాఠశాలను మూసేయాలనే దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు’ అని మంత్రి చెప్పినట్టు ఇరాన్‌ అధికారిక మీడియా ఐఆర్‌ఎన్‌ఏ పేర్కొంది. అయితే దీనిపై ఆయన పూర్తి వివరాలను వెల్లడిరచలేదు. ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎటువంటి అరెస్ట్‌లు జరగలేదని తెలుస్తోంది. కాగా విషప్రయోగం కారణంగా అస్వస్థతకు గురైన బాలికల తల్లిదండ్రులు ఫిబ్రవరి 14న ఖోమ్‌ నగర గవర్నర్‌ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపై తీవ్ర నిరసన తెలిపారు. అధికారులు తమకు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో విషప్రయోగానికి కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని, నిఘా, విద్యా శాఖ మంత్రులు అదే ప్రయత్నంలో ఉన్నారని ఆ మర్నాడు ఇరాన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి అలీ బహదోరీ జహ్రోమీ ఓ ప్రకటన చేశారు. కాగా ఈ ఘటనలపై న్యాయవిచారణకు ఆదేశిస్తూ గతవారం ప్రాసిక్యూటర్‌ జనరల్‌ మహమ్మద్‌ జాఫర్‌ మోంతాజెరీ ఉత్తర్వులు జారీచేశారు. దేశంలోని కఠినమైన దుస్తుల నియమావళిని ఉల్లంఘించిందనే ఆరోపణలతో అరెస్టయిన 22 ఏళ్ల కుర్దిష్‌ మహిళ మహ్సి అమిని గతేడాది పోలీస్‌ కస్టడీలో చనిపోయినప్పటి నుంచి ఇరాన్‌ నిరసనలతో అట్టుడికింది ఈ క్రమంలో తాజాగా విషప్రయోగాలు బయటపడటం కలకలం రేగుతోంది. రెండు నెలలకుపైగా కొనసాగిన హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్‌ ప్రభుత్వం వివాదాస్పద మోరాలిటీ (నైతిక) పోలీస్‌ విభాగాన్ని రద్దు చేసింది. అమీని మృతిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా, ఇరాన్‌ మహిళలకు అంతర్జాతీయ సమాజం మద్దతుగా నిలిచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img