Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

స్థూల ఆర్థిక విధానాలకు చైనా ప్రధాని పిలుపు

బీజింగ్‌ : ఆర్థిక కార్యకలాపాలను సాఫీగా కొనసాగించేందుకు మార్కెట్‌ సంస్థలపై దృష్టి సారించే సమర్థవంతమైన స్థూల విధానాలను చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ నొక్కిచెప్పారు. గురువారం లీ అధ్యక్షతన ఆర్థిక పరిస్థితిపై జరిగిన సింపోజియంకు ఆర్థిక వేత్తలు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. కొవిడ్‌`19, వరదలు, వేగంగా పెరుగుతున్న వస్తువుల ధరలు, విద్యుత్‌, బొగ్గు సరఫరాతో చైనా సంవత్సరం ప్రారంభం నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ చైనా ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద స్థిరమైన రికవరీని చూసింది. ఉద్యోగాలను పెంచడంతో పాటు ఈ సంవత్సరం ప్రధాన లక్ష్యాలను సాధించగలమని లీ విశ్వాసం వెలిబుచ్చారు. హాజరైన ఆర్థిక వేత్తలు, పారిశ్రామిక వేత్తలు మాట్లాడుతూ ఎగుమతులను స్థిరీకరించడం, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధిని ప్రోత్సహించడం, పెరుగుతున్న ముడి సరుకు ఖర్చుల ఒత్తిడిని తగ్గించడంతోపాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి చర్యలపై సూచనలు అందించారు. ఆవిష్కరణలు, నవీకరణలకు మద్దతునిస్తూ ఉత్పాదక సంస్థలు, స్వయం ఉపాధి పొందే వారి సమస్యలను పరిష్కరించడానికి మరింత పన్ను, రుసుము తగ్గింపునకు లీ పిలుపునిచ్చారు. మార్కెట్‌ సంస్థల శక్తిని పెంచడం ద్వారా ఇబ్బందులు, ఒత్తిళ్లను తట్టుకునే ప్రయత్నాల మధ్య సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం అవసరమని లీ పేర్కొన్నారు. సరిహద్దు ఇ-కామర్స్‌, ఓవర్సీస్‌ వేర్‌హౌస్‌ల వంటి కొత్త రకాల విదేశీ వాణిజ్యానికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలను చైనా మెరుగుపరుస్తుంది. దిగుమతులు, ఎగుమతులకు మద్దతు ఇచ్చే విధానాలను కూడా చైనా ప్రోత్సహిస్తుందని ప్రధాని లీ హామీ ఇచ్చారు. పర్యావరణాన్ని నిరంతరం మెరుగుపరచేందుకు కృషి చేయాలని చైనా ఉప ప్రధాని హాన్‌జెంగ్‌ పిలుపునిచ్చారు. చైనా రాజధాని బీజింగ్‌లో పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాల పరిశీలనపై జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్న పర్యావరణ సమస్యలపై దృష్టి సారించడానికి ప్రయత్నాలు చేయాలన్నారు. క్రమబద్దమైన ప్రణాళిక ద్వారా పర్యావరణ సమస్యలు పరిష్కరించడంతో అధిక నాణ్యతాభివృద్దిని సాధించవచ్చునని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img