Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

జన్యు పరిశోధనల మథనంలో జనించినవైవిధ్య ఆలోచనల వికాసం

జ్ఞాన చర్చలకు కిటికీలు మూసేసుకుని, విశ్వాసాల, చాదస్తాల పరిమిత ఆలోచనాస్థితిలో ఉండేవారు. చదవక్కరలేని గ్రంథమిది. చదువ వేస్తే ఉన్న మతి పోయినట్లు కాదిక్కడ. దీనిని చదివిస్తే ఉన్న మతి పోయి సత్యదృష్టితో వెలిగే కొత్త మతి వస్తుంది. జన్యు పరిశోధకులు విభ్రాంతి గొలిపే శాస్త్రీయ సత్యాలు, పరిణామ రహస్యాలు ఎన్నో చెప్పారు. వాటికి విశేష దీపికగా ఉండడమే కాకుండావర్తమాన జాతీయ ఆలోచనా స్రవంతిలో రావలసిన మార్పుల్నీ రచయిత కల్లూరి భాస్కరం తనదైన అంచనాలు, బేరీజులతో వెల్లడిస్తారు ఈ గ్రంథంలో. మత, వాఙ్మయ, భాషా, సాంస్కృతిక సాక్ష్యాల్ని తర్జన భర్జన చేశారు. నాలుగు భాగాలుగా 353 పుటల్లో అధ్యయనాలూ, చర్చలూ సాగాయి. అధ్యయనశీలి అయిన ఈ రచయిత గ్రంథానికి మరొక అధ్యయనశీలి వాడ్రేవు చినవీరభద్రుడు ‘సాహసం, కానీ ఎంతో అవసరం’ శీర్షికతో రాసిన పీఠికలో పుస్తకజ్ఞాన శ్రామికుణ్ణి ఆవిష్కరించడమే కాక తన ఆలోచనలనూ ముఖ్యంగా గ్లోబలైజేషన్‌, వలసలు, పెట్టుబడిదారుల మార్పులు చెప్పారు. పాతతరం జాతీయవాదం వలస పాలకుణ్ణి శత్రువుగా చూపితే కొత్తతరం కొత్త జాతీయవాదం తన దేశవాసులకి దేశ వాసుల్నే శత్రువులుగా చూపిస్తుంది. ‘‘దేశీయ సంఘటనలు చూస్తే ఇది నిజమనిపిస్తుంది. ప్రాచీన కాలంలో భారతదేశమే గొప్పదని, అన్ని శాస్త్రాలూ ఇక్కడే పుట్టాయని, ఈ రహస్యాలన్నీ విదేశీయులు పట్టుకుపోయి తామే కనిపెట్టామనీ చెప్పుకునే ‘కృత్రిమ జాతీయతని గురించి భద్రుడు బాగా చెప్పారు. ఛాందస జాతీయవాదులు దేశాలు, సమూహాలకి చివరికి మనుషులకీ మనుషులకీ మధ్య గోడలు కడుతున్నారు. మామూలుగా కాదు మెరుపు వేగంతోఅంటారు. ఈ మెరుపు వేగం అనడంలోని తీవ్రత మనల్ని ఆలోచనా బాధాతప్తుల్ని చేస్తుంది. భాస్కరం ఈ అధ్యయనంలో ఎన్నో హైపోథీసులు మనముందుంచడమే కాక, మన సంస్కృతి, చరిత్రలకు సంబంధించిన ఎన్నో చిక్కుముళ్లు విడిపోవడానికి అవసరమైన తాళం చెవులు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారన్నారు. అనేక అంశాల సమాహారమైన క్రమశిక్షణాయుతమైన ఈ అధ్యయన పేటికకు తాళం తీయడం ఈ గ్రంథ పఠనం. జన్యు చరిత్ర లక్షల సంవత్సరాలకు చెందినదైనా, దాని సశాస్త్రీయ అధ్యయనాలు ఆంగ్లంలో 20 వ శతాబ్దంలో ప్రారంభమై తదుపరి విస్తరించాయి. అయితే తెలుగులో ఒక పెద్ద ‘డిసిప్లనరీ గ్రంథం’గా వచ్చిన తొలిపొత్తంగా ‘ఇవీ మనమూలాలు’ వచ్చింది. డి.ఎన్‌.ఎ. మొదటిసారి సూక్ష్మదర్శికి చిక్కిన 1948 సంవత్సరం జన్యు పరిశోధనా చారిత్రకసంవత్సరం అప్పటినుండి వర్తమానం వరకు గల ప్రధాన గ్రంథాల విశేష సారాంశాలు నాట బతికింది ఈ గ్రంథం. పాన్‌ నుండి మనిషి వరకు గల మిస్సింగ్‌లింక్స్‌ని భాసమానం చేశారు. జన్యు రహస్యాలను ఛేదించడంలో రష్యాలో డెనిస్‌ గుహలో తవ్వకాల్లో ప్రాచీన మానవుని చిటికెన వేలు ముక్క దొరకడం సంతరించుకున్న ప్రాధాన్యత వంటి అపురూప సంఘటనలు ఎన్నో తెలిపారు. లక్షల సంవత్సరాల్లో అతి ప్రాచీన మానవ పారంపర్యాల కాలక్రమం ఆశ్చర్యకరంగా ఉంది. మహా భారతంలో వర్ణ సాంకర్య అంశాలు గ్రంథం చివరిదాకా ఎలా ఉన్నాయో తెలిపారు. ప్రత్యేక ‘జాతి’ భావన శాస్త్ర విరుద్ధ భావనగా సమర్థిస్తారు. 24 వేల సంవత్సరాల కిందట సైబీరియాలో మాల్టా అనేచోట దొరికిన ఒక బాలుని ఎముకలు జన్యు నూతన సమాచారానికి ఎలా దోహదం చేసిందో ఆసక్తికరంగా చెప్పారు. ‘‘బాటలు నడచీ పేటలు కడచీ/ కోటలన్నిటిని దాటండి/ నదీ నదాలు/ అడవులు కొండలు/ ఎడారులా మన కడ్డంకి’’ అనే శ్రీశ్రీ వాక్యాల ఉద్దేశాలు వేరైనా వలసలకి, బతుకు తెరువులకూ వర్తి స్తున్నాయి. రచయిత కవి, సాహిత్యవేత్త కావడం శాస్త్రీయరచనల సందర్భాల్లో కూడ సాహిత్య రచనల పోహళింపులు పరి మళించాయి. వివిధ గ్రంథాల జ్ఞానాంశాల క్రోడీకరణతో బాటు కల్లూరి భాస్కరం తన ఆలోచనాప్రేరిత స్వీయభావాలు, అంచనాలు, కొన్ని పట్టుల్లో సత్య తీవ్రవాద వాక్యాన్నీ ఇందులో గమనిస్తాం. జనాభా పెరుగుదలకు ఆహార లభ్యతకు ఉన్న సంబంధాన్ని థామస్‌ రాబర్ట్‌ మాల్తస్‌ శాస్త్రవేత్త చెప్పడానికి భారతంలో భూదేవి బ్రహ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకోడానికి వ్యవసాయ విప్లవానికి సంబంధింతాంశాలను విశ్లేషించడంలో కల్లూరి వారు చెప్పేవి చూస్తేఆంగ్లంలో కూడా ఈయన గ్రంథ రచన చేయగలిగితే ఎంత బావుండేది అనిపించింది జ్ఞానవ్యాప్తి అభిమానిగా. ప్రాచీన ఘటనలు కథలుగా ఎలా మారుతాయి? అనే శీర్షికన చాలా ఆశ్చర్యకర అంశాలు పఠనాసక్తిని పెంచేలా ఉన్నాయి. ఆయుధాలు, రథాలు, రాతిగదలు వీని మూల విశేషాలు తెలుపుతూ పశ్చిమాసియా ధనుర్బాణాలతో రథ యుద్ధాలకు తొలి వేదిక అయిన వైనాన్ని చెప్పారు. ఈ గ్రంథం పాఠకుణ్ణి విహంగావలోకనంగా విశ్వ మానవ మూలాల దర్శనం చేయిస్తూ మధ్యమధ్యలో భారతదేశ దర్శనంలో భాగంగా మూల జన్యు చర్చ సాగిస్తారు. తప్పనిసరి వలసలు, స్వచ్ఛంద వలసలు వంటి విషయాలు చెబుతూ ‘‘ఒకప్పుడు దేశంలోకి శరణార్థులుగా వచ్చిన వారిని ఆయా దేశాలు మానవతా పూర్వకంగా ఆదరించేవని’’ కాగా ఇప్పుడు కొత్త జాతీయవాదాలు అటువంటి శరణార్థుల్ని జాతీయ విపత్తుగా పరిగణిస్తున్నాయి అన్నారు. అయితే ఈ విషయంలో అనేక రాజకీయ ఆర్థిక అంశాలు కూడా వర్తమాన సమాజ ధోరణిలో ఉండడం విస్మరించలేం. మయన్మారు సమస్యని ఆలోచిస్తే ఈ ఆలోచనలు రాకమానవు. సాంకర్యమే నిజం, స్వచ్ఛత అబద్ధం అన్న శీర్షికలోని విషయాలు ఇంకా విస్తరించి చెప్పవలసిన అవసరం ఉందనిపించింది. ఎప్పటి పరిశోధనలనేగాక ఇటీవల పరిశోధనల్నీ భాస్కరం తాజాగా పరిశీలించారనడానికి 168 వ పుట దరిమిలా పుటలు సాక్ష్యాలు పలుకుతాయి. తొమ్మిదేళ్ల క్రితం 2015 లో కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయంలో మాట్లాడిన పరిశోధక పండితుడు మహదేవన్‌ వాక్యాల ఉద్ఘాటన అసామాన్యం. హరస్పా లిపిని పూర్తిగా ఛేదించానని తాను చెప్పలేకపోయినా అది ద్రావిడ భాషారూపమని, వారు వేదకాల ఆర్యులు కారని, ఋగ్వేదంలో కనిపించని పులి హరప్పా సీళ్లమీద ఉందని ఆయన చెప్పింది ఈయన చెప్పారు. గేదె కొమ్ములు కలిగిన పురుష దేవుడు, అమ్మవార్లు, రావిచెట్టూ,సర్పం వంటి చిహ్నాలు ఆర్య చిహ్నాలు కావు. ఆర్యుల పూర్వం నుంచీ భారతదేశంలో మత సాంస్కృతిక సంప్రదాయాలలో ఉన్నాయనీ ఇటువంటివి ఇస్తూ వాటికి విభిన్న ఆలోచనా పార్శ్యాలూ ఉటంకించారు. వీటిని జన్యు సంబంధా లకు అనుసంధానపరిచారు. దేశీయ రచయిత రాంభట్ల వారి ఆలోచనలనీ తెలిపారు.
శాస్త్రీయ అంశాలను సాహిత్యపరంగా ఆసక్తికరంగా కథను చేయడం కల్లూరివారికి నల్లేరుపై బండి నడక. 229 పుటని చూస్తే ఇది అర్థమవుతుంది. ఇండోయూరోపియన్‌ వలస విధానం సామాన్య పాఠకుడికి అడవి కథను చెబుతారు. విమానంలో ఎన్ని దేశాలో తిరిగి, తిరిగి భారతదేశంలో లేండయినట్లుంది ఈ గ్రంథరచన. ధర్మరాజు భీష్మకర్ణాదులను వధించినందుకు అంత్యక్రియల సందర్భంలో శోకిస్తుంటే కృష్ణుడు ఊరడిస్తూ చేసిన హితబోధను తిక్కన ఒక్క పద్యంలో ఇచ్చారని భావం ఇచ్చారు. పద్యం కూడా ఇచ్చి ఉండవలసింది. ఆ పద్యంలోనే ప్రోటోఇండో యూరోపియన్‌ భాషాజనాల సామాజిక, మత, ఆర్థిక, రాజకీయ జీవన విధానం చాలా వరకు అద్భుతంగా ఇమిడిపోయి కన్పిస్తుందనే నూతన కోణాన్ని శక్తిమంతంగా తెలిపారు. ఆర్యావర్త పరిశోధనలు, ద్రావిడ ప్రాంత భాషా శబ్ద సాంస్కృతిక పరిశోధనలు ఇప్పటికి వచ్చినవన్నీ రచయిత మధించారనిపిస్తుంది.
భారత చక్రం తిప్పుతున్న ఆర్యావర్తం అనేది గ్రంథంలోని శేష విశేష శీర్షిక. ఇందులో భాస్కర భాస్వరాలు ప్రతిభా స్వరాలుగా నినదిస్తాయి. ఇందులో మౌలికంగా మానవ మనస్తత్వ చిత్రీకరణలు, సంప్రదాయ వర్తమాన వైరుధ్యాల మూలాలు తెలిపారు. 348 నుండి 353 వరకూ ఉన్న పుటల్లో ఆర్యావర్త తాత్త్వికగుణాలు, ఆధిపత్య ధోరణుల పరోక్ష ప్రత్యక్ష విమర్శలు. అన్నీ ఉండి రచయిత ఆవేదనలు, ఆకాంక్షలు భవిష్య పరోక్ష సూచనలు అద్భుతంగా ఆవిష్కరించారు. ఆర్యావర్తఅనార్యవర్తాల పెనుగులాటలు ఒక తార్కాకాంతానికి చేరుకునే వరకూ భరత చక్రభమణం ఆగదు. (ఇప్పటికీ ఉన్న ఆర్య సంస్కృతీ చక్రభమణం) ఆర్యావర్తం ఎంత చిన్న ధిక్కారమైనా, ఎంత చిన్న సవాలునైనా సహించే స్థితిలో లేదు. చిన్నవేనని చెప్పి, గోవా, మణిపూర్‌, పుదుచ్ఛేరిలని కూడా ఉపేక్షించే ప్రశ్నే లేదు. తన వేల సంవత్సరాల భావజాలం దన్నుతో, తన వంద సంవత్సరాల ప్రణాళిక దన్నుతో అంతులేని అర్థబలం, అంగబలం దన్నుతో ఇటు దక్షిణభారతంలోనూ అటు ఈశాన్య భారతంలోనూ తనకు చేతికి చిక్కకుండా మిగిలిన కోటలను పట్టుకోవడానికి సమధికోత్సాహంతో సమరపథంలో సాగుతోంది...! ‘ఇవీ మన మూలాలు’ లో రచయిత వర్తమాన ప్రగతిశీల ఆలోచనాసరళి, ఆధిపత్య భావజాల వ్యతిరేకత రాజకీయ అవగాహన ఈ వాక్యాలలో ఇమిడి ఉంది. ‘ఇవీ మన మూలాలు’ అని తెలుసుకుంటే ఎన్నో విశ్వజనీన ప్రేమ మూలాలు తెలిసి ఒక ఆరోగ్య జీవనాన్ని కోరుకుంటాం. జన్యు మూలాల వలసలే మానవ జీవితాలేమో జన్యు సంబంధ చరిత్ర గ్రంథం. అనేక కోణాల జ్ఞానకోశం. తర్జన భర్జనలను స్వాగతించే ఈ రచయిత అంకిత కృషికి కృతజ్ఞతలు తెలుపవలసిన అవసరం ఉంది. సన్నిధానం నరసింహశర్మ
సెల్‌: 9292055531

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img