Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

వాజపేయిలో భిన్న కోణం

ఆత్మ కథలు రాసుకునే వారి మీద స్వోత్కర్షలకు పోయారు అన్న నింద సర్వ సాధారణం. మరెవరి జీవిత కథనో రాస్తే అందులో తప్పులు, అపవాదులు, సత్యదూరమైన అంశాలు, బురద చల్లే ప్రయత్నం, లేదా సంపూర్ణంగా కీర్తిగానం చేసే తాపత్రయమే ఎక్కువ అన్న విమర్శ ఎదుర్కోవలసి వస్తుంది. జీవిత చరిత్రలు రాసే వారి పని కత్తి మీద సామే. జీవిత చరిత్రలు రాసే వారిలో చాలా మంది తాము ఎవరి జీవిత చరిత్ర అయితే రాస్తున్నారో వారితో కనీస పరిచయం కూడా ఉండకపోవచ్చు. తాము జీవిత చరిత్ర రాస్తున్న వ్యక్తికి సన్నిహితులు, కొన్ని సార్లు ప్రత్యర్థులు, ఆ వ్యక్తి గురించి లిఖిత రూపంలో ఉన్న సమాచారం, దృశ్య శ్రవణ మాధ్యమాల్లో నిక్షిప్తమైన వివరాలు, ఆ వ్యక్తి ప్రజా జీవన రంగంలో ఉన్న వారైతే వారి కార్యకలాపాలకు సంబంధించి అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు – ఇలా బోలెడు సమాచారం సేకరించవలసి వస్తుంది. అయినా జీవిత చరిత్ర రాసిన వారి మీద దుమ్మెత్తిపోయరు అన్న హామీ ఏమీ ఉండదు. కానీ జీవిత చరిత్ర రాసే వ్యక్తి ఎంత లోతుగా పరిశోధించారు, వాస్తవాలను వక్రీకరించకుండా ఏ మేరకు జాగ్రత్తపడ్డారు అన్న అంశాలే ఆ రచనకు గీటు రాళ్లుగా నిలుస్తాయి.
వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వారి వారి సొంతం అని ఎంత అనుకున్నా ప్రజా జీవిత రంగంలో ఉన్న వారి ప్రైవేటు జీవితం గురించి జనానికి అమితాసక్తి ఉంటుంది. ప్రజా జీవన రంగంలో ఉన్న వారి ప్రైవేటు జీవితాలు బయటికి కనిపించే వారి వ్యక్తిత్వానికి భిన్నంగా ఉండొచ్చు. ఆ భిన్నత్వంలో మంచి ఉండొచ్చు, చెడూ ఉండొచ్చు. ఈ మంచి, చెడులు ఆ విషయాలను వింగడిరచే వారు అభిమానించే, అనుసరించే నైతికత మీద ఆధారపడి ఉంటాయి. బీజేపీ నాయకుడు, మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజపేయికి భారత రాజకీయాల్లో ప్రముఖమైన పాత్రే ఉంది. కాంగ్రెసేతర రాజకీయ నాయకులో ప్రథమ గణ్యులు. మంచికో చెడుకో కొంత మందికి మరణానంతరం ఎక్కువమంది అభిమానులు సమకూరుతారు. బీజేపీ నాయకులలో వాజపేయి సౌమ్యుడు, మర్యాదస్థుడు, కవిత్వం రాయడం లాంటి కళానిభివేశం ఉందని అభిమానించే వారి సంఖ్యా ఎక్కువే.
వాజపేయిలో కనిపించే ఔదార్యం లేదా ఉదారవాద వైఖరి సంఫ్‌ు పరివార్‌ కప్పిన ముసుగు అని ఆ పరివార్‌ లో చాలా కాలం కీలక పాత్ర పోషించిన గోవిందాచార్యే అన్నారు. దశాబ్దాల తరబడి వాజపేయి సహచరుడిగా ఉంటూ బీజేపీ ఎదుగుదలకు ఎక్కువ దోహదం చేసిన లాల్‌ కృష్ణ అడ్వానీ కన్నా వాజపేయి ఉదారుడిగా కనిపించే వారు. వాజపేయి వక్తృత్వ పటిమ కూడా ఆయనకు అభిమానులు పెరగడానికి కారణం అయి ఉండొచ్చు. జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న వాజపేయి మన విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చిన దాఖలాలు లేవు. విదేశాంగ విధానంపై మొన్నమొన్నటిదాకా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయమే ఉంది. నెహ్రూ కాలం నుంచి అనుసరిస్తున్న విదేశాంగ విధానం ప్రధానంగా జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడమే దీనికి కారణం కావచ్చు.
వాజపేయి మూడు దఫాలు ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఆరు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం ఆయన ముందు జనసంఫ్‌ు, ఆ తరవాత పేరు మారిన భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘ కాలం నాయకత్వ స్థానంలోనే ఉన్నారు. బాబ్రీ వివాదానికి ముందు దాకా బీజేపీ-వాజపేయి సమానార్థకాలుగా ఉండేవి.
అయినా వాజపేయి జీవిత చరిత్రలు తక్కువే వెలువడ్డాయి. ఇటీవల అభిషేక్‌ చౌదరి ‘‘వాజపేయి:ది అసెంట్‌ ఆఫ్‌ ది హిందూ రైట్‌’’ అని వాజపేయి జీవిత చరిత్ర వెలువరించారు. ఇది మొదటి భాగమే. రెండో భాగం మరో ఆరు నెలల్లోగా రావొచ్చు. ఈ గ్రంథంలో వాజపేయి రాజకీయ జీవితాన్ని, సొంత జీవితాన్ని నిజాయితీగా చిత్రించడానికి అపారమైన పరిశోధన చేయాల్సి వచ్చిందని అభిషేక్‌ చౌదరి అంటారు. వాజపేయి పాలనా కాలంలో కనిపించిన సంయమం, మర్యాదకర నడివడిక, వ్యక్తిగా వాజపేయిలో కనిపించే సంస్కారం చూసిన వారు ప్రస్తుతం మోదీ సర్కారు అనుసరిస్తున్న మొరటుదనం, విద్వేష రాజకీయం, ప్రత్యర్థుల పొడగిట్టని అసహిష్ణుత, కరడు గట్టిన ముస్లిం వ్యతిరేకత చూస్తూ వాజపేయి పాలన మీదే కాక వ్యక్తిగా వాజపేయి మీద అభిమానం పెంచుకుంటున్నారు.
వాజపేయి పార్లమెంటరీ జీవితం అనేక రకాలుగా ఆదర్శప్రాయమైంది. ఈ మాట చెప్పడానికి వాజపేయి రాజకీయాలను సమర్థించనక్కర్లేదు. కానీ వాజపేయి ప్రజా జీవనం, వ్యక్తిగత జీవితం చుట్టూ అనేక మిథ్యలూ ఉన్నాయి. అభిషేక చౌదరీ ఈ మిథ్యలను గాలి బుడగల్లా పేల్చేశారు. పార్లమెంటులో వాజపేయి సామర్థ్యాన్ని చూసి భవిష్యత్తులో ఈ కుర్రోడు దేశ ప్రధానమంత్రి అవుతాడు అని నెహ్రూ వ్యాఖ్యానించారని చెప్పుకుంటారు. అది కేవలం మిథ్యేనంటారు అభిషేక్‌.
వ్యక్తిగత జీవితం దగ్గరకు వస్తే వాజపేయి చుట్టూ అనేక కథలున్నాయి. ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి సంబంధించీ అనేక కథలున్నాయి. అయితే ‘‘నాకు పెళ్లి కాలేదు కానీ బ్రహ్మచారిని కాను’’ అని వాజపేయి స్వయంగా చెప్పుకునే వారు. అభిషేక్‌ ఈ గ్రంథంలో కొన్ని అంశాలు బయట పెట్టారు. రాజ్‌ కుమారీ కౌల్‌తో వాజపేయికి సాన్నిహిత్యం ఉండేది. కారణాంతరాల వల్ల ఆమె బిర్జన్‌ కౌల్‌ ను పెళ్లాడాల్సి వచ్చింది. అయినా కౌల్‌ కు వాజపేయికి మధ్య ప్రేమానురాగాలు కొనసాగాయి. ఎక్కువ భాగం ఆమె, ఆమె భర్త వాజపేయి ఇంట్లోనే ఉండే వారు. ఫోన్‌ మోగితే ఆమే ఎత్తే వారు. వాజపేయి పెంపుడు కూతురు అనుకునే నమిత నిజానికి రాజకుమారి కౌల్‌ కు, వాజపేయికి పుట్టిన కూతురేనని అభిషేక్‌ చౌదరీ అంటారు. వాజపేయి మరణించినప్పుడు ఆయన చితికి నిప్పు పెట్టింది కూడా ఈ నమితే. చిన్న వయసులోనే వాజపేయి సంఫ్‌ు పరివార్‌ తరఫున రాష్ట్ర ధర్మ, పాంచజన్య పత్రికలకు వ్యవస్థాపక సంపాదకులుగా ఉన్నారు. మహాత్మా గాంధీ హత్య మానవాళికి తీవ్ర విఘాతం అన్న అభిప్రాయం వాజపేయి ఈ పత్రికల్లో ఎక్కడా వ్యక్తం చేయలేదట. పైగా గాంధీ హత్యకు దారి తీసిన పరిస్థితులకు అనువైన రచనలు వాజపేయి చేశారంటారు. ఇందులో కొంత నింద వాజపేయి భరించాల్సిందేనంటారు అభిషేక్‌ చౌదరి.
‘‘సవ్యమైన వ్యక్తి అపసవ్యమైన పార్టీలో ఉన్నాడు’’ అని వాజపేయి గురించి చెప్తారు. కానీ అలా కాకుండా వాజపేయి సైద్ధాంతికత అదే కనక ఆయన ఉన్న పార్టీయే ఆయనకు సరైంది అని అభిషేక్‌ నిగ్గు తేల్చారు. హిందుత్వ ఎజెండా అమలు చేయడంలో వాజపేయి అడ్వాణీకన్నా, మోదీ కన్నా భిన్నంగా వ్యవహరించి ఉండవచ్చు. కానీ ఆయనలో హిందుత్వ తక్కువేమీ కాదు అని ఈ గ్రంథం చదివితే అర్థం అవుతుంది. ఈ గ్రంథంలో వాజపేయి-కౌల్‌ ప్రేమానురాగాల గురించి నాలుగైదు పేజీలకన్నా లేదు. కానీ జనాన్ని ఆకర్షించడంలో ఆ కొద్ది పేజీల పాత్రే ఎక్కువ. పబ్లిక్‌గా నిలబడ్డ వ్యక్తులు ఏం చేసినా జనం ఆసక్తి కనబరుస్తారు. అభిషేక్‌ మసాలా చేర్చడానికి ఈ విషయాలు ప్రస్తావించలేదు. వాస్తవాన్వేషణకే కట్టుబడ్డారు. వాజపేయిలోని భిన్న కోణాల గురించి తెలుసుకోవడానికి అభిషేక్‌ గ్రంథం బాగా తోడ్పడుతుంది. వాజపేయి 2018లో మరణిస్తే రాజ్‌ కుమారీ కౌల్‌ 2014లోనే మరణించారు. ఆమె అంత్యక్రియలకు హాజరైన బీజేపీ నాయకుల జాబితా చూస్తే వాజపేయి జీవితంలో ఆమె స్థానం ఏమిటో రుజువు అవుతుంది. లాల్‌ కృష్ణ అడ్వానీ, రాజ్‌ నాథ్‌ సింగ్‌, సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ, రవి శంకర్‌ ప్రసాద్‌, జ్యోతిరాదిత్య సింధియా లాంటి అగ్రశ్రేణి బీజేపీ నాయకులు ఉన్నారు. వాజపేయి అప్పటికి సజీవంగా ఉన్నా అనారోగ్యం పాలైనందువల్ల హాజరు కాలేక పోయారు.

  • ఆర్వీ రామారావ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img