Friday, April 26, 2024
Friday, April 26, 2024

అల్లర్ల రహిత యూపీగా తీర్చిదిద్దుతాం

బీజేపీకి ఓట్లేయండి: మోదీ విజ్ఞప్తి
సహరాన్‌పూర్‌(యూపీ): సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)పై ప్రధాని నరేంద్రమోదీ గురువారం నిప్పులు చెరిగారు. అల్లరిమూకలకు, మాఫియాకు ఆ పార్టీ అండగా నిలిచిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నేరస్తులకు టికెట్లు ఇచ్చి పోటీ చేయించిందని అన్నారు. సహరాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌ను అల్లర్ల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి బీజేపీ ప్రభుత్వం అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు చెప్పుకొచ్చారు. ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ముస్లిం మహిళలకు రక్షణ కావాలంటే రాష్ట్రంలో ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం అవసరమన్నారు. సహరాన్‌పూర్‌లో అల్లర్లకు కుట్రదారులు ఎస్‌పీ పెంచిపోషించిన మాఫియా మద్దతుదారులని ఆరోపించారు. వారికి ఈ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిందని తెలిపారు. కేవలం ఒక్క సహరాన్‌పూర్‌లోనే కాదని, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ మొత్తం నేరస్తులను ఎస్‌పీ పోటీకి దించిందని మండిపడ్డారు. ఆ అభ్యర్థులు తమ గెలుపుకోసం సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సైతం పాల్పడుతున్నారని మోదీ చెప్పారు. ముజఫర్‌నగర్‌, సహరాన్‌పూర్‌లలో భయానక వాతావరణం సృష్టించారని, రాజకీయ ముసుగులో సహరాన్‌పూర్‌లో ఎవరిని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారో ఆధారాలు ఉన్నాయన్నారు. ఇలాంటి చర్యలన్నింటినీ గుర్తుంచుకొని సమాజ్‌వాదీ పార్టీకి గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2013లో ముజఫర్‌నగర్‌లోనూ, 2014లో సహరాన్‌పూర్‌లోనూ మత ఘర్షణలు జరిగిన విషయం విదితమే. ట్రిపుల్‌ తలాక్‌ చట్టాన్ని ప్రస్తావిస్తూ ప్రతి అణగారిన, బాధిత ముస్లిం మహిళకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ముస్లిం మహిళలను ఎవరూ అణచివేయలేరని, అందుకోసం యోగి ప్రభుత్వం ఇక్కడ అవసరమని ప్రధాని అన్నారు. మహిళలు నిర్భీతిగా జీవించడానికి, నేరస్తులను జైళ్లకు పంపడానికి యూపీలో బీజేపీ ప్రభుత్వం తప్పనిసరని తెలిపారు. యోగి ప్రభుత్వం పేదలకు రూ.5లక్షల వరకు పెద్దపెద్ద ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నదని చెప్పారు. పీఎం కిసాన్‌ యోజన కింద సన్నకారు రైతుల ఖాతాల్లో డబ్బులే వేస్తున్నామన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రజలు బీజేపీకి ఓటేయాలని నిర్ణయించుకున్నారన్నారు. పీఎం అవాస్‌ యోజన ఇళ్లు కొనసాగాలంటే బీజేపీ ప్రభుత్వం ఉండాలన్నారు. యోగి ప్రభుత్వం రాష్ట్రంలో మంచి రోడ్లు వేయించిందన్నారు. అనేక ప్రాంతాలను అనుసంధానం చేసే రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌ వే, దిల్లీడెహ్రాడూన్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, దిల్లీయమునోత్రి జాతీయ రహదారి, దిల్లీ`సహరాన్‌పూర్‌ నాలుగు లైన్ల రోడ్డు, సహరాన్‌పూర్‌ విమానాశ్రయం వంటి అనేక మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఏమి చెప్పిందో అది చేసిందన్నారు. గతం కన్నా చెరకు రైతులకు తమ ప్రభుత్వం మేలు చేసిందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని మోదీ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై నమ్మకం కలిగిందని చెప్పారు. ఎస్‌పీ బూటకపు హామీలు ఇస్తున్నదని, ఎవరూ ఆ పార్టీ మాయలో పడవద్దని ఓటర్లను వేడుకున్నారు.
ఓట్ల కోసం రావత్‌ కటౌట్లు వాడుకుంటున్నారు
శ్రీనగర్‌(ఉత్తరాఖండ్‌): కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. బ్రతికుండా జనరల్‌ బిపిన్‌ రావత్‌ను దుర్భాషలాడిన కాంగ్రెస్‌..ఇప్పుడు ఓట్ల కోసం ఆయన కటౌట్లను వాడుకుంటుందని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు. పాకిస్థాన్‌లో ఉగ్రశిబిరాలపై జరిగిన మెరుపుదాడి(సర్జికల్‌ స్ట్రైక్స్‌)కి ఇదే కాంగ్రెస్‌ సాక్ష్యాలు అడిగిందని గుర్తుచేశారు. మాజీ సీడీఎస్‌ జనరల్‌ రావత్‌ను కాంగ్రెస్‌ నేత ఇప్పటికీ వీధిరౌడీ అని విమర్శిస్తున్నారని మోదీ చెప్పారు. అధికారం కోసం కాంగ్రెస్‌ పార్టీ అర్రులు చాస్తోందని ఆరోపించారు. త్యాగాల విలువ కాంగ్రెస్‌కు తెలియదని, జనరల్‌ రావత్‌ను అగౌరవ పరిచిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అభివృద్ధి కార్యకలాపాలను వెనక్కి నెట్టాయని, ప్రజలను వలసబాట పట్టించాయని ఆరోపించారు. బీజేపీ బుధవారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ఉత్తరాఖండ్‌ను మరింత అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లడానికి దోహదపడుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img