Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇది చారిత్రక విజయం

రైతులకు సీపీఐ అభినందనలు
న్యూదిల్లీ : వివాదాస్పద మూడు సాగు చట్టాల రద్దు కోసం మోదీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసి, అద్భుత విజయం సాధించిన రైతులు, రైతు సంఘాలకు సీపీఐ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. మోదీ సర్కారు తీసుకొచ్చిన రైతు వ్యతిరేక సాగు చట్టాలపై ఎండనకా, వాననకా, ఎముకలు కొరికే చలిలోనూ 378 రోజులు నిరాఘాటంగా అన్నదాతలు ఆందోళనలు కొనసాగించారని సీపీఐ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గం తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా రైతులకు అభినందనలు తెలిపారు. రైతులది చారిత్రక విజయమని ఆయన అభివర్ణించారు. ఆందోళనను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం), ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) పాత్ర అద్వితీయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని రాజా పేర్కొన్నారు. చివరికి రైతుల నిజమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేలా ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయని తెలిపారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సుహృద్భావ వాతావరణంలో, సానుకూల దృక్పథంతో చర్చలు జరపడం, భాగస్వాములను విశ్వాసంలోకి తీసుకోవడం ద్వారా మాత్రమే మంచి ఫలితాలు సాధించవచ్చు. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు. ఈ వాస్తవాలు తెలుసుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్‌`బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వానికి చాలా సమయం పట్టింది. ప్రజల వాస్తవిక సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం నియంతృత్వం, అహంకారాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉంది’ అని రాజా అభిప్రాయపడ్డారు. మోదీ సర్కారు తన నిరంకుశ, నిర్లక్ష్య వైఖరితో రైతులనే కాకుండా దేశంలోని ప్రజాస్వామిక శక్తులను తీవ్రంగా గాయపరిచినట్లు తమ పార్టీ బలంగా విశ్వసిస్తోందని రాజా విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు తీవ్ర ప్రభావం చూపుతాయని, రైతులు, రైతు కుటుంబాలు బీజేపీకి గట్టి గుణపాఠం చెబుతారని స్పష్టంచేశారు. 378 రోజులుగా ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను అన్నదాతలు మర్చిపోలేరని, ఇవన్నీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. రైతు ఉద్యమానికి మద్దతు, సంఫీుభావం తెలిపిన కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళా సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. రైతుల ఉద్యమం విజయవంతం కావడానికి అండగా నిలిచిన రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img