Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఏప్రిల్‌లో రాష్ట్రానికి మోదీ, షా

కేబినెట్‌ విస్తరణపై చర్చలుండవ్‌: బొమ్మై
హుబ్బళ్లి: ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఏప్రిల్‌ మొదటివారం కర్ణాటకలో అధికారికంగా పర్యటించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శనివారం చెప్పారు. వారి పర్యటన సమయంలో కేబినెట్‌ మార్పు, చేర్పుల గురించి ఎలాంటి చర్చలు ఉండబోవని స్పష్టంచేశారు. బడ్జెట్‌ అమలు పర్యవేక్షణ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆర్థికమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న బొమ్మై తెలిపారు. క్షీరాభివృద్ధి బ్యాంకు సమావేశంలో పాల్గొనేందుకు అమిత్‌షా ఏప్రిల్‌ ఒకటిన రాష్ట్రానికి వస్తున్నారని బొమ్మై చెప్పారు. సహకార శాఖమంత్రిగా సహకార రంగంలో సంస్కరణల కోసం ఆయన కృషి చేస్తున్నట్లు వెల్లడిరచారు. డెయిరీ రంగానికి ఆర్థికంగా ఊతమిచ్చే లక్ష్యంతో క్షీరాభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించామన్నారు. బొమ్మై శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఏప్రిల్‌ 5న రాష్ట్రానికి వస్తారని భావిస్తున్నామని, ఈ తేదీ అధికారికంగా ఖరారు కాలేదన్నారు. మోదీ, షా పర్యటన సమయంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కేబినెట్‌ విస్తరణపై చర్చ జరిగే అవకాశం ఉందా అని అడుగగా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వారు రాష్ట్రానికి వస్తున్నారని, బెంగళూరులో కేబినెట్‌పై చర్చ ఉండదని తేల్చిచెప్పారు. నాయకత్వం నుంచి పిలుపువస్తే తానే దిల్లీ వెళతానని తెలిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేబినెట్‌ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరుగుతున్న విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img