Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

జైళ్ల శాఖ డీజీ హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

జమ్మూ-కశ్మీరు జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ హేమంత్‌ లోహియా హత్య కేసులో నిందితుడు యాసిర్‌ లోహర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ప్రశ్నించడం ప్రారంభమైనట్లు చెప్పారు. రాత్రంతా నిర్వహించిన గాలింపు చర్యల్లో నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. ఏడీజీపీ ముకేశ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ, జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ హేమంత్‌ లోహియా హత్య కేసులో నిందితుడు యాసిర్‌ లోహర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. రాత్రంతా నిర్వహించిన గాలింపు చర్యల్లో అతనిని కనచక్‌ ప్రాంతంలో పట్టుకున్నట్లు చెప్పారు. అతనిని ప్రశ్నిస్తున్నామన్నారు. నిందితుడు యాసిర్‌ నేరానికి పాల్పడిన తర్వాత తన వద్దనున్న ఫోన్‌ను పారేశాడని తెలిపారు. కనచక్‌ ప్రాంతంలో పొలాల్లో దాక్కున్నాడని చెప్పారు. ఈ నేరం చేయడానికి నిందితుడు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని డైరీని కూడా గుర్తించారు. దానినిబట్టి నిందితుని మానసిక స్థితి సక్రమంగా లేనట్లు తెలుస్తోందని చెప్తున్నారు. హేమంత్‌ లోహియా సోమవారం రాత్రి తన నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించారు. ఆయన ఇంట్లో పని చేస్తున్న యాసిర్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలావుండగా, హేమంత్‌ హత్యకు తమదే బాధ్యత అని లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా మన దేశంలో పని చేస్తున్న పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫోర్స్‌ ప్రకటించింది. ఇది హై వాల్యూ టార్గెట్‌ అని, తమ స్పెషల్‌ స్క్వాడ్‌ ఈ ఆపరేషన్‌ను నిర్వహించిందని ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇలాంటి హై ప్రొఫైల్‌ ఆపరేషన్స్‌ను ఇకపై ఇంకా ఎక్కువగా నిర్వహిస్తామని హెచ్చరించింది. ఏ సమయంలోనైనా, ఎక్కడైనా అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలమని తెలిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన సందర్భంగా ఇది చిన్న బహుమానమని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img