Friday, April 26, 2024
Friday, April 26, 2024

తండ్రీకొడుకులను అరెస్టు చేయాలి

రైతు నాయకుల డిమాండ్‌
న్యూదిల్లీ : లఖింపూర్‌ ఖేరీలో నలుగురు అన్నదాతలను కార్లతో ఢీకొట్టి చంపిన కేసులో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా, ఆయన కుమారుడు ఆశిష్‌మిశ్రాలను తక్షణమే అరెస్టు చేయాలని రైతు నాయకులు శనివారం డిమాండు చేశారు. ముందస్తు పథకం ప్రకారమే ఈ దారుణం చోటుచేసుకుందని నిశితంగా విమర్శించారు. ఇది ముమ్మాటికీ ముందస్తు కుట్రేనని స్పష్టంచేశారు. ఈ కేసుకు ప్రధాన కుట్రదారుడు, నిందితులను కాపాడుతున్న అజయ్‌మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) నాయకుడు యోగేంద్ర యాదవ్‌ డిమాండు చేశారు. యోగేంద్రయాదవ్‌ ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హింసకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల దిష్టిబొమ్మలను అక్టోబరు 15 దసరా నాడు ఎస్‌కేఎం దహనం చేస్తుందని చెప్పారు. పథకం ప్రకారమే లఖింపూర్‌ ఘటన చోటుచేసుకుందని, రైతులను భయభ్రాంతులకు గురిచేసేందుకు నిందితులు ప్రయత్నించారని రైతు నాయకుడు దర్శన్‌ పాల్‌ విమర్శించారు. తమ డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న రైతులపై హింసాత్మక చర్యలకు దిగాలని ప్రభుత్వం కంకణం కట్టుకుందని యోగేంద్ర చెప్పారు. అయితే, తమది హింసామార్గం కాదని స్పష్టంచేశారు. లఖింపూర్‌ఖేరీ హింసకు నిరసనగా అక్టోబరు 18న రైల్‌రోకోకు ఎస్‌కేఎం పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img