Friday, April 26, 2024
Friday, April 26, 2024

బంగ్లా విజయ్‌ దివస్‌లో కోవింద్‌

ఢాకా : పాకిస్థాన్‌తో 1971లో జరిగిన విముక్తి యుద్ధంలో విజయానికి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌ విజయోత్సవం జరుపుకుంది. ఢాకాలో గురువారం ఇక్కడి నేనషనల్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోనిర్వహించిన విజయ్‌ దివస్‌ కార్యక్రమంలో గౌరవ అతిథిగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగ్లా సైన్యం కళ్లు చెదిరే రీతిలో వైమానిక విన్యాసాలు, రక్షణ ఆయుధాల ప్రదర్శనతో తన సైనిక శక్తిని చాటింది. ఈ సందర్భంగా నిర్వహించిన నేషనల్‌ పరేడ్‌లో బంగ్లా రాష్ట్రపతి హమీద్‌ గౌరవ వందనం స్వీకరించగా, ప్రధాని హసీనాతో పాటు భారత ప్రధాని కోవింద్‌ కవాతును వీక్షించారు. అలాగే మంత్రులు, దౌత్యవేత్తలు, ఇతర ప్రముఖులు వీక్షించిన పరేడ్‌లో భారత్‌ నుంచి 122 మంది తో కూడిన ట్రై సర్వీసెస్‌ సైనిక దళం కూడా పాల్గొంది. ఈ సందర్భంగా కోవింద్‌.. 1971 కాలం నాటి మిగ్‌ 21 యుద్ధవిమానం ప్రతిరూపాన్ని అబ్దుల్‌ హమీద్‌కు జ్ఞాపికగా బహూకరించారు. రెండుదేశాల సైన్యాలు చేసిన త్యాగానికి గుర్తుగా దీన్ని అందించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు. వేదిక వద్దకు చేరుకున్న భారత రాష్ట్రపతి కోవింద్‌, ప్రథమ మహిళ సవితా కోవింద్‌లకు బంగ్లా రాష్ట్రపతి హమీద్‌, ప్రధాని హసీనా సాదర స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఏకైక విదేశీ దేశాధినేత కోవింద్‌ మాత్రమే. భారత్‌తో పాటు రష్యా, భూటాన్‌లకు చెందిన సైనిక బృందాలు కూడా కవాతులో పాల్గొన్నాయి. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం పొందిన తర్వాత విజయోత్సవంలో విదేశీ సైనికులు పాల్గొనడం ఇదే తొలిసారి. మిలటరీ బ్యాండ్‌తో సహా 122 మంది సభ్యులతో కవాతులో పాల్గొన్న భారతీయ సైనిక బృందం అతిపెద్దది. మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బంగ్లాదేశ్‌కు వెళ్లారు. ఢాకాలో నిర్వహించే 50వ ‘విజయ్‌ దివస్‌’ వేడుకల్లో భారత్‌ తరఫున గౌరవ అతిథిగా హాజరు కావాలని కోవింద్‌ను బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు ఆహ్వానించారు. పర్యటనలో భాగంగా బుధవారం షేక్‌ హసీనాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బహుముఖ, సమగ్రమైన ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరుపక్షాలు సమీక్షించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఏడాది జనవరి 26న న్యూదిల్లీలో జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బంగ్లాదేశ్‌కు చెందిన ట్రై-సర్వీసెస్‌ బృందం కూడా పాల్గొంది.
అంతకుముందు, అధ్యక్షుడు హమీద్‌, ప్రధాన మంత్రి హసీనా సవర్‌లోని జాతీయ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి విమోచన యుద్ధంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
వేగంగా ఫ్రెండ్‌షిప్‌ ప్రాజెక్టు పనులు
భారత్‌-బంగ్లాదేశ్‌లు తమ ఇంధన అవసరాలను ఏకీకృతం చేసేందుకు వీలు కల్పించే ఫ్రెండ్‌షిప్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని, వచ్చే ఏడాది దీనిని ప్రారంభించే అవకాశం ఉందని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తెలిపారు. రూ. 346 కోట్లతో భారత్‌-బంగ్లాదేశ్‌ ఫ్రెండ్‌షిప్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌ (ఐబీఎఫ్‌పీపీ) పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి` బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌ జిల్లా పర్బతిపూర్‌లను కలుపుతుంది. 130 కిలోమీటర్ల పైపులైన్‌ సామర్థ్యం ఏడాదికి మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img