Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

యూపీలో బీజేపీకీ భారీ ఎదురుదెబ్బ…

మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య రాజీనామా
పార్టీని వీడిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు
సమాజ్‌వాది పార్టీలో చేరికకు సన్నాహాలు

లక్నో/న్యూదిల్లీ : ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి, యోగి ఆదిత్యనాథ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య రాజీనామా చేశారు. మరో ముగ్గురు బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేసి అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో ఒక ప్రముఖ మంత్రిగా, వెనుకబడిన కులాల నాయకుడిగా ఉన్న స్వామి ప్రసాద్‌ మౌర్య తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాసేపటికే ఆయన ప్రజల్లోకి వెళ్లారు. దీంతో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రోషన్‌ లాల్‌ వర్మ, బ్రిజేష్‌ ప్రజాపతి, భగవతి సాగర్‌లు కూడా తమ రాజీనామాలను ప్రకటించారు. మౌర్య తనతోపాటు మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలను తీసుకువెళ్లవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ‘విభిన్నమైన భావజాలం ఉన్నప్పటికీ, యోగి ఆదిత్యనాథ్‌ మంత్రివర్గంలో అంకితభావంతో పని చేశాను. కానీ దళితులు, ఓబీసీలు, రైతులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారులు తీవ్ర అణచివేతకు గురవుతున్నందున నేను రాజీనామా చేస్తున్నాను’ అని స్వామి ప్రసాద్‌ మౌర్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘నా నిష్క్రమణ బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో 2022 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తేలిపోతుంది’ అని అన్నారు. ట్విట్టర్‌లో మౌర్య లేఖ వెలువడగానే, అఖిలేష్‌ యాదవ్‌ స్వామి ప్రసాద్‌ మౌర్యతో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్‌ చేశారు. సమాజ్‌ వాదీ పార్టీలోకి అతనిని, అతని మద్దతుదారులను స్వాగతించారు. ‘సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడే నాయకుడు స్వామి ప్రసాద్‌ మౌర్య, అతని మద్దతుదారులందరినీ నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. సామాజిక న్యాయంలో విప్లవం ఉంటుంది. 2022లో మార్పు రాబోతుంది’ అని అఖిలేష్‌ హిందీలో ట్వీట్‌ చేశారు. కాగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రోషన్‌ లాల్‌ వర్మ మౌర్యతో కలిసి బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇదిలాఉండగా ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ట్విట్టర్‌లో ఒక విజ్ఞప్తిని పోస్ట్‌ చేశారు. ‘స్వామి ప్రసాద్‌ మౌర్య ఎందుకు నిష్క్రమించారో నాకు తెలియదు. కానీ నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను, విడిచిపెట్టవద్దు. కానీ మాట్లాడనివ్వండి. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు ప్రతికూలంగా మారవచ్చు’ అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు యోగి ఆదిత్యనాథ్‌, బీజేపీ అగ్ర నేతలు దిల్లీలో సమావేశమైనందున లక్నోలో నిష్క్రమణలు ప్రారంభమయ్యాయి. ఒక శక్తివంతమైన ఓబీసీ(ఇతర వెనుకబడి వర్గాలు) నాయకుడు అయిన మౌర్య అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. మాయావతికి చెందిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ)ని వీడిన తర్వాత 2016లో బీజేపీలో చేరారు. తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని పదరౌనా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మౌర్య ఉన్నారు. ఆయన కుమార్తె సంఘమిత్ర మౌర్య బీజేపీ ఎంపీ, లోక్‌సభకు బదౌన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశంలో రాజకీయంగా అత్యంత కీలకమైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌గా ఉంది. 2024 జాతీయ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా విస్తృతంగా పరిగణించబడే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా యూపీలో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను మార్చి 10న ప్రకటిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img