Friday, April 26, 2024
Friday, April 26, 2024

యూపీలో 100 స్థానాలు గెలుచుకుంటాం : కాంగ్రెస్‌

లక్నో : వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 100 సీట్లు గెలుచుకుంటుందని, రాజకీయాల్లో అద్భుతాలు జరుగుతాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రదీప్‌ మాధుర్‌ శనివారం విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నాయకత్వం వహించాలని మెజారిటీ కాంగ్రెస్‌ కార్యకర్తలు కోరుకుంటున్నారని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమెలో చూస్తారని, మాథుర్‌ చెప్పారు. ‘అన్నీ సవ్యంగా జరిగితే (యుపి అసెంబ్లీ ఎన్నికల్లో) మాకు 100 సీట్లు వస్తాయని మేము భావిస్తున్నాము’ అని మాథుర్‌ పీటీఐతో చెప్పారు. ప్రస్తుతం యూపీ అసెంబ్లీలో ఏడు స్థానాల స్థితి నుంచి మూడంకెలకు జంప్‌ చేయడం సాధ్యమేనా అడగ్గా ‘బీజేపీ తన సంఖ్యను రెండు నుంచి మెజారిటీకి పెంచుకోగలిగినప్పుడు, కాంగ్రెస్‌ ఎందుకు పెంచుకోలేదు.. నేను చెప్పేది పూర్తిగా వాస్తవం.. ప్రియాంక గాంధీ వాద్రా యూపీకి వస్తే దీనిని సులభంగా సాధించవచ్చు’ అని బదులిచ్చారు. ఎన్నికలకు ముందు పార్టీ ప్రకటించిన 12,000 కిలోమీటర్ల యాత్ర పార్టీ కార్యకర్తలను చైతన్యపరుస్తుందని ఆయన తెలిపారు. రాజకీయాలలో అద్భుతాలు జరుగుతాయని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు లేదా కాంగ్రెస్‌ లేకుండా ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబడదని పేర్కొన్నారు. ఇక యూపీలో కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ప్రియాంక గాంధీపై బీజేపీ పదే పదే విరుచుకుపడటంపై మాథుర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు లక్నో వచ్చినప్పుడల్లా బీజేపీ అధిష్ఠానానికి ఇది పరిపాటిగా మారింది. బీజేపీకి తగిన సమాధానం ఇవ్వగల ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అని వారికి తెలుసు కాబట్టే భయపడుతున్నారు. ఈ కారణంగానే వారు ప్రియాంకా గాంధీకి వ్యతిరేకంగా అసంబద్ధ వ్యాఖ్యలు చేయడానికి ప్రయత్నించారు’ మాథుర్‌ అన్నారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ను లీటరుకు రూ .30 చొప్పున విక్రయిస్తామని చెప్పేవారని, కానీ ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దాదాపు రూ .100 దాటి పోయాయన్నారు. బీజేపీ పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని, వచ్చే ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశమివ్వాలని యోచిస్తున్నట్లు మాథుర్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ రెండో వేవ్‌ను ఎదుర్కోవడంలో బీజేపీ సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img